new decision
-
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు యప్‌టీవీ!
సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు త్వరలో యప్ టీవీ ట్రిపుల్ ప్లే సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్–యప్ టీవీ సోమవారమిక్కడ అవగాహన ఒప్పందం కుదర్చుకున్నాయి. ప్రత్యేక కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ సీఎండీ పీకే పుర్వార్, యప్ టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. 2009లో ప్రారంభమైన యప్‌టీవీ 12 భాషల్లో 250 లైవ్ టీవీ ఛానల్స్, 5 వేలకుపైగా సినిమాలు, వందకుపైగా టీవీ షోలు, వీడియో కాన్ఫరెన్స్, గేమింగ్, ఒరిజినల్ సిరిస్, ఫస్ట్ డే ఫస్ట్ షో లాంటి సేవలను అందిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా బీఎస్ఎన్ఎల్ మొబైల్ యూజర్లు, బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు యప్ టీవీ సేవలు అందుబాటులోకి వస్తాయి. తాజా ఉదయ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి గ్రామంలో బీఎస్ఎన్ఎల్ సేవలందిస్తోందని, వారందరికీ యప్‌టీవీ ట్రిపుల్ ప్లే సేవలు చేరువవుతాయని చెప్పారు. పునరుద్ధరణ ప్రణాళికపై సీఎండీ పుర్వార్ బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను నెలలో ప్రజల ముందు ఉంచుతామని సంస్థ సీఎండీ పీకే పుర్వార్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్కు కేటాయిస్తారని అంచనా వేస్తున్నట్టు తెలియజేశారు. ‘‘ఉద్యోగుల వేతనాలు దీపావళికి ముందే ఈ నెల 23, 24 నాటికి చెల్లిస్తాం. టెలికం రంగం సవాళ్లతో కూడిన దశలో ఉందని మనకు తెలుసు. పోటీ వల్ల టెలికం కంపెనీలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. బీఎస్ఎన్ఎల్కు ఇతర సమస్యలూ ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య ఎక్కువ. పునరుద్ధరణ ప్యాకేజీ ద్వారా దీనికి పరిష్కారం చూపనున్నాం’’ అని పుర్వార్ వివరించారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి ప్రభుత్వం అనుమతి తెలిపితే... రూ.74 వేల కోట్ల భారం పడుతుందని అంచనా. బీఎస్ఎన్ఎల్ ఆస్తుల్ని విక్రయించడం ద్వారా దీన్ని రికవరీ చేసుకోవాలన్నది ప్రణాళిక. -
కొత్త నిర్ణయం
కొత్త సంవత్సరంలో సరికొత్తగా నిర్ణయం తీసుకునేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమవుతున్నారు. తమతో జత కట్టాలంటూ ఆఫర్లు పెరుగుతుండడంతో మళ్లీ సర్వ సభ్య సమావేశానికి పిలుపునిచ్చారు. జనవరి 5న జరిగే ఈ సమావేశంలో పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందడి రాజుకుంటోంది. ఆయా పార్టీలు తమ కార్యాచరణల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణను అన్నాడీఎంకే పూర్తి చేసింది. తన నేతృత్వంలో కూటమి లేదా ఒంటరి లక్ష్యంగా డీఎంకే పావులు కదుపుతోంది. ఇక ప్రధాన ప్రతి పక్షండీఎండీకేకు మాత్రం ఆఫర్లు పెరుగుతున్నాయి. తమ కూటమిలోకి వస్తే బాగుంటుందంటూ డీఎంకే, కాంగ్రెస్, బీజేపీలు తెగ ప్రకటనల్ని ఇచ్చేస్తున్నాయి. ఇది డీఎండీకేకు రాష్ట్రంలో ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబింప చేస్తుంది. జాగ్రత్తగా అడుగులు :అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి కూటమిగా వెళ్లి, చివరకు అష్టకష్టాల్ని ఎదుర్కొన్న విజయకాంత్, ఈ సారి జాగ్రత్తగా అడుగులు వేయడానికి నిర్ణయించారు. తమ పార్టీకి ఆఫర్లు పెరుగుతున్నా, నోరు మెదపడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొత్తులపై ఏ ఒక్కరూ మాట్లాడేందుకు వీలు లేదంటూ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. బీజేపీ వైపు వెళ్దామా? లేదా కాంగ్రెస్‌తో జతకడదామా? డీఎంకేతో కలసి పనిచేద్దామా..? అన్న సందేహాలు విజయకాంత్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు సమాచారం. అన్ని పార్టీలు తమతో అంటే తమతో చేతులు కలపాలని ప్రకటనల రూపంలో ఆహ్వానాలు పలుకుతుండ టాన్ని ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. క్రిస్మస్ వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే, బీజేపీకి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువే. ఇక కాంగ్రెస్, డీఎంకేలతో పయనించేందుకు మార్గాలు ఉన్నా, సీట్ల బేరం ఎక్కడ బెడిసి కొడుతుందేమోనన్న బెంగ ఆయన్ను వెంటాడుతున్నట్టు సమాచారం. మళ్లీ సర్వ సభ్య సమావేశం: పార్టీ సీనియర్ నేత బన్రూటి రాజీనామా కలకలంతో ఆగమేఘాలపై వారం రోజుల క్రితం పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని విజయకాంత్ ఏర్పాటు చేశారు. పొత్తులపై తుది నిర్ణయ సర్వాధికారం తనకే అని సమావేశం ద్వారా తీర్మానించారు. ఆ తర్వాత నెలకొన్న రాజకీయ మార్పులు విజయకాంత్‌ను ఆలోచనలో పడేసినట్టున్నాయి. తన నిర్ణయాన్ని అందరితో పంచుకుని సరికొత్తగా తీర్మానించేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకు గాను కొత్త సంవత్సరంలో మళ్లీ సర్వ సభ్య సమావేశానికి శనివారం పిలుపునిచ్చారు. ఈ సారి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కాకుండా తిరువళ్లూరు జిల్లాలో ఉన్న తమ కుటుంబానికి చెందిన కల్యాణ మండపాన్ని వేదికగా చేసుకున్నారు. పొన్నేరి సమీపంలోని చిన్నంబేడులో ఉన్న ఈ కల్యాణ మండపంలో జనవరి ఐదో తేదీ సర్వ సభ్య సమావేశం జరగనున్నది. ఇందులో రాష్ట్రంలోని పార్టీ నాయకులతో పాటుగా ఇతర రాష్ట్రాల్లోని కార్యవర్గాల్ని సైతం ఆహ్వానించారు. ఉన్నత స్థాయిలో జరగనున్న ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై చర్చ ఉంటుందని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా హాజరు కావాల్సిందేనని విజయకాంత్ పిలుపునివ్వడం బట్టి చూస్తే, కొత్త ఏడాదిలో సరికొత్తగా నిర్ణయాన్ని ఆయన ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.