shashi enterprises
-
జయకు ఊరట
చెన్నై, సాక్షి ప్రతినిధి:జైలు, బెయిలుతో సతమతం అవుతున్న అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మరో కేసు నుంచి ఊరట లభించింది. గత 18 ఏళ్లుగా కోర్టులో జరుగుతున్న తమ శాఖాపరమైన కేసును వాపస్ తీసుకుంటున్నట్లు ఆదాయపు పన్ను శాఖ గురువారం ప్రకటించింది. జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ భాగస్తులుగా శశి ఎంటర్‌ప్రైజెస్‌ను స్థాపించారు. 1991-92, 1992-93 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయలేదు. దీంతో వారిపై ఆదాయపు పన్ను శాఖ కేసులు పెట్టి నోటీసులు పంపింది. ఎగ్మూరులోని ఆర్థిక నేరాల ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేటుకోర్టులో 18 ఏళ్లుగా కేసు నడుస్తోంది. కేసు పరిష్కారానికి ఇరుపక్షాల నడుమ ఇటీవలే సామరస్య ఒప్పందం జరిగింది. కేసు మొత్తం మీద రూ.1.99 కోట్లు చెల్లించేలా ఇరుపక్షాలు నిర్ణయించుకున్నారుు. ఒప్పందం జరిగిన తరువాత గత నెల ఒకటో తేదీన ఎగ్మూరు కోర్టులో విచారణకు రాగా, జయ, శశికళ ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఆదాయపు పన్ను, జరిమానా మొత్తం చెల్లించేందుకు తాము సిద్ధమైనందున కోర్టులో కేసును కొట్టివేయాలని జయ, శశికళ తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనతో గత నెల 11వ తేదీకి వాయిదాపడగా, అదేరోజు సాగిన విచారణలో...ఆదాయపు పన్ను శాఖ కోరిన మొత్తాన్ని చెల్లించేశామని, అయితే ఆ శాఖ నుంచి ఇంత వరకు కేసు ఉపసంహరణపై ఆదేశాలు అందలేదని న్యాయవాదులు కోర్టుకు విన్నవించుకున్నారు. ఆదాయపు పన్ను నుంచి ఆదేశాలు జారీ అయ్యేవరకు కోర్టు కేసును పెండింగ్ పెట్టాలని కోరారు. ఈ అభ్యర్థన మేరకు ఈ నెల 8వ తేదీకి కేసు వాయిదాపడింది. ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది. జయలలిత తరపున న్యాయవాదులు కరుపయ్య, సెల్వకుమార్, ధనుంజయన్, శశికళ తరపున వైరమూర్తి, అన్బిల్ కామరాజ్, జ్యోతికుమార్, పెరుమాళ్, నారాయణరావు, ఆవిన్ వెంకటేశన్ వాదించారు. ఆదాయపు పన్ను శాఖ వద్ద తాము దాఖలు చేసిన సామరస్య ఒప్పందానికి ఆ శాఖాధికారులు సమ్మతించారని, వారు కోరిన మేరకు అసలు, జరిమానా సహా చెల్లించామని వివరించారు. ఈ కారణంగా కక్షిదారుల కేసును కొట్టివేయాలని కోరారు. ఆదాయపు పన్ను శాఖ తరపు న్యాయవాది రామస్వామి హాజరై జయ, శశికళ తగిన సొమ్ము చెల్లించారని, ఈ వివరాలతో కూడిన రశీదులను కోర్టుకు సమర్పించి కేసును వాపస్ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జయ, శశికళ మీదున్న కేసులను కొట్టివేస్తున్నట్లు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించారు. -
అమ్మకు సమన్లు
జయలలిత, శశికళ కోర్టుకు రండి ఎగ్మూర్ కోర్టు ఆదేశం విచారణకు ఐటీ రిటర్నింగ్ కేసు సాక్షి, చెన్నై: ఆదాయపు పన్ను దాఖలు కేసు సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ మెడకు చుట్టుకునేనా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడో దాఖలైన కేసు విచారణను వేగవంతం చేయడానికి ఎగ్మూర్ ఆర్థిక నేరాల కోర్టు నిర్ణయించింది. విచారణ కోసం కోర్టుకు రావాలంటూ జయలలిత, శశికళకు గురువారం సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ మూడో తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. రాష్ర్ట ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై కేసులకు కొదవ లేదు. ఇందులో ప్రధానంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ బెంగళూరు కోర్టులో సాగుతోంది. మరొకటి ఆదాయపు పన్ను ఎగవేత కేసు. 1991-92,1992-93 సంవత్సరానికి గానూ, శశి ఎంటర్ ప్రెజైస్కు సంబంధించి గానీ, 1993-94కు గాను జయలలిత, శశికళ వ్యక్తిగతంగా తమ ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేదన్న అమ్మకు సమన్లు ఆరోపణలు వచ్చారుు. డీఎంకే హయంలో ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝుళిపించింది. జయలలిత, శశికళలు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేదని గుర్తించి ఆ ఇద్దరిపై అభియోగం మోపుతూ కేసు నమోదు చేశారు. ఎగ్మూర్ కోర్టులో: ఆదాయ పన్ను ఎగవేత వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణ చెన్నై ఎగ్మూర్ ప్రధాన మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఆర్థిక నేరాల విచారణ 18 ఏళ్లుగా కోర్టులో సాగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వాలు మారాయి. విచారణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. ఈ కేసు నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ ఇటీవల హైకోర్టును జయలలిత, శశికళ ఆశ్రయించారు. అయితే, ఆ ఇద్దరికి చుక్కెదురైంది. హైకోర్టు పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. అలాగే, ఈ కేసు విచారణను నాలుగు నెలల్లో ముగించాలని ఎగ్మూర్ కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణ వేగవంతం: సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎగ్మూర్ ఆర్థిక నేరాల కోర్టు విచారణ వేగవంతం చేయడానికి నిర్ణయించింది. న్యాయమూర్తి దక్షిణామూర్తి నేతృత్వంలో గురువారం విచారణ జరిగింది. ఆదాయపు పన్ను శాఖ తరపున న్యాయవాది రామస్వామి వాదన విన్పించారు. నేరారోపణ ఎదుర్కొంటున్న జయలలిత, శశికళలపై సెక్షన్ 313 ప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. జయలలిత తరపున హాజరైన న్యాయవాదులు వివరణకు ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. నాలుగు వారాల పాటుగా విచారణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ మూడో తేదీకి న్యాయమూర్తి దక్షిణామూర్తి వాయిదా వేశారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న జయలలిల, శశికళను నేరుగా విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. అదే రోజున ఈ ఇద్దరు తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని, అందుకు తగ్గ సమన్లు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు. చుక్కెదురు: ఎన్నికల సమయంలో తమ అధినేత్రికి వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలు రావడాన్ని అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దీనిని అస్త్రంగా చేసుకుని ఎక్కడ ప్రతి పక్షాలు తమ మీద దాడికి దిగుతాయోనన్న కలవరం మొదలైంది. తమకు విముక్తి కల్పించాలన్న పిటిషన్లు అన్నీ తిరస్కరణకు గురి కావడం, తాజాగా విచారణకు రావాలంటూ కోర్టు ఆదేశించడంతో తదుపరి కార్యాచరణపై జయలలిత, శశికళ తరపున న్యాయవాదులు సమాలోచనలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యాన్ని అస్త్రంగా చేసుకుని, మరి కొద్ది రోజుల పాటుగా విచారణను వాయిదా వేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం జయలలిత ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉండటమే.