చల్లని కబురు
Published Sun, Oct 20 2013 3:37 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులోని తాగునీటి సమస్య ఈనాటిది కాదు. ప్రజలు దశాబ్దాలుగా నీటి కోసం అగచాట్లు పడుతున్నారు. నీటి సమస్య పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి హోదాలో ఎంజీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా ఏటా తెలుగుగంగ నీరు రాష్ట్రానికి వస్తోంది. అలాగే చిన్నాచితక పథకాలు అమలవుతున్నాయి. ఈ క్రమంలోనే సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రెండు నిర్లవణీకరణ కేంద్రాలను తీసుకు వచ్చింది. మరోవైపు కావేరి నీటి కోసం కర్ణాటకతో పోరాటం సాగిస్తోంది.
నాలుగు జిల్లాల్లో మరో పథకం
తిరుప్పూరు, ఈరోడ్, తంజావూరు, కోయంబత్తూరు జిల్లాల్లో రూ.717.32 కోట్ల అంచనా వ్యయంతో సహకార తాగునీటి పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ప్రకటించారు. ఈ పథకంతో తిరుపూరు జిల్లాలోని వెల్లకోయిల్, మాలనూర్, తారాపురం, కున్నట్టం, కాంగేయం ప్రాంతాలు లబ్ధి పొందనున్నాయి. ఈరోడ్ జిల్లా చెన్నమలై పంచాయతీలోని 1262 పక్కాగృహాలకు నీటిని సరఫరా చేయనున్నారు. అలాగే తంజావూరు జిల్లా తిల్లుల పేరావూరణి, పెరుమగళూర్, అదిరామపట్టినం, మరో 9 పంచాయతీల్లోని 1153 పక్కాగృహాలకు నీటిని సరఫరా చేస్తారు. ఇందుకు నిర్మాణ వ్యయంగా రూ.495.70 కోట్లు, ఏడాది నిర్వహణ వ్యయంగా రూ.9.19 కోట్లు కేటాయించారు. కోయంబత్తూరు జిల్లా తొండాపుత్తూరు, పులువపట్టి, తేన్‌కరై, వేటపట్టి, దాళ యూర్, ఆలిందురై, పేరూర్, మరో 134 పంచాయతీల్లోని పక్కాగృహాలకు రూ.130.46 కోట్లతో పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం అధికశాతం కావేరి నదీ జలాలపై ఆధారపడి ఉండడం గమనార్హం.
Advertisement
Advertisement