కడలూరు అభ్యర్థిని మారుస్తూ డీఎండీకే అధినేత విజయకాంత్ నిర్ణయం తీసుకున్నారు. రామానుజంకు బదులుగా జయ శంకర్ పోటీ చేస్తారని గురువారం ప్రకటించారు.
సాక్షి, చెన్నై: కడలూరు అభ్యర్థిని మారుస్తూ డీఎండీకే అధినేత విజయకాంత్ నిర్ణయం తీసుకున్నారు. రామానుజంకు బదులుగా జయ శంకర్ పోటీ చేస్తారని గురువారం ప్రకటించారు. బీజేపీ కూటమితోకలసి లోక్‌సభ ఎన్నికలను డీఎండీకే ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి 14 సీట్లను కేటాయించారు.
అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విజయకాంత్ తమ కూటమికి మద్దతుగా ప్రచార బాటలో పయనిస్తున్నారు. రాష్ట్రంలో సుడిగాలి పర్యటన సాగిస్తున్న విజయకాంత్ రెండు రోజుల క్రితం కడలూరులో ప్రచారం చేపట్టాల్సి ఉంది. అయితే, ఆయనకు ఊహించని రీతిలో షాక్ ఎదురు అయింది. ఇప్పటికే నామక్కల్‌లో తనకు సీటు వద్దు బాబోయ్ అంటూ మహేశ్వరన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోని విజయకాంత్‌కు తాజాగా మరో సమస్య ఎదురైంది. కడలూరు అభ్యర్థి స్థానికుడే కాదన్నది తేలింది. దీంతో అక్కడ పర్యటనను వాయిదా వేసుకుని, పార్టీ నాయకులతో మంతనాలు, చర్చల అనంతరం కొత్త అభ్యర్థిని ప్రకటించే పనిలో పడ్డారు.
షాక్: కడలూరు అభ్యర్థిగా రామానుజం పేరును విజయకాంత్ తొలుత ప్రకటించారు. రిటైర్డ్ ప్రొఫెసర్‌గా ఉన్న రామానుజం స్వగ్రామం దిట్టకుడి. పార్టీకి చెన్నై నుంచి ఆయన సేవలను అందిస్తూ వస్తున్నారు. ఆవడి సమీపంలో నివాసం ఉంటున్నారు. అయితే, ఆయన చెన్నైలోనే స్థిర పడ్డ దృష్ట్యా, కడలూరు గురించి తెలిసింది శూన్యం. అక్కడ పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంది లేదు.
కడలూరు ప్రచారానికి ముందు రోజు తన దృష్టికి ఈ విషయం రావడంతో విజయకాంత్ విస్మయంలో పడ్డారు. హుటాహుటిన పార్టీ నాయకుల్ని చెన్నైకు పిలిపించి చర్చించారు. వారి నుంచి కూడా అదే సమాధానం రావడంతో ఇక అభ్యర్థిని మార్చాల్సిన సంకట పరిస్థితి విజయకాంత్‌కు ఏర్పడింది. ఇక, నియోజకవర్గంలో ప్రచారం చేపట్టొద్దంటూ రామానుజంను వెనక్కు పంపించేశారు.
బరిలో జయ శంకర్: ఎట్టకేలకు కొత్త అభ్యర్థిగా సీఆర్ జయశంకర్‌ను గురువారం విజయకాంత్ ఎంపిక చేశారు. కడలూరు జిల్లా నైవేలికి చెందిన జయ శంకర్ ఫైనాన్సియర్, ఆ జిల్లా పరిధిలో 25కు పైగా ఫైనాన్స్ కార్యాలయ శాఖలు ఉండడంతోపాటు సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థినే విజయకాంత్ ఎంపిక చేశారు.
జయ శంకర్ వద్ద 30 వేల మందికి పైగా పని చేస్తుండటంతో సరైన అభ్యర్థిని రంగంలోకి దించారన్న ప్రచారం మొదలైంది. ఇన్నాళ్లు అభ్యర్థులను మార్చే అలవాటు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మాత్రమే ఉండేది. దీనిపై పలు మార్లు విజయకాంత్ విమర్శలు గుప్పించి ఉన్నారు. అయితే, తాజాగా అదే పరిస్థితి ఆయనకు రావడం గమనార్హం.