భక్తుడి నేతృత్వంలో కమిటీ
చెన్నై : అమ్మకు ఆగ్రహం వస్తే ఏమవుతుందో అందరికీ ఎరుకే. బడా మంత్రైనా, చోటా నేతైనా రాత్రికి రాత్రే వేటుకు గురికాక తప్పదు. సంజాయిషీలకు సైతం అవకాశం ఇవ్వకుండా వరుసగా మంత్రులపై వేటువేసుకుంటూ పోతున్న జయలలిత జాబితాలో మరి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు పార్టీశ్రేణులు చెబుతున్నాయి.
అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో సీఎం జయలలిత తరువాత స్థానం ఆర్థికమంత్రి ఓ పన్నీర్ సెల్వందే అనేది నిర్వివాదాంశం. పార్టీ అధినేత్రి జయలలితతో నేరుగా విన్నవించుకునే అవకాశం దాదాపుగా ఎవ్వరికీ దక్కదు. అందరూ అన్ని విషయాలు పన్నీర్‌సెల్వానికి చెప్పు కుంటే ఆయన ద్వారా అమ్మకు చేరుతాయి. సీఎం జయలలిత సైతం పన్నీర్‌సెల్వం నేతృత్వంలో మంత్రులు నత్తం విశ్వనాధం, వైద్యలింగం, ఏడప్పాడి పళనిస్వామి, పళనియప్పన్ తదితరులతో ఒక బృందాన్ని నియమించింది.
ఈ బందృంతో మాత్రమే జయలలిత తన పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను చర్చిస్తారు. అలాగే క్రమశిక్షణ చర్యల కమిటీ సైతం ఈ మంత్రులు బృందం నేతృత్వంలోనే పనిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నేతలపై వస్తున్న ఫిర్యాదులను జయలలిత లేకుండా పరిష్కరిస్తారు. ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను సైతం మంత్రుల బృందమే నిర్వహిస్తోంది. ఇలా అన్ని విషయాల్లో మంత్రుల బృందంపైనే జయ ఆధారపడటం వల్ల నేతల ధోరణి మారిపోయింది.
పార్టీ నిర్వాహకులు, నేతలు, కార్యకర్తలు, ప్రజల చుట్టూ తిరిగేకంటే ఈ ఐదుమంది మంత్రల చుట్టూ తిరిగేతేచాలు పదవులు కాపాడబడుతాయి, కొత్త పదవులు దక్కుతాయనే భావనకు వచ్చేశారు. గతంలోని జయలలిత పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో శశికళకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇటీవల కాలంలో శశికళను దూరంగా పెట్టిన జయలలిత ఆ స్థానాన్ని పన్నీర్‌సెల్వంకు అప్పగించారు.
పన్నీర్‌సెల్వం సైతం శశికళను విభేదించేవారితో ఒక కూటమిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ కూటమిలో మంత్రల స్థాయి నుంచి క్షేతస్థాయి నేతల వరకు ఉన్నారు. కూటమిలోని వారిపై ఎటువంటి ఫిర్యాదు చేసినా క్రమశిక్షణ చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఇటీవల కాలంలో తలెత్తాయి. అంతేగాక తనకు పోటీగా ఎదుగుతాడనే అనుమానంతో మంత్రి వైద్యలింగంపై జయ వద్ద తరచూ ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం.
దీంతో పన్నీర్‌సెల్వం నడవడికపై ఓ కన్నేసి ఉంచాల్సిందిగా హోంశాఖకు సూచించగా, పన్నీర్‌సెల్వం షాడోసీఎంగా వ్యవహరిస్తున్నట్లు వారు సీఎంకు నివేదిక ఇచ్చారు. అంతేగాక కుమారులతో రాజకీయ వారసులను సిద్ధం చేసుకోవడం, ప్రజాపనుల శాఖలో పన్నీర్‌సెల్వం కుమారుడి పెత్తనం కూడా జయ దృష్టికి వచ్చింది. అంతేగాక ఈ మంత్రుల బృందం రాష్ట్రంలోని పలువురు నేతలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు అమ్మ పరిశీలనలోకి వెళ్లాయి. మంత్రులు పన్నీర్‌సెల్వం, నత్తం విశ్వనాథం, పళనియప్పన్‌లు కలిసి సుమారు వందమంది వద్ద కోట్లరూపాయలను స్వాహా చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా తనకు పూర్తిగా నమ్మకస్తులైన వారి జాబితాను సిద్ధం చేసుకున్న పన్నీర్‌సెల్వం వారికి టిక్కెట్లను ఖరారు చేసారని అంటున్నారు. ఈ కారణాలతో ముగ్గురు మంత్రులను చెన్నై వదిలి లేదా గార్డెన్ వదిలి వెళ్లరాదని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరాదని జయ ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ ఎరవేసి డబ్బులు గుంజే ఎమ్మెల్యేల జాబితాను సైతం సీఎం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇలా వివాదాస్పద ఎమ్మెల్యేల్లో పన్నీర్‌సెల్వం అనుచర ఎమ్మెల్యేలు అధికశాతం ఉన్నారని తెలుస్తోంది. అలాగే ఇతర మంత్రుల అనుచరుల ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా కూడా ఉన్నారు. 90 మందిపై విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది.