జయ వైఫల్యాలే విజయ సోపానాలు
కనిమొళి ఇంటర్వ్యూ
సి. నందగోపాల్ - సాక్షి, చెన్నై: తమిళనాడులో తొలి ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన డీఎంకేకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రాజకీయాల్లో ‘ప్రాంతీయ’ ప్రాభవానికి ప్రాణం పోసిన డీఎంకేదే. కరుణానిధితో తలెత్తిన విభేదాలతో బయటకు వచ్చిన ఎంజీఆర్ స్థాపించిన అన్నా డీఎంకేకు ప్రేరణ డీఎంకేనే. పార్టీ అధినేత కరుణానిధి జీవించి ఉండగానే, సారథ్య వారసత్వం కోసం ఆయన తనయులు అళగిరి, స్టాలిన్ బహిరంగంగా కీచులాడుకోవడం తెలిసిందే. అన్నదమ్ములిద్దరి మధ్య వారథిగా మారిన ముద్దుల చెల్లెలు కనిమొళి డీఎంకే పగ్గాలను చేపట్టే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలూ ఉన్నాయి. పార్టీపరంగా, కుటుంబపరంగా కీలకపాత్ర పోషిస్తున్న కనిమొళి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..
ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే సర్కారు వైఫల్యాలే తమకు విజయ సోపానాలుగా మారనున్నాయని కనిమొళి ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమలు విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయని, తమిళనాడుకు రావాలంటేనే పెట్టుబడిదారులు భయపడుతున్నారని ఆమె అన్నారు. విద్యుత్ సంక్షోభానికి గత డీఎంకే ప్రభుత్వమే కారణమని జయలలిత చేస్తున్న ఆరోపణలను కనిమొళి తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిగా కరుణానిధి పలు కొత్త విద్యుత్ పథకాలను ప్రారంభించారని, అన్నా డీఎంకే ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్కటైనా పూర్తి చేసిందేమో చెప్పాలని ప్రశ్నించారు. జయ సర్కారు కొత్త పథకాలు చేపట్టకపోగా, గతంలో డీఎంకే సర్కారు ప్రారంభించిన వాటిని అటకెక్కించారని ఆరోపించారు. జయలలితకు అనుకూలంగా వచ్చిన సర్వే ఫలితాలను సైతం కనిమొళి తోసిపుచ్చారు.
ఎన్నికల ప్రకటన వెలువడిన మొదట్లో అన్నాడీఎంకే 39 స్థానాలు గెలుచుకుంటుందనే అంచనాలు వెలువడ్డాయని, తర్వాత 20-18 స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలు చెప్పాయని అన్నారు. అయితే, తన తండ్రి కరుణానిధి ప్రచారం ప్రారంభించిన తర్వాత సీన్ మారిపోయిందని, 18 కంటే తక్కువ స్థానాలతోనే జయలలిత సరిపెట్టుకోక తప్పదని అన్నారు. కోటీశ్వరులకే టికెట్లు కట్టబెట్టారన్న ఆరోపణలనూ ఆమె కొట్టి పారేశారు. అభ్యర్థుల్లో కొందరు ధనవంతులు ఉండి ఉండవచ్చని, అయితే, ప్రజాజీవితంలో మమేకమై, మంచి నేపథ్యం గల కొత్త వారికే టికెట్లు ఇచ్చామని చెప్పారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసును ప్రస్తావించగా, అవినీతి ఆరోపణల వెనుక రాజకీయ కారణాలు ఉంటాయని, నిజం నిలకడగా తేలుతుందని అన్నారు.
జయలలితపైనా బెంగళూరు కోర్టులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నాయని, అయినా, ఎవరు ఎలాంటి వారో ప్రజల కు తెలుసునని అన్నారు. శ్రీలంక తమిళుల వ్యవహారంలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన మానవ హక్కుల తీర్మానానికి రెండుసార్లు మద్దతు పలికిన భారత్, ఇప్పుడు బహిష్కరించిందన్నారు. యూపీఏలో తాము కొనసాగినప్పుడు తమ ఒత్తిడితో మద్దతునిచ్చిన కేంద్రం, తాము వైదొలగామనే ధీమాతో బహిష్కరించిందని ఆరోపించారు. శ్రీలంక తమిళుల సమస్యలపై డీఎంకే ఎప్పటికీ పోరాడుతుందని కనిమొళి స్పష్టం చేశారు. తన ఇంటికి అళగిరి రావడంపై మాట్లాడుతూ, ఒక చెల్లిగా ఆయన తనను కలుసుకున్నారన్నారు. ఇటీవల తన కు కొంత అనారోగ్యం చేసిందని, అందుకే తనను పరామర్శించడానికి ఆయన ఇంటికి వచ్చారని, తాము రాజకీయాలేమీ మాట్లాడుకోలేదని చెప్పారు.