లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో దేశ రాజకీయ యవనికపై తృతీయ ప్రత్యామ్నాయం ఆవిర్భవించింది.
సంపాదకీయం: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో దేశ రాజకీయ యవనికపై తృతీయ ప్రత్యామ్నాయం ఆవిర్భవించింది. న్యూఢిల్లీలో నాలుగు వామపక్షాలు, మరో అయిదు ప్రాంతీయ పార్టీలు మంగళవారం సమావేశమై దీనికి సంబంధించిన ఉమ్మడి ప్రకటన విడుదలచేశాయి. ఇంకా పేరెట్టని, ఉమ్మడి కార్యక్రమం రూపొందించుకోని ఈ ఫ్రంట్ సమావేశానికి వామపక్షాలైన సీపీఎం, సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్ బ్లాక్‌లతోపాటు జేడీ(యూ), అన్నా డీఎంకే, జేడీ(ఎస్), జార్ఖండ్ వికాస్ మోర్చా నేతలు హాజరయ్యారు. ఇందులో కలవాల్సిన మరో రెండు పార్టీలు ఏజీపీ, బీజేడీలు ఈ సమావేశానికి రాకపోయినా, అవి తమతోనే ఉన్నాయని ఫ్రంట్ అంటున్నది. ఈ తరహా ఫ్రంట్ ఆవిర్భావం ఇది మొదటిసారేమీ కాదు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడల్లా కాంగ్రెసేతర, బీజేపీయేతర పక్షాలు ఒక వేదికపైకి రావడం రివాజే. ప్రతిసారీ వామపక్షాలే ఇందుకు చొరవ తీసుకున్నాయి. 1996లో ఇలాంటి ప్రయత్నం ఫలించి హెచ్‌డీ దేవెగౌడ ప్రధానిగా కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏర్పాటైంది.
అయితే, ఫ్రంట్ శాశ్వతం తప్ప అందులో పక్షాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. 2004లో వామపక్షాలు ఏకమై యూపీలో ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీతో జతకట్టాయి. మళ్లీ ఆ పక్షాలే 2009లో అక్కడ మాయావతివైపు మొగ్గుచూపాయి. అణు ఒప్పందం విషయంలో ములాయం చివరి నిమిషంలో మాట మార్చి యూపీఏకు మద్దతివ్వడమే అందుకు కారణం. తమిళనాడుకొచ్చేసరికి ఒకసారి డీఎంకే, మరోసారి అన్నాడీఎంకే వామపక్షాలకు చేరువవుతుంటాయి. మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు గాలివాలును చూసుకుని ఒకసారి ఎన్డీఏవైపు, మరోసారి వామపక్షాల కూటమివైపు మొగ్గుతుంటారు. ఈ ఫ్రంట్ కు వామపక్షాలు, వారి నేతృత్వంలో జరిగే ఉద్యమాలు బలమైతే...సూత్రబద్ధమైన రాజ కీయాలకూ, సిద్ధాంతాలకూ కట్టుబడలేని దుర్బలులను కలుపుకోవాల్సిరావడం దాని బలహీనత. అందుకే, ఇలాంటి ఫ్రంట్‌లు గట్టిగా ఏడాదికాలమైనా నిలబడలేకపోయాయి.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి రెండంకెల స్థానానికి పడిపోతుందని, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి 200కుపైగా స్థానాలు లభించవచ్చునని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఈ రెండింటితో సంబంధంలేకుండా ఏర్పడిన ఫ్రంట్ బలంపై ఎవరికైనా సందేహాలు రావడం సహజమే. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. వామపక్షాలకు కంచుకోటగా ఉన్న బెంగాల్ ఇప్పుడు మమతాబెనర్జీ వశమైంది. బీహార్‌కు చెందిన జేడీ(యూ)మొన్నటివరకూ ఎన్డీయే కూటమిలోనే ఉండేది. ఇప్పుడది మూడో ఫ్రంట్‌లో చేరడంతో అక్కడి బలాబలాల్లో మార్పులు వచ్చే ఆస్కారం ఉన్నది.
తమిళనాట అన్నాడీఎంకేకు తిరుగులేని బలం ఉంది. యూపీలో ఎస్పీ ఎంతవరకూ దూసుకెళ్తుందో చూడాలి. మొత్తంమీద చూస్తే మూడో ఫ్రంట్‌లోని వివిధ ప్రాంతీయ పార్టీలు 9 రాష్ట్రాల్లో 286 ఎంపీ సీట్లలో యూపీఏ, ఎన్డీయేలకు గట్టి పోటీ ఇవ్వనున్నాయన్నది వాస్తవం. ఇందులో యూపీ (80), బీహార్ (40), జార్ఖండ్(14), పశ్చిమబెంగాల్ (42), తమిళనాడు (39), ఒడిశా(21), కేరళ(20), కర్ణాటక(28), త్రిపుర(2) ఉన్నాయి. జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్ అన్నట్టు ఎన్నికలు సమీపించేలోగా ఈ ఫ్రంట్‌లో మరికొన్ని పార్టీలు వచ్చి చేరే అవకాశం లేకపోలేదు. ఇప్పటికి ఇంకా యూపీఏతోనే ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ... ఫ్రంట్ ఆవిర్భావాన్ని స్వాగతించడం అందుకు తార్కాణం. అయితే, ఎన్నికలయ్యాక సంభవించగల పరిణామాల్లో ఒకరిద్దరు బయటికెళ్లే అవకాశాలనూ తోసిపుచ్చలేం.
తమ ప్రధాని అభ్యర్థి ఎవరో ముందే చెప్పబోమని, ఎన్నికలయ్యాకే అది నిర్ణయమవుతుందని శరద్‌యాదవ్ అంటున్నారు. గతంలో వీపీసింగ్, దేవెగౌడ, గుజ్రాల్ వగైరాలను ఎన్నికల అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతిని ఆయన గుర్తుచేస్తున్నారు. అందులో నిజం లేకపోలేదుగానీ...ఈసారి అది అంత సులభం కాదు. ములాయం, జయలలితలు ఇప్పటికే ప్రధాని పదవిపై తమ ఆకాంక్షను వ్యక్తంచేసివున్నారు. దేవెగౌడ సరేసరి. వ్యక్తుల ఆకాంక్షల సంగతలా ఉంచి అసలు ఫ్రంట్ ఉమ్మడి కార్యక్రమమేమిటో, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దాని వైఖరి ఎలాంటిదో తెలిశాకే ప్రజల్లో దానికి ఉండగల ఆదరణను అంచనా వేయడం సాధ్యమవుతుంది.
అయితే, ఈలోగానే ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఈ ఫ్రంట్‌పై విమర్శల జడివాన ప్రారంభించాయి. మఖలో పుట్టి పుబ్బలో అంతరించే ఇలాంటి ఫ్రంట్‌ను ప్రజలు ఆదరించబోరని ఆ పార్టీలు అంటున్నాయి. నిజంగా ఆ స్థితే ఉంటే ఇలాంటి ఫ్రంట్ గురించి ఆ పార్టీలు పట్టించుకోవాల్సిన పనేలేదు. అందుకు విరుద్ధంగా ఫ్రంట్‌కు సంబంధించి ప్రాథమిక చర్చలు జరుగుతున్న దశలోనే...అందులో ఎవరుంటారో, ఉండరో తెలియని స్థితిలోనే దాదాపు రెండునెలలక్రితమే కాంగ్రెస్, బీజేపీలు ఉలిక్కిపడ్డాయి.
అది దేశాన్ని అథమస్థాయికి తీసుకెళ్తుందని మోడీ హెచ్చరిస్తే...థర్డ్ ఫ్రంట్ ఒక ఎండమావి అని కాంగ్రెస్ అంటున్నది. థర్డ్ ఫ్రంట్‌లో ఉండేది ప్రాంతీయ స్థాయిలో బలంగా ఉన్న పార్టీలు గనుకనే, వాటినుంచి తమకు గట్టి సవాల్ ఎదురుకాగలదన్న భయం ఉండటంవల్లనే రెండు ప్రధాన పార్టీలూ అతిగా స్పందిస్తున్నాయన్నది వాస్తవం. ఈ రెండు జాతీయ పార్టీలూ నిజానికి ఈ ప్రాంతీయ పార్టీల కారణంగా సారాంశంలో ‘పెద్ద ప్రాంతీయ పార్టీలు’గా మారాయి. ఒక రాష్ట్రానికే పరిమితమైన పార్టీని ప్రాంతీయ పార్టీగా లెక్కేస్తే మూడు, నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే బలంగా ఉండి ఇవి జాతీయ పార్టీ ముద్ర వేయించుకుంటున్నాయి. మొత్తానికి ఈ మూడో ఫ్రంట్‌లోని పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను ఏమేరకు నిలువరించగలవో, దృఢంగా నిలబడగలవో వేచిచూడాలి.