అవినీతిని తరిమికొడతా
రాష్ట్రంలోని అవినీతిని తరిమికొట్టేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేర్కొన్నారు. తిరువణ్ణామలై పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఎంజీఆర్ ప్రారంభించిన నూనె పరిశ్రమను ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వం టాస్మాక్ గోడౌన్‌గా మార్చిందని విమర్శించారు.
వేలూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని అవినీతిని పారద్రోలేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేర్కొన్నారు. తిరువణ్ణామలై పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ కూటమి పార్టీలోని పాట్టాలి మక్కల్ పార్టీ అభ్యర్థి ఎదురొలి మణికి మద్దతుగా బుధవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. విజయకాంత్ మాట్లాడుతూ తిరువణ్ణామలైలో ఎంజీఆర్ ప్రారంభించిన టేన్‌కాప్ నూనె పరిశ్రమ ప్రస్తుతం టాస్మాక్ గోడౌన్‌గా మారిందని వీటిపై డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఏనాడైనా చర్యలు చేపట్టాయా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీంఎకే పార్టీలు కలిసి రాష్ట్రంలోని అనేక పరిశ్రమలను మూసివేయడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు వీధిన పడే దుస్థితి ఏర్పడిందన్నారు. సాతనూర్ డ్యామ్ నుంచి తిరువణ్ణామలైకి వస్తున్న తాగునీరు ప్రస్తుతం నిలిచి పోయిందని దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంగంలోని ప్రభుత్వ ఆస్పత్రిని విస్తరిస్తామని సంవత్సరం క్రితం తెలిపారని, అరుుతే ఇంత వరకూ పనులు ప్రారంభించలేదన్నారు.
గిరివలయానికి ప్రతినెలా ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని అయితే ఇక్కడ కనీస వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని ఇక దేశాన్ని అభివృద్ధి చేస్తామని తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. తాను రాష్ట్రంలోని అవినీతి, కుంభకోణాలను పారద్రోలేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇందుకు నరేంద్ర మోడీ తప్పక సహకరిస్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీ కూటమి అభ్యర్థులు అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు. తాము ఏర్పరుచుకున్న కూటమితో ఇప్పటికే పలు పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. తిరువణ్ణామలైలో ఎదురొలి మణి, డీఎండీకే, పీఎంకే, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.