DMDK President
-
కెప్టెన్‌పై సీఎం పరువునష్టం దావా
చెన్నై : డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరువునష్టం కేసు దాఖలు చేశారు. జయ తరఫున ప్రభుత్వ న్యాయవాది ఎంఎల్ జగన్ సెషన్స్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల మూడో తేదీన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ విడుదల చేసిన ప్రకటనలో చెన్నైలో గతేడాది సంభవించిన వరదలు కృత్రిమంగా సృష్టించబడ్డాయని ఆరోపించారు. అంతేకాకుండా ఈ వరద నష్టాన్ని జయలలిత పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మరునాడు అంటే నాలుగో తేదీ పత్రికలో ప్రకటన వచ్చింది. విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జయలలిత పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉందని, వాస్తవాలకు విరుద్ధమని జయ తరఫు న్యాయవాది జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయనపై పరువునష్టం కింద చర్యలు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వాలని ఆయన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ అడిషనల్స్ సెషన్స్ కోర్టులో త్వరలో విచారణకు రానుంది. ఇదేవిధంగా వరద ముప్పు గురించి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రకటనను విడుదల చేసిన మురసోలి పత్రిక సంపాదకులు సెల్వంపై రెవెన్యూ శాఖా మంత్రి ఉదయకుమార్ తరఫున పరువునష్టం పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. -
అవినీతిని తరిమికొడతా
రాష్ట్రంలోని అవినీతిని తరిమికొట్టేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేర్కొన్నారు. తిరువణ్ణామలై పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఎంజీఆర్ ప్రారంభించిన నూనె పరిశ్రమను ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వం టాస్మాక్ గోడౌన్‌గా మార్చిందని విమర్శించారు. వేలూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని అవినీతిని పారద్రోలేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేర్కొన్నారు. తిరువణ్ణామలై పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ కూటమి పార్టీలోని పాట్టాలి మక్కల్ పార్టీ అభ్యర్థి ఎదురొలి మణికి మద్దతుగా బుధవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. విజయకాంత్ మాట్లాడుతూ తిరువణ్ణామలైలో ఎంజీఆర్ ప్రారంభించిన టేన్‌కాప్ నూనె పరిశ్రమ ప్రస్తుతం టాస్మాక్ గోడౌన్‌గా మారిందని వీటిపై డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఏనాడైనా చర్యలు చేపట్టాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీంఎకే పార్టీలు కలిసి రాష్ట్రంలోని అనేక పరిశ్రమలను మూసివేయడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు వీధిన పడే దుస్థితి ఏర్పడిందన్నారు. సాతనూర్ డ్యామ్ నుంచి తిరువణ్ణామలైకి వస్తున్న తాగునీరు ప్రస్తుతం నిలిచి పోయిందని దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంగంలోని ప్రభుత్వ ఆస్పత్రిని విస్తరిస్తామని సంవత్సరం క్రితం తెలిపారని, అరుుతే ఇంత వరకూ పనులు ప్రారంభించలేదన్నారు. గిరివలయానికి ప్రతినెలా ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని అయితే ఇక్కడ కనీస వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని ఇక దేశాన్ని అభివృద్ధి చేస్తామని తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. తాను రాష్ట్రంలోని అవినీతి, కుంభకోణాలను పారద్రోలేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇందుకు నరేంద్ర మోడీ తప్పక సహకరిస్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీ కూటమి అభ్యర్థులు అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు. తాము ఏర్పరుచుకున్న కూటమితో ఇప్పటికే పలు పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. తిరువణ్ణామలైలో ఎదురొలి మణి, డీఎండీకే, పీఎంకే, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కొత్త నిర్ణయం
కొత్త సంవత్సరంలో సరికొత్తగా నిర్ణయం తీసుకునేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమవుతున్నారు. తమతో జత కట్టాలంటూ ఆఫర్లు పెరుగుతుండడంతో మళ్లీ సర్వ సభ్య సమావేశానికి పిలుపునిచ్చారు. జనవరి 5న జరిగే ఈ సమావేశంలో పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందడి రాజుకుంటోంది. ఆయా పార్టీలు తమ కార్యాచరణల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణను అన్నాడీఎంకే పూర్తి చేసింది. తన నేతృత్వంలో కూటమి లేదా ఒంటరి లక్ష్యంగా డీఎంకే పావులు కదుపుతోంది. ఇక ప్రధాన ప్రతి పక్షండీఎండీకేకు మాత్రం ఆఫర్లు పెరుగుతున్నాయి. తమ కూటమిలోకి వస్తే బాగుంటుందంటూ డీఎంకే, కాంగ్రెస్, బీజేపీలు తెగ ప్రకటనల్ని ఇచ్చేస్తున్నాయి. ఇది డీఎండీకేకు రాష్ట్రంలో ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబింప చేస్తుంది. జాగ్రత్తగా అడుగులు :అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి కూటమిగా వెళ్లి, చివరకు అష్టకష్టాల్ని ఎదుర్కొన్న విజయకాంత్, ఈ సారి జాగ్రత్తగా అడుగులు వేయడానికి నిర్ణయించారు. తమ పార్టీకి ఆఫర్లు పెరుగుతున్నా, నోరు మెదపడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొత్తులపై ఏ ఒక్కరూ మాట్లాడేందుకు వీలు లేదంటూ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. బీజేపీ వైపు వెళ్దామా? లేదా కాంగ్రెస్‌తో జతకడదామా? డీఎంకేతో కలసి పనిచేద్దామా..? అన్న సందేహాలు విజయకాంత్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు సమాచారం. అన్ని పార్టీలు తమతో అంటే తమతో చేతులు కలపాలని ప్రకటనల రూపంలో ఆహ్వానాలు పలుకుతుండ టాన్ని ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. క్రిస్మస్ వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే, బీజేపీకి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువే. ఇక కాంగ్రెస్, డీఎంకేలతో పయనించేందుకు మార్గాలు ఉన్నా, సీట్ల బేరం ఎక్కడ బెడిసి కొడుతుందేమోనన్న బెంగ ఆయన్ను వెంటాడుతున్నట్టు సమాచారం. మళ్లీ సర్వ సభ్య సమావేశం: పార్టీ సీనియర్ నేత బన్రూటి రాజీనామా కలకలంతో ఆగమేఘాలపై వారం రోజుల క్రితం పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని విజయకాంత్ ఏర్పాటు చేశారు. పొత్తులపై తుది నిర్ణయ సర్వాధికారం తనకే అని సమావేశం ద్వారా తీర్మానించారు. ఆ తర్వాత నెలకొన్న రాజకీయ మార్పులు విజయకాంత్‌ను ఆలోచనలో పడేసినట్టున్నాయి. తన నిర్ణయాన్ని అందరితో పంచుకుని సరికొత్తగా తీర్మానించేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకు గాను కొత్త సంవత్సరంలో మళ్లీ సర్వ సభ్య సమావేశానికి శనివారం పిలుపునిచ్చారు. ఈ సారి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కాకుండా తిరువళ్లూరు జిల్లాలో ఉన్న తమ కుటుంబానికి చెందిన కల్యాణ మండపాన్ని వేదికగా చేసుకున్నారు. పొన్నేరి సమీపంలోని చిన్నంబేడులో ఉన్న ఈ కల్యాణ మండపంలో జనవరి ఐదో తేదీ సర్వ సభ్య సమావేశం జరగనున్నది. ఇందులో రాష్ట్రంలోని పార్టీ నాయకులతో పాటుగా ఇతర రాష్ట్రాల్లోని కార్యవర్గాల్ని సైతం ఆహ్వానించారు. ఉన్నత స్థాయిలో జరగనున్న ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై చర్చ ఉంటుందని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా హాజరు కావాల్సిందేనని విజయకాంత్ పిలుపునివ్వడం బట్టి చూస్తే, కొత్త ఏడాదిలో సరికొత్తగా నిర్ణయాన్ని ఆయన ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
రెబల్స్ బెడద
చెన్నై, సాక్షి ప్రతినిధి : డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్‌కు రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారింది. పార్టీని ధిక్కరించడమేగాక సవాల్‌కు ప్రతిసవాల్ విసరడం విజయకాంత్‌ను సందిగ్ధంలో పడవేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎండీకే 41 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో గెలుపొందింది. డీఎంకే కంటే ఎక్కువ స్థానాలు దక్కడంతో విజయకాంత్ ప్రతిపక్ష నేత హోదాను దక్కించుకున్నారు. ఈ హోదాకు సైతం సీఎం జయలలిత సహకరించారు. అయితే క్రమేణా అన్నాడీఎంకేకు దూరమైన డీఎండీకే అమ్మపాలనను విమర్శిం చడం ద్వారా ప్రతిపక్ష పాత్రను పోషించింది. బహిరంగ సభల్లో సైతం అన్నాడీఎంకే పాలనను విజయకాంత్ దుమ్మెత్తిపోయడం అదే పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలకు రుచించలేదు. ఏ పార్టీ అండతో ఎమ్మెల్యేలుగా గెలిచామో అదే పార్టీని విమర్శించడం సహించలేని ఏడుగురు ఎమ్మెల్యేలు ఒకరొకరుగా అమ్మ పంచన చేరారు. ముందుగా మధురై సెంట్రల్ ఎమ్మెల్యే ఆర్ సుందరరాజన్ అమ్మకు జై కొట్టారు. ఆ తరువాత వరుసగా పాండియరాజ న్, తమిళలగన్, సురేష్, మైకేల్ రాయప్పన్, శాంతి, అరుణ్‌పాండియన్ అమ్మ ఆశీర్వాదం పొందారు. నియోజ కవర్గ అభివృద్ధి పనుల కోసం అమ్మను కలిసినట్లు వారు సమర్థించుకున్నారు. డీఎండీకేను ధిక్కరించి అన్నాడీఎంకేతో కలిసి తిరుగుతున్న రెబల్ ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా అని డీఎండీకే అధినేత విజయకాంత్ శుక్రవారం సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించిన రెబల్ ఎమ్మెల్యే ఆర్ సుందరరాజన్ శనివారం ప్రతిసవాల్ విసిరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయూలని కోరడానికి విజయకాంత్ ఎవరని ప్రశ్నించారు. ఏళ్లతరబడి ప్రజలకు సేవచేసినందుకే ఓటర్లు తమను ఎమ్మెల్యేలుగా గెలిపించారని ఆయన అన్నారు. తమ గెలుపునకు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు సైతం కృషి చేశారని తెలిపారు. పార్టీని ధిక్కరిస్తున్నామని కెప్టెన్ భావిస్తున్నట్లయితే రెబల్ ఎమ్మెల్యేలను పార్టీ నుండి డిస్మిస్ చేయడం మంచి మార్గమని పేర్కొన్నారు. తమను డిస్మిస్ చేసే దమ్ముందా అని తాము ప్రశ్నిస్తున్నట్లు సుందరరాజన్ సవాల్ చేశారు. తమిళనాడు ప్రజలకు ఏమీ చేయని విజయకాంత్ ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపడం హాస్యాస్పదమని అన్నారు. తమను వెంటనే డిస్మిస్ చేయూలని, లేకుంటే తమ గురించి ఇకపై మాట్లాడరాదని విజయకాంత్‌కు ఆయన హితవు పలికారు.