అమ్మ బైటపడేనా?
- ఆస్తుల కేసు విచారణ ఆరంభం
- ఎన్నికల వేళ ఇరకాటం
చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అమ్మను ఇంకా వెంటాడుతూనే ఉంది. కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై సుప్రీం కోర్టులో గురువారం విచారణ ప్రారంభం కావడం రాజకీయ పార్టీల్లో చర్చకు దారితీసింది. ఒక వైపు అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు సుప్రీంలో కేసు విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి జయలలితను అడకత్తెరలో పడేశాయి. దీంతో ఆమె నిర్దోషిగా బైటపడేనా అనే ప్రశ్న ఉదయించింది.
గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారని జయలలితపై అప్పటి జనతా పార్టీ అధినేత సుబ్రహ్మణ్యస్వామి కేసు దాఖలు చేశారు. ఈ కేసును ఆ తరువాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం అందిపుచ్చుకుంది. సుమారు 18 ఏళ్లపాటూ సాగిన ఈ కేసుపై 2014లో జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ100 కోట్ల జరిమానా విధిస్తూ కర్నాటకలోని ప్రత్యేక కోర్టు తీర్పుచెప్పింది.
జయలలితతోపాటూ ఆమె నెచ్చెలి శశికళ, మాజీ దత్తపుత్రుడు సుధాకరన్, బంధువు ఇళవరసిలకు సైతం నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించారు. వీరంతా కొన్నిరోజుల పాటూ బెంగళూరులో జైలు జీవితం గడిపి బెయిల్‌పై బైటకు వచ్చారు. తమకు పడిన శిక్షను సవాలు చేస్తూ కర్నాటక హైకోర్టులో అప్పీలు చేసిన జయలలిత తదితర ముగ్గురు నిర్దోషిగా విడుదలయ్యారు.
సుప్రీంలో అప్పీలు:
ఆస్తుల కేసులో జయలలిత నిర్దోషిగా బైటపడడాన్ని సవాలు చేస్తూ కర్నాటక ప్రభుత్వం, డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బగళన్ సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 23వ తేదీన మూడురోజుల పాటూ విచారణ సాగి ఆగిపోయింది. మరలా ఈకేసుపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పినాకి చంద్రఘోష్, అమిత్‌రాయ్‌లతో కూడిన స్పెషల్ బెంచ్ గురువారం విచారణ ప్రారంభించింది. కర్నాటక ప్రభుత్వ తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే హాజరై వాదించారు.
అలాగే మరో సీనియర్ న్యాయవాది బ్రహ్మానంద కటారియా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా కటారియా మీడియాతో మాట్లాడుతూ, న్యాయస్థానంలో ఏడేళ్లకు పైగా శిక్షపడితేనే అప్పీలు చేసుకోవాలి, అయితే జయలలిత తదితరులకు నాలుగేళ్ల శిక్ష మాత్రమే పడిందని అన్నారు. ఈ కేసును పునర్విచారణ చేయాలేగానీ అప్పీలుకు పోయేందుకు వీలులేదని చెప్పారు. అప్పీలు వెళ్లడం ద్వారా నిర్దోషిగా బైటపడటం చట్టవిరుద్దమని ఆయన వ్యాఖ్యానించారు. చట్టవిరుద్దంగా సాగిన ఈ వ్యవహారంలో జయ విడుదల చెల్లదు కాబట్టి తన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాల్సిందిగా సుప్రీం కోర్టును కోరినట్లు ఆయన తెలిపారు.
నెలాఖరుకు తీర్పు:
రాష్ట్రంలో బలమైన పార్టీగా కొనసాగుతున్న అన్నాడీఎంకే అప్రతిష్టపాలు కావడం డీఎంకేకు కలిసొచ్చే అంశం. రాబోయే ఎన్నికల్లో ఇదే ప్రధానాస్త్రంగా డీఎంకే భావించింది. అయితే ఆ తరువాతి పరిణామాల్లో జయ నిర్దోషిగా బైటపడడం డీఎంకే వెనక్కు తగ్గేలా చేసింది. జయ ఎదుర్కొంటున్న ఆస్తుల కేసును పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ప్రచారంలో ఉన్న అవినితి, అక్రమాల ఆరోపణలపై డీఎంకే ఆధారపడి ఉంది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుని ఉన్న తరుణంలో అకస్మాత్తుగా మళ్లీ ఆస్తుల కేసు తెరపైకి రావడం అన్నాడీఎంకే శ్రేణుల్లో కంగారు పుట్టించింది. అలాగే డీఎంకేకు మళ్లీ ప్రచారాస్త్రంగా మారే అవకాశాలు క నిపిస్తున్నాయి. మే 16వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుండగా ఈనెలాఖరులోనే జయ కేసులో తీర్పు వెలువడగలదని తెలుస్తోంది. రానున్న తీర్పు జయకు అనుకూలమా, ప్రతికూలమా అనే చర్చ మొదలైంది. అలాగే ఎన్నికల వేళ అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు సైతం ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు.