కొత్త నిర్ణయం
Published Sun, Dec 29 2013 4:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM
కొత్త సంవత్సరంలో సరికొత్తగా నిర్ణయం తీసుకునేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమవుతున్నారు. తమతో జత కట్టాలంటూ ఆఫర్లు పెరుగుతుండడంతో మళ్లీ సర్వ సభ్య సమావేశానికి పిలుపునిచ్చారు. జనవరి 5న జరిగే ఈ సమావేశంలో పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారు.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందడి రాజుకుంటోంది. ఆయా పార్టీలు తమ కార్యాచరణల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణను అన్నాడీఎంకే పూర్తి చేసింది. తన నేతృత్వంలో కూటమి లేదా ఒంటరి లక్ష్యంగా డీఎంకే పావులు కదుపుతోంది. ఇక ప్రధాన ప్రతి పక్షండీఎండీకేకు మాత్రం ఆఫర్లు పెరుగుతున్నాయి. తమ కూటమిలోకి వస్తే బాగుంటుందంటూ డీఎంకే, కాంగ్రెస్, బీజేపీలు తెగ ప్రకటనల్ని ఇచ్చేస్తున్నాయి. ఇది డీఎండీకేకు రాష్ట్రంలో ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబింప చేస్తుంది. జాగ్రత్తగా అడుగులు :అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి కూటమిగా వెళ్లి, చివరకు అష్టకష్టాల్ని ఎదుర్కొన్న విజయకాంత్, ఈ సారి జాగ్రత్తగా అడుగులు వేయడానికి నిర్ణయించారు.
తమ పార్టీకి ఆఫర్లు పెరుగుతున్నా, నోరు మెదపడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొత్తులపై ఏ ఒక్కరూ మాట్లాడేందుకు వీలు లేదంటూ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. బీజేపీ వైపు వెళ్దామా? లేదా కాంగ్రెస్‌తో జతకడదామా? డీఎంకేతో కలసి పనిచేద్దామా..? అన్న సందేహాలు విజయకాంత్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు సమాచారం. అన్ని పార్టీలు తమతో అంటే తమతో చేతులు కలపాలని ప్రకటనల రూపంలో ఆహ్వానాలు పలుకుతుండ టాన్ని ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. క్రిస్మస్ వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే, బీజేపీకి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువే. ఇక కాంగ్రెస్, డీఎంకేలతో పయనించేందుకు మార్గాలు ఉన్నా, సీట్ల బేరం ఎక్కడ బెడిసి కొడుతుందేమోనన్న బెంగ ఆయన్ను వెంటాడుతున్నట్టు సమాచారం.
మళ్లీ సర్వ సభ్య సమావేశం: పార్టీ సీనియర్ నేత బన్రూటి రాజీనామా కలకలంతో ఆగమేఘాలపై వారం రోజుల క్రితం పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని విజయకాంత్ ఏర్పాటు చేశారు. పొత్తులపై తుది నిర్ణయ సర్వాధికారం తనకే అని సమావేశం ద్వారా తీర్మానించారు. ఆ తర్వాత నెలకొన్న రాజకీయ మార్పులు విజయకాంత్‌ను ఆలోచనలో పడేసినట్టున్నాయి. తన నిర్ణయాన్ని అందరితో పంచుకుని సరికొత్తగా తీర్మానించేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకు గాను కొత్త సంవత్సరంలో మళ్లీ సర్వ సభ్య సమావేశానికి శనివారం పిలుపునిచ్చారు. ఈ సారి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కాకుండా తిరువళ్లూరు జిల్లాలో ఉన్న తమ కుటుంబానికి చెందిన కల్యాణ మండపాన్ని వేదికగా చేసుకున్నారు. పొన్నేరి సమీపంలోని చిన్నంబేడులో ఉన్న ఈ కల్యాణ మండపంలో జనవరి ఐదో తేదీ సర్వ సభ్య సమావేశం జరగనున్నది. ఇందులో రాష్ట్రంలోని పార్టీ నాయకులతో పాటుగా ఇతర రాష్ట్రాల్లోని కార్యవర్గాల్ని సైతం ఆహ్వానించారు. ఉన్నత స్థాయిలో జరగనున్న ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై చర్చ ఉంటుందని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా హాజరు కావాల్సిందేనని విజయకాంత్ పిలుపునివ్వడం బట్టి చూస్తే, కొత్త ఏడాదిలో సరికొత్తగా నిర్ణయాన్ని ఆయన ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Advertisement