జయకు ఊరట
చెన్నై, సాక్షి ప్రతినిధి:జైలు, బెయిలుతో సతమతం అవుతున్న అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మరో కేసు నుంచి ఊరట లభించింది. గత 18 ఏళ్లుగా కోర్టులో జరుగుతున్న తమ శాఖాపరమైన కేసును వాపస్ తీసుకుంటున్నట్లు ఆదాయపు పన్ను శాఖ గురువారం ప్రకటించింది. జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ భాగస్తులుగా శశి ఎంటర్‌ప్రైజెస్‌ను స్థాపించారు. 1991-92, 1992-93 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయలేదు. దీంతో వారిపై ఆదాయపు పన్ను శాఖ కేసులు పెట్టి నోటీసులు పంపింది. ఎగ్మూరులోని ఆర్థిక నేరాల ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేటుకోర్టులో 18 ఏళ్లుగా కేసు నడుస్తోంది. కేసు పరిష్కారానికి ఇరుపక్షాల నడుమ ఇటీవలే సామరస్య ఒప్పందం జరిగింది. కేసు మొత్తం మీద రూ.1.99 కోట్లు చెల్లించేలా ఇరుపక్షాలు నిర్ణయించుకున్నారుు.
ఒప్పందం జరిగిన తరువాత గత నెల ఒకటో తేదీన ఎగ్మూరు కోర్టులో విచారణకు రాగా, జయ, శశికళ ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఆదాయపు పన్ను, జరిమానా మొత్తం చెల్లించేందుకు తాము సిద్ధమైనందున కోర్టులో కేసును కొట్టివేయాలని జయ, శశికళ తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనతో గత నెల 11వ తేదీకి వాయిదాపడగా, అదేరోజు సాగిన విచారణలో...ఆదాయపు పన్ను శాఖ కోరిన మొత్తాన్ని చెల్లించేశామని, అయితే ఆ శాఖ నుంచి ఇంత వరకు కేసు ఉపసంహరణపై ఆదేశాలు అందలేదని న్యాయవాదులు కోర్టుకు విన్నవించుకున్నారు. ఆదాయపు పన్ను నుంచి ఆదేశాలు జారీ అయ్యేవరకు కోర్టు కేసును పెండింగ్ పెట్టాలని కోరారు. ఈ అభ్యర్థన మేరకు ఈ నెల 8వ తేదీకి కేసు వాయిదాపడింది. ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది.
జయలలిత తరపున న్యాయవాదులు కరుపయ్య, సెల్వకుమార్, ధనుంజయన్, శశికళ తరపున వైరమూర్తి, అన్బిల్ కామరాజ్, జ్యోతికుమార్, పెరుమాళ్, నారాయణరావు, ఆవిన్ వెంకటేశన్ వాదించారు. ఆదాయపు పన్ను శాఖ వద్ద తాము దాఖలు చేసిన సామరస్య ఒప్పందానికి ఆ శాఖాధికారులు సమ్మతించారని, వారు కోరిన మేరకు అసలు, జరిమానా సహా చెల్లించామని వివరించారు. ఈ కారణంగా కక్షిదారుల కేసును కొట్టివేయాలని కోరారు. ఆదాయపు పన్ను శాఖ తరపు న్యాయవాది రామస్వామి హాజరై జయ, శశికళ తగిన సొమ్ము చెల్లించారని, ఈ వివరాలతో కూడిన రశీదులను కోర్టుకు సమర్పించి కేసును వాపస్ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జయ, శశికళ మీదున్న కేసులను కొట్టివేస్తున్నట్లు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించారు.