Vijaya Kanth
-
అవినీతిని తరిమికొడతా
రాష్ట్రంలోని అవినీతిని తరిమికొట్టేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేర్కొన్నారు. తిరువణ్ణామలై పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఎంజీఆర్ ప్రారంభించిన నూనె పరిశ్రమను ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వం టాస్మాక్ గోడౌన్‌గా మార్చిందని విమర్శించారు. వేలూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని అవినీతిని పారద్రోలేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేర్కొన్నారు. తిరువణ్ణామలై పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ కూటమి పార్టీలోని పాట్టాలి మక్కల్ పార్టీ అభ్యర్థి ఎదురొలి మణికి మద్దతుగా బుధవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. విజయకాంత్ మాట్లాడుతూ తిరువణ్ణామలైలో ఎంజీఆర్ ప్రారంభించిన టేన్‌కాప్ నూనె పరిశ్రమ ప్రస్తుతం టాస్మాక్ గోడౌన్‌గా మారిందని వీటిపై డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఏనాడైనా చర్యలు చేపట్టాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీంఎకే పార్టీలు కలిసి రాష్ట్రంలోని అనేక పరిశ్రమలను మూసివేయడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు వీధిన పడే దుస్థితి ఏర్పడిందన్నారు. సాతనూర్ డ్యామ్ నుంచి తిరువణ్ణామలైకి వస్తున్న తాగునీరు ప్రస్తుతం నిలిచి పోయిందని దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంగంలోని ప్రభుత్వ ఆస్పత్రిని విస్తరిస్తామని సంవత్సరం క్రితం తెలిపారని, అరుుతే ఇంత వరకూ పనులు ప్రారంభించలేదన్నారు. గిరివలయానికి ప్రతినెలా ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని అయితే ఇక్కడ కనీస వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని ఇక దేశాన్ని అభివృద్ధి చేస్తామని తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. తాను రాష్ట్రంలోని అవినీతి, కుంభకోణాలను పారద్రోలేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇందుకు నరేంద్ర మోడీ తప్పక సహకరిస్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీ కూటమి అభ్యర్థులు అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు. తాము ఏర్పరుచుకున్న కూటమితో ఇప్పటికే పలు పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. తిరువణ్ణామలైలో ఎదురొలి మణి, డీఎండీకే, పీఎంకే, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
డీఎండీకే అభ్యర్థి మార్పు
సాక్షి, చెన్నై: కడలూరు అభ్యర్థిని మారుస్తూ డీఎండీకే అధినేత విజయకాంత్ నిర్ణయం తీసుకున్నారు. రామానుజంకు బదులుగా జయ శంకర్ పోటీ చేస్తారని గురువారం ప్రకటించారు. బీజేపీ కూటమితోకలసి లోక్‌సభ ఎన్నికలను డీఎండీకే ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి 14 సీట్లను కేటాయించారు. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విజయకాంత్ తమ కూటమికి మద్దతుగా ప్రచార బాటలో పయనిస్తున్నారు. రాష్ట్రంలో సుడిగాలి పర్యటన సాగిస్తున్న విజయకాంత్ రెండు రోజుల క్రితం కడలూరులో ప్రచారం చేపట్టాల్సి ఉంది. అయితే, ఆయనకు ఊహించని రీతిలో షాక్ ఎదురు అయింది. ఇప్పటికే నామక్కల్‌లో తనకు సీటు వద్దు బాబోయ్ అంటూ మహేశ్వరన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోని విజయకాంత్‌కు తాజాగా మరో సమస్య ఎదురైంది. కడలూరు అభ్యర్థి స్థానికుడే కాదన్నది తేలింది. దీంతో అక్కడ పర్యటనను వాయిదా వేసుకుని, పార్టీ నాయకులతో మంతనాలు, చర్చల అనంతరం కొత్త అభ్యర్థిని ప్రకటించే పనిలో పడ్డారు. షాక్: కడలూరు అభ్యర్థిగా రామానుజం పేరును విజయకాంత్ తొలుత ప్రకటించారు. రిటైర్డ్ ప్రొఫెసర్‌గా ఉన్న రామానుజం స్వగ్రామం దిట్టకుడి. పార్టీకి చెన్నై నుంచి ఆయన సేవలను అందిస్తూ వస్తున్నారు. ఆవడి సమీపంలో నివాసం ఉంటున్నారు. అయితే, ఆయన చెన్నైలోనే స్థిర పడ్డ దృష్ట్యా, కడలూరు గురించి తెలిసింది శూన్యం. అక్కడ పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంది లేదు. కడలూరు ప్రచారానికి ముందు రోజు తన దృష్టికి ఈ విషయం రావడంతో విజయకాంత్ విస్మయంలో పడ్డారు. హుటాహుటిన పార్టీ నాయకుల్ని చెన్నైకు పిలిపించి చర్చించారు. వారి నుంచి కూడా అదే సమాధానం రావడంతో ఇక అభ్యర్థిని మార్చాల్సిన సంకట పరిస్థితి విజయకాంత్‌కు ఏర్పడింది. ఇక, నియోజకవర్గంలో ప్రచారం చేపట్టొద్దంటూ రామానుజంను వెనక్కు పంపించేశారు. బరిలో జయ శంకర్: ఎట్టకేలకు కొత్త అభ్యర్థిగా సీఆర్ జయశంకర్‌ను గురువారం విజయకాంత్ ఎంపిక చేశారు. కడలూరు జిల్లా నైవేలికి చెందిన జయ శంకర్ ఫైనాన్సియర్, ఆ జిల్లా పరిధిలో 25కు పైగా ఫైనాన్స్ కార్యాలయ శాఖలు ఉండడంతోపాటు సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థినే విజయకాంత్ ఎంపిక చేశారు. జయ శంకర్ వద్ద 30 వేల మందికి పైగా పని చేస్తుండటంతో సరైన అభ్యర్థిని రంగంలోకి దించారన్న ప్రచారం మొదలైంది. ఇన్నాళ్లు అభ్యర్థులను మార్చే అలవాటు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మాత్రమే ఉండేది. దీనిపై పలు మార్లు విజయకాంత్ విమర్శలు గుప్పించి ఉన్నారు. అయితే, తాజాగా అదే పరిస్థితి ఆయనకు రావడం గమనార్హం. -
మోడీ సభపై కుట్ర
దేశంలోనే కాదు రాష్ట్రంలో సైతం దూసుకెళుతున్న భారతీయ జనతా పార్టీని అడ్డుకునే కుట్రలు మొదలయ్యూయి. పార్టీ ప్రచార కార్యక్రమాలకు మోకాలడ్డటం ద్వారా లబ్ధి పొందేందుకు ఏకంగా న్యాయస్థానాన్నే ఆశ్రయించారు. ఫిబ్రవరి 8న చెన్నై వండలూరులో నిర్వహించనున్న మోడీ ప్రచారసభపై స్టే మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చెన్నై, సాక్షి ప్రతినిధి : శీతాకాలపు చలి రాష్ట్రాన్ని వీడకముందే లోక్‌సభ ఎన్నికల వేడి మొదలైంది. మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండగా రాష్ట్రంలోని పార్టీల పొత్తు చర్చలు ఒక కొలిక్కిరాలేదు. కొన్ని పార్టీలు తెరవెనుక, మరికొన్ని పార్టీలు తెరముందు పొత్తుల చర్చల్లో తలమునకలై ఉన్నాయి. దాదాపు అన్ని పార్టీలు అనధికారికంగా ఒక అభిప్రాయానికి వచ్చినా డీఎండీకే అధినేత విజయకాంత్ ఇంకా ఎటూ తేల్చక పోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. అన్ని పార్టీలు కెప్టెన్‌తో జతకట్టేందుకు సంసిద్ధత ప్రకటించినా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడిచేయడంలో సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు. డీఎండీకే కోసం ఒక వైపు కాంగ్రెస్, మరోవైపు డీఎంకే గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, మధ్యలో తన్నుకు పోయేందుకు బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలోని రెండు ప్రాంతీయ పార్టీ (ఎండీఎంకే, పీఎంకే)లను దాదాపుగా తన ఖాతాలో వేసుకున్న బీజేపీ ఇక పూర్తి దృష్టిని డీఎండీకేపై పెట్టింది. ఈనెల 8న వండలూరులో నిర్వహించనున్న మోడీ సభా వేదికపై ఎలాగైనా విజయకాంత్‌ను కూర్చోబెట్టాలన్న బలమైన సంకల్పంతో బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది.