జయ సమక్షంలో పార్టీ తీర్థం
అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తా
డీఎండీకేలో వలసల బెంగ
సాక్షి, చెన్నై : సీనియర్ నాయకుడు బన్రూటి రామచంద్రన్ అన్నాడీఎంకేలో చేరారు. కుటుంబంతో కలసి పోయేస్ గార్డెన్‌లో సీఎం జయలలిత సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు లక్ష్యంగా కృషి చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో బన్రూటి రామచంద్రన్ ఒకరు. తొలుత డీఎంకేలో, అనంతరం ఎంజీయార్ నేతృత్వంలోని అన్నాడీఎంకేలో రాజకీయ పయనం సాగించారు. ఎంజీయార్‌కు అత్యంత విధేయుడిగా ఉన్న ఆయన అనంతరం ఆ పార్టీకి దూరం అయ్యారు. 2005లో విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే ఆవిర్భవించినప్పటి నుంచి ఆ పార్టీకి వెన్ను దన్నుగా ఉంటూ వచ్చారు. విజయకాంత్‌ను ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి తీసుకెళ్లడంలో బన్రూటి కీలక పాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యం. ఆ పార్టీలో సాగుతున్న కుట్ర పూరిత రాజకీయాలు బన్రూటిలో ఆవేదనను రగిల్చాయి.
రాజకీయాల నుంచి తప్పుకుంటూ: గత ఏడాది చివరల్లో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా బన్రూటి హఠాత్ ప్రకటన చేశారు. డీఎండీకే ప్రిసీడియం చైర్మన్ పదవికి, ఎమ్మెల్యే, శాసన సభా పక్ష ఉప నేత పదవులకు రాజీనామా చేశారు. వయోభారం, అనారోగ్య కారణాలతో రాజకీయూల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఎవరినీ నిందించకుండా డీఎండీకే నుంచి బయటకు వచ్చిన బన్రూటి సేవలను తమ పార్టీకి ఉపయోగించుకునేందుకు సీఎం జయలలిత వ్యూహ రచన చేశారు. తిరువళ్లూరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బన్రూటికి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి అన్నా బిరుదును ప్రకటించారు. దీంతో తన రాజకీయ సెలవు నిర్ణయాన్ని బన్రూటి పునః సమీక్షించే పనిలో పడ్డారు.
అన్నాడీఎంకే తీర్థం: రాజకీయాలకు ఇక సెలవు అని ప్రకటించిన బన్రూటి అన్నాడీఎంకే గూటికి చేరే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. విజయకాంత్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టే పనిలో పడ్డారు. దీంతో అన్నాడీఎంకేలోకి బన్రూటి చేరినట్టేనన్న ప్రచారం వేగం పుంజుకుంది. అయితే, తానెప్పుడు పార్టీలో చేరబోతున్నానో అన్న వివరాలను మద్దతుదారులకు సైతం తెలియకుండా గోప్యంగా ఉంచారు. గురువారం ఉదయాన్నే సతీమణి శాంతి, తనయుడు సంపత్‌కుమార్‌తో కలసి పోయేస్ గార్డెన్ మెట్లు ఎక్కారు. పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి వచ్చిన బన్రూటికి సభ్యత్వాన్ని అందజేసిన జయలలిత కాసేపు ముచ్చటించారు. లోక్‌సభ ఎన్నికల ద్వారా ఢిల్లీలో అన్నాడీఎంకే ఖ్యాతి ఎలుగెత్తి చాటడం లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని బన్రూటి మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అన్నాడీఎంకే అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా తన పయనం ఉంటుందన్నారు.
వలసల బెంగ: బన్రూటి అధికారికంగా అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకోవడంతో డీఎండీకేలో వలసలు మొదలయ్యే అవకాశాలున్నారుు. పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా, సీనియర్ నాయకుడిగా వ్యవహరించిన బన్రూటికి ఆ పార్టీ నాయకులందరూ సన్నిహితులే. అనేక జిల్లాల్లోని డీఎండీకే నాయకులు పెద్ద దిక్కు లేని దృష్ట్యా, బయటకు వెళ్లలేక కాలం నెట్టుకు వస్తున్నారు. తాజాగా అన్నాడీఎంకేలోకి బన్రూటి వెళ్లడంతో ఆయన మద్దతుదారులుగా ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ బన్రూటి పార్టీ మారడంతో వలసల బెంగ డీఎండీకే అధిష్టానాన్ని పట్టుకుంటోంది. ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రెబల్స్ అవతారం ఎత్తిన దృష్ట్యా, మరి కొందరు త్వరలో అమ్మకు జై కొట్టే అవకాశాలు ఎక్కువే.
అన్నాడీఎంకేలోకి బన్రూటి
Published Thu, Feb 20 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM
Advertisement
Advertisement