తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం విజయ్ నుంచి రజనీకాంత్ దాకా ప్రజాదరణ పొందిన సినిమా స్టార్ల పని పట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు తమిళ సినిమాల్లో రాజకీయపరంగా చూపుతున్న వివాదాస్పద దృశ్యాల పట్ల ప్రభుత్వ వైఖరిని ఇది ప్రతిఫలిస్తోంది. మరొకవైపు జయలలిత జీవించి ఉండగా ఆమెను కన్నెత్తి చూడటానికి సాహసించని తమిళ చిత్ర పరిశ్రమ ఆమె లేనప్పుడు విమర్శలకు దిగడం గమనార్హం. విజయ్ తాజా సినిమా ‘సర్కార్’ లో ప్రజలు మిక్సర్లు, గ్రైండర్లు వంటి జయ ప్రభుత్వం అందించిన ఉచిత వస్తువులను నిప్పుల్లోకి విసిరేస్తున్నట్లు చిత్రించిన పాట పట్ల అన్నాడీఎంకే తీవ్ర ఆగ్రహం ప్రదర్శించింది.
తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్నది నిజంగానే పరిహాసాస్పదంగా ఉంది. రాజకీయ రంగంలో ప్రతిభకు సంబంధించిన కన్వేయర్ బెల్ట్‌గా చిత్రపరిశ్రమను వ్యవహరిస్తున్న చరిత్ర ఈ రాష్ట్రానికి ఉంది. వెండితెరకు పరిచయమై తర్వాత రాజకీయ భవిష్యత్తును నిర్మించుకున్న ఇద్దరు నేతలు ఎంజీ రామచంద్రన్, జయలలితలతో అన్నాడీఎంకే బాగా లబ్ధి పొందింది. అంతకు ముందు డీఎంకే పార్టీ మాస్ మీడియా అయిన సినిమా దన్నుతో తన భావజాలాన్ని ప్రచారం చేసేది. కానీ ఈరోజు అన్నాడీఎంకే గడచిన దీపావళివారాన్ని చాలావరకు చెన్నై ఆకాశంలో రాజకీయ పటాసులను పేల్చడంలోనే గడిపేసింది. తమిళ చిత్ర పరిశ్రమలో ముగ్గురు మేటి హీరోలు విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్‌లకు వ్యతిరేకంగా తుపాకులు గురిపెట్టాలని ఈ పార్టీ నిశ్చయించింది. రజనీ, కమల్ రాజకీయాల్లో ప్రవేశించనున్నట్లు ప్రకటించారు. ఇక రాజకీయాలపై విజయ్ ఆసక్తి అందరికీ తెలిసిందే.
తమిళనాడులో విజయ్ నటించిన చిత్రం ‘సర్కార్’తో అన్నాడీఎంకే సర్కారుకు సమస్యలు మొదలయ్యాయి. ఊహించినట్లుగానే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ఓపెనింగ్స్‌సాధించింది. అయితే, ‘సర్కార్’ సినిమా తమ పార్టీ పరువుకు నష్టం కలిగించేందుకు పన్నిన కుట్ర అంటూ అన్నాడీఎంకే నిందించింది. విజయ్, ఈ చిత్ర నిర్మాతలను ఉగ్రవాదులుగా చిత్రించడమే కాకుండా రాజద్రోహ ఆరోపణలు చేస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇద్దరు మంత్రులు హెచ్చరించారు. విజయ్ వంటి వృద్ధిలోకి వస్తున్న నటుడికి ఇది మంచిది కాదు అని రాష్ట్ర సమాచార మంత్రి కె. రాజు అభిప్రాయపడ్డారు. ఇక న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం ఆరోగ్యకరమైన విమర్శకు ఆహ్వానం పలుకుతూనే, సినిమా హింసను ప్రేరేపించిందని, ఇది తీవ్ర నేరమని వ్యాఖ్యానించారు.
ప్రజలు తమకు ఓటు వేసేలా ఆకర్షించడానికి వస్తువులను ఉచితంగా బహూకరిస్తామని వాగ్దానం చేయడం తమిళనాడు ఎన్నికల సంస్కృతిలో భాగం. అన్నాడీఎంకే దివంగత నాయకురాలు జయలలిత 2011 తమిళనాడు ఎన్నికల్లో ఈ వస్తువులను ఇస్తామని వాగ్దానం చేశారు. ప్రజలు ఇలాంటి ఉచిత వస్తువులను తిరస్కరిస్తున్నట్లు చూపటం ద్వారా సర్కార్ చిత్రం అన్నాడీఎంకే పార్టీని వేలెత్తి చూపుతోందని ఆ పార్టీ అర్థం చేసుకుంది. అంతటితో కథ ముగియలేదు. ఆ సినిమాలో విలన్ పాత్ర పోషించిన వరలక్ష్మి పేరు కోమలవల్లి. ఇది జయలలిత అసలు పేరు. తమ నాయకురాలి స్మృతిని అవమానించడానికి ఉద్దేశపూర్వకంగా ఆ పేరును పెట్టారని అన్నాడీఎంకే భావిస్తోంది. పైగా సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించడం రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లు అన్నాడీఎంకే పసిగట్టింది. ఈ చిత్ర సమర్పకుడు కళానిధి మారన్ డిఎంకే దివంగత నాయకుడు ఎం.కరుణానిధి మునిమనవడు. కళానిధి సోదరుడు దయానిధి మారన్ డీఎంకే ఎంపీగా, యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర టెలికాం మంత్రిగా పనిచేశారు. పైగా తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలు రాజకీయపరంగా బద్ధశత్రువులు కూడా.
అన్నాడీఎంకే కార్యకర్తలు మదురైలో సర్కార్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడమే కాకుండా సినిమా హాళ్లపై దాడి చేయడంతో పరిణామాలు మరింత వేడెక్కాయి. ఈ సినిమాపై 110 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినందున ఆర్థిక నష్టాన్ని పసిగట్టిన సర్కార్ చిత్ర నిర్మాతలు సినిమాలో కోమలవల్లి పేరును వల్లించిన దృశ్యాలను మ్యూట్ చేయడంతోపాటు ఉచిత పథకాలపై విమర్శ దృశ్యాలను సినిమాలోంచి తొలగించాలని నిర్ణయించారు కూడా.సర్కార్ సినిమాపై తమ వైఖరిని మరింత స్పష్టంగా వ్యక్తపరచిన ఆ రాష్ట్ర రెవెన్యూమంత్రి ఆర్‌బి ఉదయకుమార్ తమిళ సినిమాలకు విధివిధానాలను కూడా నిర్దేశించేంత పనిచేశారు. సెన్సార్ బోర్డును మించి మాట్లాడుతూ, రాజకీయ ఉద్దేశాలతో కూడిన వివాదాస్పద దృశ్యాలను సినిమాలు వదిలేయాలని ఉదయకుమార్ పేర్కొన్నారు. అమ్మ జయలలిత ప్రభుత్వ సంక్షేమ పథకాలను విమర్శించే హక్కు ఎవరికీ లేదని ప్రకటించారు. 2017 దీపావళినాడు విడుదలైన విజయ్ సినిమా మెర్సల్ (తెలుగులో ‘అదిరింది’) సైతం ఇలాంటి చిక్కులను ఎదుర్కొంది.
జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్)ని నేరుగా విమర్శిస్తూ ఆ సినిమాలో పొందుపర్చిన ఒక సంభాషణ పట్ల తమిళనాడు బీజేపీ యూనిట్ అభ్యంతరం తెలిపింది. సినిమాలోంచి ఆ డైలాగ్‌ను తీసివేయాలని కోరుతూ బీజేపీ విజయ్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేసింది కూడా. కానీ ఆ చిత్రంపై వచ్చిన వ్యతిరేకత మరింత ఆసక్తిని రేపి, మెర్సల్‌ని బాక్సాఫీసు వద్ద మరింత హిట్ చేసింది. నిజానికి మెర్సల్‌ను వ్యతిరేకించాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. ఒకసారి సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చాక, అన్నాడీఎంకే ప్రభుత్వంతో సహా మరెవరికీ సినిమాను అడ్డుకునే అధికారం లేదని సర్కార్ సినిమాను సమర్థిస్తున్న వారు వాదిస్తున్నారు. ప్రభుత్వ బలాన్ని, కండబలాన్ని ఉపయోగించి తమ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడిచేస్తున్నట్లుగా వీరు భావిస్తున్నారు. అయితే చిత్ర నిర్మాతలను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకోవడం సర్కార్ సినిమాతోనే మొదలు కాలేదు. 2013లో కమల్ హాసన్ సైతం ముస్లిం బృందాలు వ్యతిరేకత తెలపడంతో తన విశ్వరూపం సినిమాలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నవారి ప్రోత్సాహంతోటే అలాంటి నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని ఈ ప్రముఖ నటుడు, నిర్మాత పదేపదే చెబుతూ వచ్చారు.
అదే సంవత్సరం విజయ్ తీసిన తలైవా (నాయకుడు) ‘నాయకత్వం వహించాల్సిన సమయం’ అంటూ ట్యాగ్ లైన్‌తో వచ్చింది. ఇది అన్నాడీఎంకే నాయకత్వాన్ని కలవరపర్చింది. చిత్ర ప్రచార కార్యక్రమాల నుంచి ఆ ట్యాగ్ లైన్‌ను పూర్తిగా తొలగించాక రెండు వారాలు ఆలస్యంగా ఆ సినిమా విడుదలకు నోచుకుంది. ‘నోటా’, ‘తమిళ్‌పడమ్2’ అనే రెండు సినిమాలు కూడా అన్నాడీఎంకే పాలనను తీవ్రంగా విమర్శించాయి. కానీ పాలక పార్టీ వాటిపై ఎలాంటి వ్యతిరేకతనూ ప్రదర్శించలేదు. నిజానికి తమిళ్‌పడమ్2 సినిమా దర్శకుడు సీఎస్ అముదం గత శుక్రవారం వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ, సర్కార్ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో అన్నాడీఎంకే సాయపడుతోందన్నారు. ‘అలాంటి ప్రచారాన్ని మా సినిమాకు దక్కనివ్వలేదు, మేం సినిమాను ఉత్తమంగా తీయడానికి ప్రయత్నించాం. ఇది పూర్తిగా పాక్షిక వైఖరే‘ అనేశారు. విజయ్‌ని అన్నాడీఎంకే ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఉంది. విజయ్‌కి యూత్‌లో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది.
తన సినిమాలో ప్రదర్శించిన అన్నాడీఎంకే వ్యతిరేక సందేశం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపగలదు. తమ దివంగత నాయకురాలు ప్రోత్సహించిన సంక్షేమపథకాలపై విమర్శను చూసీ చూడనట్లు వదిలివేసిన పక్షంలో తమ పార్టీని హేళన చేయడానికి కోలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలు వరుసకట్టే ప్రమాదం ఉందని అన్నాడీఎంకే వాదిస్తోంది. అయితే మరింత వ్యూహాత్మకంగా పావులు కదిపిన అన్నాడీఎంకే పార్టీ విషయాన్ని అంతటితో ఆపివేయలేదు. ఇద్దరు తమిళ దిగ్గజ నటులు రజనీకాంత్, కమల్ హాసన్‌ల పని పట్టాలని కూడా నిశ్చయించుకుంది. సెన్సార్ బోర్డ్ ఆమోదం తెలిపిన సినిమాను దెబ్బతీయడానికి ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఈ ఇద్దరు నటులూ విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే పత్రిక ‘నమదు అమ్మ’ (మన అమ్మ) రజనీకాంత్‌ని విమర్శిస్తూ, ప్రభుత్వం ఆమోదించిన ఆహారంలో బల్లి కనపడితే రజనీకాంత్ దాన్ని ఆరగించగలరా అని ఎద్దేవా చేసింది.
ఈ వ్యంగ్య విమర్శను అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. అన్నాడీఎంకే రజనీకాంత్‌పై గురిపెట్టడం వాస్తవమే. ఎందుకంటే బీజేపీతో రజనీకాంత్ బంధం రహస్యమైన విషయం కాదు. దానికి రాజకీయ ప్రాధాన్యత ఉంది కూడా. రజనీకాంత్ వెంటనే తనపై విమర్శను తిప్పికొట్టడమే కాకుండా, అన్నాడీఎంకేకి బలమైన సందేశం పంపారు. నరేంద్రమోదీని దేశంలోనే అత్యంత శక్తిమంతుడైన నాయకుడిగా రజనీ ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. ఇక కమల్ హాసన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి ఎద్దేవా చేశారు. విశ్వరూపం తొలి భాగం సినిమాకు సమస్యలు ఎదురు కానున్నట్లు సూచన వచ్చినంతనే దేశం వదిలి వెళ్లిపోవడానికి సంసిద్ధత ప్రదర్శించిన కమల్‌ను సీఎం పరిహసించారు.
అన్నాడీఎంకే అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రంలో 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళ చిత్రపరిశ్రమలో గ్లామర్ ఉన్న నటులను ఓ పట్టు పట్టాలని పాలకపార్టీ ప్రయత్నిస్తోంది. అమ్మ ప్రభుత్వంగా తనకు తాను చెప్పుకుంటున్న ప్రస్తుత నాయకత్వం తేలిపోతున్నట్లు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని అన్నాడీఎంకే అనుమానిస్తోంది. జయలలిత నిజమైన వారసురాలిగా అన్నాడీఎంకే నిలబడుతుందా లేదా అనే విషయాన్ని మనం 2019లో చూడబోతున్నాం. ఈలోగా విజయ్ సినిమా సర్కార్‌కి ఇది ప్రభుత్వ స్పందన అయినట్లయితే, అవినీతిపై యుద్ధం ప్రకటించిన కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాపట్ల ప్రభుత్వ వైఖరి మరీ ఘోరంగా ఉండతోతుందని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. స్పష్టంగానే, పాలక అన్నాడీఎంకేకి, సినీ రాజకీయనేతల నడుమ ఘర్షణ సమీప భవిష్యత్తులో ముగిసిపోయేలా కనిపించటం లేదు.
టీఎస్ సుధీర్
వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment