
తిరువనంతపురం : ప్రధాని నరేంద్ర మోదీ కేరళ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమలలో తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించడంలో పినరయ్ విజయన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కమ్యూనిస్టులది, కాంగ్రెస్ పార్టీది ఒకే రకమైన తత్వమని పేర్కొన్నారు. కమ్యూనిస్ట్‌లు భారతదేశ సంస్కృతిని, ఆధ్యాత్మిక సంప్రదాయాలను గౌరవించరని మండిపడ్డారు. అంతేకాక శబరిమల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకే మాట మీద నిలబడటం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ వాళ్లు పార్లమెంట్‌లో ఒకలా.. పథనంథిట్టలో మరొకలా మాట్లాడతారని ఆరోపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పేర్లు మాత్రమే వేరు.. కానీ అవినీతి, కులతత్వం, మతతత్వం, కేరళ సాంస్కృతిక కల్పనను దెబ్బతీయడంలో రెండు ఒకేలా పని చేస్తాయని ఆరోపించారు. ఇవి రెండు పెద్ద అవకాశవాద పార్టీలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.