చెన్నై, సాక్షి ప్రతినిధి: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒంటరిగా పోటీకి దిగుతుందని పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. మరేవైనా పార్టీలు తమతో కలిసిరావాలనుకుంటే దానిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని అమ్మకే అప్పగిస్తూ తీర్మానించారు. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై అన్ని పార్టీల్లో కసరత్తులు సాగుతుండగా అన్నాడీఎంకే నేతలు ఆ బాధ్యతంతా అమ్మకే అప్పగించేశారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో అన్నా డీఎంకే పార్టీ సర్వసభ సమావేశాన్ని గురువారం చెన్నైలో నిర్వహించింది. సమావేశాన్ని ఉద్దేశించి జయలలిత ఉద్వేగపూరితమైన ప్రసంగాన్ని చేశారు. కేంద్రాన్ని శాసించే స్థాయి గెలుపు సాధించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ పార్టీకి ఒంటరిగా పోటీ చే సి 40 ఎంపీ స్థానాలు గెలుచుకునే సత్తా ఉందని తెలిపారు. తాను ఆశించే స్థాయిలో విజయాన్ని అందిస్తారని నేతలను, కార్యకర్తలను తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ఏర్కాడులో అన్నాడీఎంకే గెలుపు అందరికీ తెలిసిందేనని, 30 వేల మెజార్టీ ఆశించాం, అయితే 86 వేల మెజారిటీ సాధించామని గుర్తు చేశారు. ఈ భారీ గెలుపు అందరి కృషి ఫలితమేనన్నారు. ఇదే ఉత్సాహం పట్టుదల పార్లమెంటు ఎన్నికల్లో కూడా సాగాలని ఆమె కోరారు. అన్నాడీఎంకే రైలు రెడ్‌ఫోర్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మారి గమ్యం చేరాలని ఉత్సాహాన్ని నూరిపోశారు. ప్రజలు మనకు ఓటువేస్తే వారికి మనమేమి చేస్తామో కూడా చెప్పుకోవాలి. ప్రగతి, శాంతి, ఆర్థికాభివృద్ధి, సంక్షేమాన్ని ఇద్దాం. భారత దేశ భవిష్యత్తు అన్నాడీఎంకే కార్యకర్తల చేతుల్లోనే ఉందని అన్నారు.
తీర్మానాలు
యూపీ, గుజరాత్, పంజాబ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రధానుల శకం తరువాత దేశానికి సార థ్యం వహించే అవకాశం ఇన్నాళ్లకు తమిళనాడుకు వస్తోందని చెప్పారు.
కామన్వెల్త్ సమావేశంలో యూపీఏ పాల్గొనడంపై ఖండించారు.
శ్రీలంక సైనికులకు భారత్‌లో శిక్షణపై నిరసన తెలిపారు.
తమిళ మత్స్యకారులపై శ్రీలంక దళాల వరుస దాడులు, అరెస్ట్‌లను నియంత్రించడంలో యూపీఏ విఫలందమైన్నారు.
చెన్నైలో ఎర్రకోట నమూనా
పార్టీకి సంబంధించి ఇది కీలకమైన సమావేశం కావడంతో అమ్మకు ఎంతో అట్టహాసంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో జయలలిత సమావేశ ప్రాంగణానికి చేరుకోగా రంగుల రంగుల బెలూన్లు, మేళతాళాలతో స్వాగతం చెప్పారు. దేశంలో మూడో కూటమి అంటూ ఏర్పడితే జయలలిత ప్రధాని అభ్యర్థిగా రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు చిహ్నంగా సమావేశం ప్రవేశద్వారాన్ని ఎర్రకోట నమూనాలా తీర్చిదిద్దారు. దీంతో కార్యాకర్తలు జయలలిత కాబోయే ప్రధాని అంటూ నినాదాలు చేశారు.
వినతుల వెల్లువ
పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న నేతలు గురువారం నుంచి తమ విజ్ఞప్తులను సమర్పించుకోవచ్చని పార్టీ అధినేత్రి ఆదేశించడంతో పార్టీ కార్యాలయం కిటకిటలాడింది. ఉదయం 10 గంటల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తామని పార్టీ ప్రకటించినా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నేతలు 8 గంటలకే రాయపేటలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద క్యూకట్టారు. తాము ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయదలుచుకుంది వివరిస్తూ ఒక్కో దరఖాస్తుకు రూ.25వేలు చెల్లించాలని పార్టీ ఆదేశించింది. ఒక్కో నేత మూడు నాలుగు నియోజకవర్గాలను ఎంచుకుని విజ్ఞప్తులు అందజేశారు. జయలలిత తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ వందలాది మంది విజ్ఞప్తులు చేశారు. జయ నియోజకవర్గం కోసం పోటీపడిన వారిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మొదలుకుని సాధారణ కార్యకర్త వరకు ఉన్నారు. ఒక నేత ఏకంగా రూ.4.75 లక్షలు చెల్లించి విజ్ఞప్తి చేశారు.
అన్నాడీఎంకే ఒంటరిపోరు
Published Fri, Dec 20 2013 2:28 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement