తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించిన మోదీ
కొల్లం(కేరళ), బలంగిర్(ఒడిశా): శబరిమల అంశంపై కేరళ ప్రభుత్వం అత్యంత హీనంగా వ్యవహరించి, చరిత్రలో నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రేషన్ సరుకులను పక్కదారి పట్టకుండా ఆపి, రూ.90వేల కోట్ల కుంభకోణాన్ని బట్టబయలు చేసినందుకు తనను తొలగించేందుకు కుట్ర జరిగిందని ప్రధాని ఆరోపించారు. మంగళ వారం ఆయన కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లం (కేరళ), బలంగిర్ (ఒడిశా)లలో జరిగిన కార్యక్రమాల్లో ప్రసంగించారు. అవినీతి, మతతత్వం, కులతత్వం అంశాల్లో కేరళలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్‌డీఎఫ్) ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఒకే నాణేనికి రెండు పార్శా్వల వంటివని పేర్కొన్నారు.
‘శబరిమల అంశంపై కేరళలోని వామపక్ష ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత హీనమైందిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇలా మరే ప్రభుత్వం కానీ, పార్టీ కానీ చేయలేదు. కమ్యూనిస్టులకు చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలపై ఏమాత్రం గౌరవభావం ఉండదని మనకు తెలుసు. కానీ, ఇంత హేయంగా వ్యవహరిస్తుందని ఎవరూ ఊహించలేరు’ అని తీవ్రంగా దుయ్యబట్టారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై పార్లమెంట్ లోపల ఒకలా, పత్తనంతిట్ట (అయ్యప్ప కొలువైన జిల్లా)లో మరోలా మాట్లాడుతున్న కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. కేరళ ప్రజలకు, వారి సంప్రదాయాలకు రక్షణగా నిలిచే ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పారు. ‘యూడీఎఫ్, ఎల్డీఎఫ్ లకు ఒక్కటే చెబుతున్నా. మా కార్యకర్తను తక్కువగా చూడొద్దు. త్రిపురలో జరిగిందే ఇక్కడా జరుగుతుంది’ అని అన్నారు.
నన్ను తొలగించేందుకు కుట్ర
నకిలీ పత్రాల ద్వారా రూ.90వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకున్నందుకు తనను పదవి నుంచి తొలగించేందుకు చూశారని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘గత ప్రభుత్వాల హయాంలో దళారులు.. లేకపోయినా ఉన్నట్లు పత్రాలు సృష్టించి రేషన్ కార్డులు, వంట గ్యాస్ కనెక్షన్లు, పింఛన్లు పొందారు. మా ప్రభుత్వం అలాంటి ఆరు కోట్ల పేర్లను గుర్తించి రూ.90వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టే పెద్ద కుంభకోణాన్ని అడ్డుకుంది. తమ ఆటలు సాగకపోయేసరికి ఈ అక్రమార్కులంతా ఏకమై ఈ‘చౌకీదార్’ను తొలగించేందుకు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు’ అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ కొల్లాంలోని జాతీయ రహదారి–66పై నిర్మించిన 13 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును, బలంగీర్‌లో రూ.1,550 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment