సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ నినాదం కోసం ఆర్కేనగర్ ఎమ్మెల్యే దినకరన్ ప్రయత్నాలు చేపట్టారు. బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్కేనగర్‌లో ఎన్నికల ఖర్చులు, లెక్కలు తేలని దృష్ట్యా, దినకరన్‌పై అనర్హత వేటు పడేనా అన్న చర్చ ఏర్పడింది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం తమకు దూరం కావడంతో ఒక వేదిక కోసం దినకరన్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. కొత్త పార్టీ ప్రకటనకు సిద్ధపడ్డా, చివరి క్షణంలో మనసు మార్చుకున్నారు. ఇందుకు కారణం తనకు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ విచారణలో ఉండడమే. ఈ సమయంలో పార్టీ ప్రకటించిన పక్షంలో వారి పదవులకు సంక్లిష్ట పరిస్థితులు తప్పవన్న విషయాన్ని పరిగణించారు. ఆ ప్రయత్నాన్ని మానుకుని ప్రస్తుతం ఉన్న అన్నాడీఎంకే అమ్మ శిబిరం నినాదాన్ని కొనసాగించేందుకు సిద్ధం అయ్యారు. అయితే, వేదిక ఏర్పాటులో జాప్యంతో తన పక్షాన ఉన్న వాళ్లు మళ్లీ సొంతగూటి వైపుగా తొంగి చూస్తుండడంతో దినకరన్ అప్రమత్తం అయ్యారు. అమ్మ నినాదాన్ని సొంతం చేసుకునేందుకు తగ్గ అనుమతుల కోసం ప్రయత్నాలు చేపట్టారు. ఓ వైపు ఎన్నికల యంత్రాంగాన్ని ఆశ్రయిస్తూ, మరో వైపు కోర్టు ద్వారా అనుమతి పొందేందుకు సిద్ధం అయ్యారు.
హైకోర్టులో పిటిషన్: దినకరన్ తరఫున అన్నాడీఎంకే అమ్మ శిబిరం నినాదాన్ని సొంతం చేసుకునే విధంగా ఢిల్లీ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం వ్యవహారంలో ఎన్నికల యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు గుర్తు చేశారు. ఈ పిటిషన్ విచారణలో ఉన్న దృష్ట్యా, తాము అన్నాడీఎంకే అమ్మ శిబిరంగా ముందుకు సాగేందుకు నిర్ణయించినట్టు వివరించారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఈ ఎన్నికల్లో తమ శిబిరం అన్నాడీఎంకే అమ్మ పేరుతో ముందుకు సాగేందుకు నిర్ణయించి ఉన్నామని, తమకు ఎన్నికల యంత్రాంగం ఒకే చిహ్నం కేటాయించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే, అన్నాడీఎంకే అమ్మ పేరును రిజిస్టర్ చేయాలని కోరుతూ ఎన్నికల యంత్రాంగానికి లేఖను దినకరన్ తరఫున ప్రతినిధులు సమర్పించారు.
వేటు పడేనా.. : దినకరన్ ఎమ్మెల్యే పదవికి వేటు పడేనా అన్న చర్చ తెర మీదకు వచ్చింది.
ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నోట్ల కట్టలు తాండవం చేసినట్టుగా ఆరోపణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో ఆయా అభ్యర్థులు పెట్టిన ఖర్చుల వివరాల మీద లెక్కల్ని తేల్చేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక పర్యవేక్షణ బృందం రంగంలోకి దిగింది. అయితే, ఆయన సమర్పించిన లెక్కల వివరాలు తేలనట్టు సంకేతాలు వెలువడ్డాయి. అధికారుల పరిశీలనలో సాగిన లెక్కలు, దినకరన్ సమర్పించిన లెక్కల్లో తేడాలు ఉండడంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగేనా అన్న ఉత్కంఠ తప్పడం లేదు. డీఎంకే, బీజేపీ అభ్యర్థుల లెక్కలు తేలగా, అన్నాడీఎంకే అభ్యర్థి మదుసూదనన్ ఖర్చుల లెక్కలు కూడా తేలకపోవడంతో సమగ్ర నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించేందుకు ఆ బృందం సమాయత్తం అవుతోంది.
నా కొద్దు పెంపు జీతం: తన ఎమ్మెల్యే పదవికి ప్రభుత్వం అందించనున్న జీతం పెంపును దినకరన్ తిరస్కరించారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ స్పీకర్‌కు బుధవారం లేఖ రాశారు. ఎమ్మెల్యేలకు జీతాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాను ఏకీభవించడం లేదని, ఈ దృష్ట్యా, తనకు పెంపు వద్దే వద్దు అని అందులో వివరించారు. తనకు పాత జీతాన్ని ఇస్తే చాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment