TN CM
-
పళని కేబినెట్ లో 31 మంది
చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎడప్పాడి పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన కేబినెట్ లో మొత్తం 31 మందికి చోటు కల్పించారు. దినకరన్ కు మంత్రి ఇస్తారని వార్తలు వచ్చినా ఆయనను పార్టీకే పరిమితం చేశారు. శశికళ బంధువులకు కేబినెట్ లో స్థానం కల్పించలేదు. నలుగురు మహిళలకు స్థానం దక్కింది. తన కేబినెట్ మంత్రుల పేర్లు, వారికి కేటాయించిన శాఖల వివరాలతో కూడిన జాబితాను గవర్నర్ కు పళనిస్వామి అందజేశారు. కీలక పదవులను సీఎం పళని తన వద్దే ఉంచుకున్నారు. 19 శాఖలను తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. మంత్రులకు కేటాయించిన శాఖలు శ్రీనివాసన్- అటవీ శాఖ సెంగొట్టయ్యన్- పాఠశాల విద్య, క్రీడలు, యువజన సంక్షేమం కె రాజు- సహకార శాఖ తంగమణి- విద్యుత్, ఎక్సైజ్ వేలుమణి- మున్సిపల్, గ్రామీణాభివృద్ధి జయకుమార్- మత్స్యకార శాఖ షణ్మగం- న్యాయశాఖ అన్బలగన్- ఉన్నత విద్య వి. సరోజ- సామాజిక సంక్షేమం సంపత్- పరిశ్రమలు కరుప్పనన్- పర్యావరణం కామరాజ్- ఆహార, పౌర సరఫరాలు ఓఎస్ మణియన్- చేనేత, జౌళి కె. రాధాకృష్ణన్- హౌసింగ్, పట్టణాభివృద్ధి సి. విజయభాస్కర్- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కదంబర్ రాజు- సమాచార, ప్రచారం ఆర్ బీ ఉదయ్ కుమార్- రెవెన్యు ఎన్. నటరాజన్- పర్యాటకం కేసీ. వీరమణి- వాణిజ్య పన్నులు కేటీ రాజేంథ్ర బాలాజీ- పాలు, పాడిపరిశ్రమ పీ. బెంజమిన్- గ్రామీణ పరిశ్రమలు నీలోఫెర్ కాఫీల్- కార్మిక శాఖ ఎంఆర్ విజయభాస్కర్- రవాణా శాఖ ఎం మణికందన్- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీఎం రాజ్యలక్ష్మి- గిరిజన సంక్షేమం భాస్కరన్- ఖాదీ రామచంద్రన్- దేవాదాయం వలర్మతి- బీసీ సంక్షేమం బాలకృష్ణారెడ్డి- పశుసంవర్థక శాఖ -
శశికళ తనయుడికి మంత్రి పదవి!
-
శశికళ తనయుడికి మంత్రి పదవి!
చెన్నై: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా నియమితులైన పళనిస్వామి మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టారు. తన కేబినెట్ లో కొత్త ముఖాలకు చోటు కల్పించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. శశికళకు సన్నిహితులైన వారికి మంత్రి పదవులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. శశికళ తనయుడు(అక్క కుమారుడు) దినకరన్, సెంగొట్టయ్యన్ లకు కేబినెట్ బెర్తులు ఖాయమంటున్నారు. సీఎం సహా 33 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. పోయెస్ గార్డెన్ ముఖ్యనేతలతో కేబినెట్ కూర్పుపై పళనిస్వామి చర్చించారు. అనంతరం తన మద్దతుదారులతో కలిసి రాజ్ భవన్ కు బయలుదేరారు. మంత్రుల పేర్లతో కూడిన లిస్టును గవర్నర్ ను అందించారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేస్తారు. -
అమ్మ ఖర్చు 24 లక్షలు
కరుణ రూ. 25 లక్షలు కెప్టెన్ రూ.16 లక్షలే ఎన్నికల ఖర్చు చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుల లెక్కల్ని ఎన్నికల యంత్రాంగం తేల్చింది. డీఎంకే అధినేత కరుణానిధి, దళపతి స్టాలిన్ రూ. 25 లక్షలు చొప్పున ఖర్చు పెడితే, అమ్మ, సీఎం జయలలిత రూ. 24 లక్షల 55 వేల 631గా లెక్క తేల్చారు. 2016 అసెంబ్లీ ఎన్నికల సమరం ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. అధికారం ఎవరిదో అన్నది అంతు చిక్కని రీతిలో సాగి, చివరకు రాష్ర్ట ఓటర్ల మళ్లీ అమ్మకే పట్టం కట్టారు. అదే సమయంలో రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా బలమైన ప్రధాన ప్రతి పక్షంలో డీఎంకేను కూర్చోబెట్టారు. ఇంత వరకు అన్నీ బాగానే సాగినా, ఎన్నికల అనంతరం అభ్యర్థుల లెక్కల మీద ఈసీ దృష్టి పెట్టింది. 234 స్థానాల్లో రెండు స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడగా, మిగిలిన స్థానాల బరిలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల లెక్కల్ని పరిశీలించి తేల్చారు. ఈ ఎన్నికల్లో ఎన్ని కూటములు ఉన్నా, ప్రధాన సమరం డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సాగింది. ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థులందరి వివరాల సేకరణ సాగినా, ప్రధాన దృష్టి లెక్కల పరిశీలనలో ఆ రెండు పార్టీల మీద సాగి తేల్చారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చుగా రూ.25 లక్షల వరకు వినియోగించుకునేందుకు తగ్గ అవకాశాల్ని ఎన్నికల యంత్రాంగం కల్పించింది. ఈ లెక్కల పరిశీలనకు ప్రత్యేక నిఘా బృందాలు సైతం రంగంలోకి దిగాయి. ఈసీ లెక్కలు మొక్కుబడే అయినా, లెక్కలోకి రాని రీతిలో ఎన్నికల్లో నోట్ల కట్టలు చల్లారన్న విషయం జగమెరిగిన సత్యం. ఇందుకు ఉదాహరణ వాయిదా పడ్డ తంజావూరు, అరవకురిచ్చిలను పరిగణించ వచ్చు. లెక్కలోకి రాని నోట్ల కట్టల్ని పక్కన బెడితే, ఈసీ నియమ నిబంధనలకు లోబడి అభ్యర్థులు పెట్టిన ఖర్చుల లెక్కలు ఎలాగో తేలాయి. ఆ మేరకు ఆర్కే నగర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన అమ్మ జయలలిత రూ. 24 లక్షల 55 వేల 631 ఖర్చు పెట్టారు. ఇక, తిరువారూర్‌లో పోటీ చేసి గెలిచిన డీఎంకే అధినేత కరుణానిధి, కొళత్తూరు నుంచి పోటీ చేసి గెలిచిన స్టాలిన్ తలా రూ.25 లక్షలు ఖర్చులు పెట్టినట్లు లెక్కల్ని సక్రమంగా సమర్పించి ఉన్నారు. ఇక, గత ఎన్నికల్లో ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించి, సీఎం కావాలన్న ఆశతో ఉలందూరు పేట నుంచి రేసులో నిలబడి ఘోరంగా దెబ్బ తిన్న డీఎండీకే అధినేత విజయకాంత్ కేవలం 16 లక్షల 70 వేలు మాత్రమే ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఉన్నారు. ఈయన తన ఖర్చు కాస్త పెంచి ఉంటే, గెలిచి ఉంటారేమో..!. కాట్టుమన్నార్ కోవిల్ నుంచి పోటీ చేసి 80 ఓట్లతో ఓటమి చవిచూసిన వీసీకే నేత తిరుమావళవన్ పదిహేను లక్షలతో సరి పెట్టారు. ఇక, తానే సీఎం అన్నట్టుగా ప్రచార సమయాల్లో ధీమా వ్యక్తం చేసిన పీఎంకే అన్భుమణి రాందాసు 19 లక్షలు ఖర్చు పెట్టినట్టు ఎన్నికల కమిషన్‌కు వివరాల్ని సమర్పించడం విశేషం. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ సమర్పించిన వివరాల్ని పరిశీలించి లెక్కల్ని కేంద్ర ఎన్నికల కమిషన్ తేల్చింది. ఇందుకు తగ్గ వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో గురువారం ప్రకటించారు. ఈసీకీ నోటీసు : లెక్కలు ఓ వైపు తేలి ఉంటే, మరో వైపు గెలిచిన వాళ్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై వివరణకు ఈసీకి నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో అమ్మ జయలలిత గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కూడా ఉంది. ఆర్కే నగర్లో భారీగా అవకతవకలు జరిగాయని, నోట్ల కట్టలు పారి, అవినీతితో విజయం సొంతం చేసుకున్నట్టు అమ్మ జయలలితకు వ్యతిరేకంగా ప్రవీణ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు న్యాయమూర్తి దురై స్వామి స్వీకరించారు. అమ్మ జయలలితతో పాటు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ అయ్యాయి. ఇక, 80 ఓట్లతో విజయాన్ని దూరం చేసుకున్న వీసీకే నేత తిరుమావళవన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి దురై స్వామి పరిగణలోకి తీసుకున్నారు. ఓట్ల లెక్కింపులో చోటు చేసుకున్న అవినీతితో అన్నాడీఎంకే అభ్యర్థి మురుగు మారన్ గెలిచినట్టు అధికారులు ప్రకటించారని తిరుమా దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందించిన న్యాయమూర్తి దీనికి కూడా వివరణ ఇవ్వాలని ఈసీకి ఆదేశాలు జారీ చేశారు. -
అమ్మ బైటపడేనా?
ఆస్తుల కేసు విచారణ ఆరంభం ఎన్నికల వేళ ఇరకాటం చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అమ్మను ఇంకా వెంటాడుతూనే ఉంది. కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై సుప్రీం కోర్టులో గురువారం విచారణ ప్రారంభం కావడం రాజకీయ పార్టీల్లో చర్చకు దారితీసింది. ఒక వైపు అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు సుప్రీంలో కేసు విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి జయలలితను అడకత్తెరలో పడేశాయి. దీంతో ఆమె నిర్దోషిగా బైటపడేనా అనే ప్రశ్న ఉదయించింది. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారని జయలలితపై అప్పటి జనతా పార్టీ అధినేత సుబ్రహ్మణ్యస్వామి కేసు దాఖలు చేశారు. ఈ కేసును ఆ తరువాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం అందిపుచ్చుకుంది. సుమారు 18 ఏళ్లపాటూ సాగిన ఈ కేసుపై 2014లో జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ100 కోట్ల జరిమానా విధిస్తూ కర్నాటకలోని ప్రత్యేక కోర్టు తీర్పుచెప్పింది. జయలలితతోపాటూ ఆమె నెచ్చెలి శశికళ, మాజీ దత్తపుత్రుడు సుధాకరన్, బంధువు ఇళవరసిలకు సైతం నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించారు. వీరంతా కొన్నిరోజుల పాటూ బెంగళూరులో జైలు జీవితం గడిపి బెయిల్‌పై బైటకు వచ్చారు. తమకు పడిన శిక్షను సవాలు చేస్తూ కర్నాటక హైకోర్టులో అప్పీలు చేసిన జయలలిత తదితర ముగ్గురు నిర్దోషిగా విడుదలయ్యారు. సుప్రీంలో అప్పీలు: ఆస్తుల కేసులో జయలలిత నిర్దోషిగా బైటపడడాన్ని సవాలు చేస్తూ కర్నాటక ప్రభుత్వం, డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బగళన్ సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 23వ తేదీన మూడురోజుల పాటూ విచారణ సాగి ఆగిపోయింది. మరలా ఈకేసుపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పినాకి చంద్రఘోష్, అమిత్రాయ్లతో కూడిన స్పెషల్ బెంచ్ గురువారం విచారణ ప్రారంభించింది. కర్నాటక ప్రభుత్వ తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే హాజరై వాదించారు. అలాగే మరో సీనియర్ న్యాయవాది బ్రహ్మానంద కటారియా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా కటారియా మీడియాతో మాట్లాడుతూ, న్యాయస్థానంలో ఏడేళ్లకు పైగా శిక్షపడితేనే అప్పీలు చేసుకోవాలి, అయితే జయలలిత తదితరులకు నాలుగేళ్ల శిక్ష మాత్రమే పడిందని అన్నారు. ఈ కేసును పునర్విచారణ చేయాలేగానీ అప్పీలుకు పోయేందుకు వీలులేదని చెప్పారు. అప్పీలు వెళ్లడం ద్వారా నిర్దోషిగా బైటపడటం చట్టవిరుద్దమని ఆయన వ్యాఖ్యానించారు. చట్టవిరుద్దంగా సాగిన ఈ వ్యవహారంలో జయ విడుదల చెల్లదు కాబట్టి తన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాల్సిందిగా సుప్రీం కోర్టును కోరినట్లు ఆయన తెలిపారు. నెలాఖరుకు తీర్పు: రాష్ట్రంలో బలమైన పార్టీగా కొనసాగుతున్న అన్నాడీఎంకే అప్రతిష్టపాలు కావడం డీఎంకేకు కలిసొచ్చే అంశం. రాబోయే ఎన్నికల్లో ఇదే ప్రధానాస్త్రంగా డీఎంకే భావించింది. అయితే ఆ తరువాతి పరిణామాల్లో జయ నిర్దోషిగా బైటపడడం డీఎంకే వెనక్కు తగ్గేలా చేసింది. జయ ఎదుర్కొంటున్న ఆస్తుల కేసును పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ప్రచారంలో ఉన్న అవినితి, అక్రమాల ఆరోపణలపై డీఎంకే ఆధారపడి ఉంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుని ఉన్న తరుణంలో అకస్మాత్తుగా మళ్లీ ఆస్తుల కేసు తెరపైకి రావడం అన్నాడీఎంకే శ్రేణుల్లో కంగారు పుట్టించింది. అలాగే డీఎంకేకు మళ్లీ ప్రచారాస్త్రంగా మారే అవకాశాలు క నిపిస్తున్నాయి. మే 16వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుండగా ఈనెలాఖరులోనే జయ కేసులో తీర్పు వెలువడగలదని తెలుస్తోంది. రానున్న తీర్పు జయకు అనుకూలమా, ప్రతికూలమా అనే చర్చ మొదలైంది. అలాగే ఎన్నికల వేళ అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు సైతం ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. -
భక్తుడి నేతృత్వంలో కమిటీ
చెన్నై : అమ్మకు ఆగ్రహం వస్తే ఏమవుతుందో అందరికీ ఎరుకే. బడా మంత్రైనా, చోటా నేతైనా రాత్రికి రాత్రే వేటుకు గురికాక తప్పదు. సంజాయిషీలకు సైతం అవకాశం ఇవ్వకుండా వరుసగా మంత్రులపై వేటువేసుకుంటూ పోతున్న జయలలిత జాబితాలో మరి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు పార్టీశ్రేణులు చెబుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో సీఎం జయలలిత తరువాత స్థానం ఆర్థికమంత్రి ఓ పన్నీర్ సెల్వందే అనేది నిర్వివాదాంశం. పార్టీ అధినేత్రి జయలలితతో నేరుగా విన్నవించుకునే అవకాశం దాదాపుగా ఎవ్వరికీ దక్కదు. అందరూ అన్ని విషయాలు పన్నీర్‌సెల్వానికి చెప్పు కుంటే ఆయన ద్వారా అమ్మకు చేరుతాయి. సీఎం జయలలిత సైతం పన్నీర్‌సెల్వం నేతృత్వంలో మంత్రులు నత్తం విశ్వనాధం, వైద్యలింగం, ఏడప్పాడి పళనిస్వామి, పళనియప్పన్ తదితరులతో ఒక బృందాన్ని నియమించింది. ఈ బందృంతో మాత్రమే జయలలిత తన పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను చర్చిస్తారు. అలాగే క్రమశిక్షణ చర్యల కమిటీ సైతం ఈ మంత్రులు బృందం నేతృత్వంలోనే పనిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నేతలపై వస్తున్న ఫిర్యాదులను జయలలిత లేకుండా పరిష్కరిస్తారు. ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను సైతం మంత్రుల బృందమే నిర్వహిస్తోంది. ఇలా అన్ని విషయాల్లో మంత్రుల బృందంపైనే జయ ఆధారపడటం వల్ల నేతల ధోరణి మారిపోయింది. పార్టీ నిర్వాహకులు, నేతలు, కార్యకర్తలు, ప్రజల చుట్టూ తిరిగేకంటే ఈ ఐదుమంది మంత్రల చుట్టూ తిరిగేతేచాలు పదవులు కాపాడబడుతాయి, కొత్త పదవులు దక్కుతాయనే భావనకు వచ్చేశారు. గతంలోని జయలలిత పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో శశికళకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇటీవల కాలంలో శశికళను దూరంగా పెట్టిన జయలలిత ఆ స్థానాన్ని పన్నీర్‌సెల్వంకు అప్పగించారు. పన్నీర్‌సెల్వం సైతం శశికళను విభేదించేవారితో ఒక కూటమిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ కూటమిలో మంత్రల స్థాయి నుంచి క్షేతస్థాయి నేతల వరకు ఉన్నారు. కూటమిలోని వారిపై ఎటువంటి ఫిర్యాదు చేసినా క్రమశిక్షణ చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఇటీవల కాలంలో తలెత్తాయి. అంతేగాక తనకు పోటీగా ఎదుగుతాడనే అనుమానంతో మంత్రి వైద్యలింగంపై జయ వద్ద తరచూ ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పన్నీర్‌సెల్వం నడవడికపై ఓ కన్నేసి ఉంచాల్సిందిగా హోంశాఖకు సూచించగా, పన్నీర్‌సెల్వం షాడోసీఎంగా వ్యవహరిస్తున్నట్లు వారు సీఎంకు నివేదిక ఇచ్చారు. అంతేగాక కుమారులతో రాజకీయ వారసులను సిద్ధం చేసుకోవడం, ప్రజాపనుల శాఖలో పన్నీర్‌సెల్వం కుమారుడి పెత్తనం కూడా జయ దృష్టికి వచ్చింది. అంతేగాక ఈ మంత్రుల బృందం రాష్ట్రంలోని పలువురు నేతలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు అమ్మ పరిశీలనలోకి వెళ్లాయి. మంత్రులు పన్నీర్‌సెల్వం, నత్తం విశ్వనాథం, పళనియప్పన్‌లు కలిసి సుమారు వందమంది వద్ద కోట్లరూపాయలను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తనకు పూర్తిగా నమ్మకస్తులైన వారి జాబితాను సిద్ధం చేసుకున్న పన్నీర్‌సెల్వం వారికి టిక్కెట్లను ఖరారు చేసారని అంటున్నారు. ఈ కారణాలతో ముగ్గురు మంత్రులను చెన్నై వదిలి లేదా గార్డెన్ వదిలి వెళ్లరాదని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరాదని జయ ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ ఎరవేసి డబ్బులు గుంజే ఎమ్మెల్యేల జాబితాను సైతం సీఎం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇలా వివాదాస్పద ఎమ్మెల్యేల్లో పన్నీర్‌సెల్వం అనుచర ఎమ్మెల్యేలు అధికశాతం ఉన్నారని తెలుస్తోంది. అలాగే ఇతర మంత్రుల అనుచరుల ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా కూడా ఉన్నారు. 90 మందిపై విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. -
కెప్టెన్‌పై సీఎం పరువునష్టం దావా
చెన్నై : డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరువునష్టం కేసు దాఖలు చేశారు. జయ తరఫున ప్రభుత్వ న్యాయవాది ఎంఎల్ జగన్ సెషన్స్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల మూడో తేదీన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ విడుదల చేసిన ప్రకటనలో చెన్నైలో గతేడాది సంభవించిన వరదలు కృత్రిమంగా సృష్టించబడ్డాయని ఆరోపించారు. అంతేకాకుండా ఈ వరద నష్టాన్ని జయలలిత పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మరునాడు అంటే నాలుగో తేదీ పత్రికలో ప్రకటన వచ్చింది. విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జయలలిత పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉందని, వాస్తవాలకు విరుద్ధమని జయ తరఫు న్యాయవాది జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయనపై పరువునష్టం కింద చర్యలు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వాలని ఆయన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ అడిషనల్స్ సెషన్స్ కోర్టులో త్వరలో విచారణకు రానుంది. ఇదేవిధంగా వరద ముప్పు గురించి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రకటనను విడుదల చేసిన మురసోలి పత్రిక సంపాదకులు సెల్వంపై రెవెన్యూ శాఖా మంత్రి ఉదయకుమార్ తరఫున పరువునష్టం పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. -
‘భాస్కరుడి’కి అమ్మ అభయం
చెన్నై : ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్‌కు సీఎం జయలలిత అభయహస్తం ఇచ్చారు. ఇంటెలిజెన్స్ విచారణ మంత్రికి అనుకూలంగా రావడంతో పదవీ గండం తప్పినట్టు అయింది. కులచిచ్చుతో వీరంగం సృష్టించే వాళ్లకు చెక్ పెట్టే రీతిలో మంత్రికి వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్లకు అమ్మ ఉద్వాసన పలకడం అన్నాడీఎంకే వర్గాలకు షాక్ ఇచ్చినట్టు అయింది. అన్నాడీఎంకే సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తరచూ మంత్రివర్గంలో మార్పులు జరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువ శాతం మంది మంత్రులపై వచ్చిన పలు రకాల ఆరోపణలు, ఫిర్యాదులే కారణంగా చెప్పవచ్చు. ఏ మంత్రిపైన అయినా సరే చిన్న పాటి ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే చాలు తక్షణం జయలలిత స్పందించడం జరుగుతోంది. మంత్రిపై ఫిర్యాదులు వచ్చినా, ఆయనకు వ్యతిరేకంగా పత్రికల్లో కథనాలు వచ్చినా, అన్నాడీఎంకే కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చినా, ఆయా జిల్లాల్లోని నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కినా ఆ మంత్రి పదవి ఊడినట్టే. మరోచాన్స్ అంటూ లేని రీతిలో పదవులు ఊడుతూ వస్తున్నాయి. కొందర్ని క్షమించి మళ్లీ ఆహ్వానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ దిశగా జయలలిత నమ్మిన బంట్లు, పలువురు ముఖ్య, కీలక నాయకుల పదవులు ఊడిన సందర్భాలు అనేకం. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల మంత్రికి వ్యతిరేకంగా కొన్ని జిల్లాల్లో ఏకంగా కుల వివాదాలతో చిచ్చు రగిలినా చివరకు పదవీ గండం నుంచి ఆ మంత్రి తప్పించుకోవడం గమనార్హం. ఆరోగ్య మంత్రి విజయ్‌కు ఉద్వాసన పలికిన తర్వాత ఆ శాఖకు పుదుకోట్టై జిల్లా విరాళి మలై ఎమ్మెల్యే విజయ భాస్కర్‌కు అప్పగించారు. స్వతహాగా వైద్యుడు కావడంతో విజయ భాస్కర్ ఆరోగ్య శాఖ మీద పూర్తి పట్టు సాధించారని చెప్పవచ్చు. రెండేళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత నెల సొంత జిల్లా పుదుకోట్టైలో మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే బయలుదేరింది. తమను కులం పేరుతో దూషించారంటూ కరంబక్కుడి పంచాయతీ యూనియన్ మాజీ కార్యదర్శి చొక్కలింగం, ఆయన భార్య, ఆ యూనియన్ అధ్యక్షురాలు గంగయ్యమ్మాల్ ఆరోపించడం వివాదాస్పదమైంది. ముత్తయ్యార్ సామాజిక వర్గం ఏకం కావడంతో మంత్రికి వ్యతిరేకంగా ఉద్యమం బయలుదేరింది. పుదుకోట్టై, తిరుచ్చి, తంజావూరు, మదురైలోని ఆ సామాజిక వర్గం ఏకమై మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పు అనివార్యం అన్న ప్రశ్న బయలుదేరింది. సమగ్ర విచారణకు ఇంటెలిజెన్స్‌ను రంగంలోకి దించినట్టు సమాచారం. ఈ విచారణలో రాజకీయ లాభం కోసం కులచిచ్చును తెర మీదకు తెచ్చారని, దీని వెనుక డీఎంకే హస్తం ఉందని తేలింది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన అమ్మ పార్టీలో కుల చిచ్చు, వివాదాలకు చెక్ పెట్టే రీతిలో ఆగమేఘాలపై చొక్కలింగం, గంగయ్యమ్మాల్కు ఉద్వాసన పలికారు. ఆ ఇద్దర్నీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడంతో ఆ సామాజికవర్గానికి చెందిన ఇతర నేతల్లో గుబులు బయలు దేరింది. చివరకు పదవి గండం నుంచి విజయ భాస్కర్ తప్పించుకుని అమ్మ అభయం పొందారు. ఇక ముత్తయ్యార్ సామాజిక వర్గాన్ని ఆకర్షించే రీతిలో డీఎంకే ఎంపి కనిమొళి పావులు కదపడం గమనార్హం. ఆ ఇద్దర్నీ తమ వైపునకు తిప్పుకుని ఆ సామాజిక వర్గం మద్దతు కూడగట్టుకునే రీతిలో ప్రయత్నాలు సాగించే పనిలో పడ్డట్టు సమాచారం. -
జయకు బాబు లేఖ
హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారి జయలలితకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఈ మేరకు జయలలితకు చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో తెలుగు మీడియం పాఠశాలలను కొనసాగించాలని తెలిపారు. అలాగే తెలుగు భాషను రెండో బోధన భాషగా చేయాలని ఆయన జయలలితను కోరారు. తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషను రద్దు చేస్తు జయలలిత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జయలలిత ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాష రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని జయలలితకు చంద్రబాబు లేఖ రాశారు.