కెప్టెన్పై సీఎం పరువునష్టం దావా
చెన్నై : డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరువునష్టం కేసు దాఖలు చేశారు. జయ తరఫున ప్రభుత్వ న్యాయవాది ఎంఎల్ జగన్ సెషన్స్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల మూడో తేదీన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ విడుదల చేసిన ప్రకటనలో చెన్నైలో గతేడాది సంభవించిన వరదలు కృత్రిమంగా సృష్టించబడ్డాయని ఆరోపించారు. అంతేకాకుండా ఈ వరద నష్టాన్ని జయలలిత పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మరునాడు అంటే నాలుగో తేదీ పత్రికలో ప్రకటన వచ్చింది.
విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జయలలిత పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉందని, వాస్తవాలకు విరుద్ధమని జయ తరఫు న్యాయవాది జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయనపై పరువునష్టం కింద చర్యలు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వాలని ఆయన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ అడిషనల్స్ సెషన్స్ కోర్టులో త్వరలో విచారణకు రానుంది. ఇదేవిధంగా వరద ముప్పు గురించి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రకటనను విడుదల చేసిన మురసోలి పత్రిక సంపాదకులు సెల్వంపై రెవెన్యూ శాఖా మంత్రి ఉదయకుమార్ తరఫున పరువునష్టం పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.