జయ కొరడా | Dhoti ban an insult to Tamil culture: Jayalalithaa | Sakshi
Sakshi News home page

జయ కొరడా

Published Thu, Jul 17 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM

జయ కొరడా

జయ కొరడా

చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్రాస్ క్రికెట్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈనెల 11వ తేదీన న్యాయమూర్తి హరి పరంధామన్, మరికొందరు సీనియర్ న్యాయవాదులు పంచెకట్టుతో హాజరయ్యూరు. అయితే ఇది తమ క్లబ్ డ్రెస్‌కోడ్‌కు విరుద్ధమంటూ వారిని లోపలికి అనుమతించలేదు. ఈ సంఘటనపై సంప్రదాయ తమిళులు  మండిపడ్డారు. క్లబ్ నిర్వాహకులపై చర్య తీసుకోవాలంటూ అనేక రాజకీయ పార్టీలు ధ్వజమెత్తాయి. తమ క్లబ్ డ్రెస్‌కోడ్‌ను ప్రశ్నించే హక్కు లేదంటూ సమర్థించుకున్న నిర్వాహకులు ప్రజాప్రతిఘటనకు తలొగ్గి పరిశీలిస్తామని చెప్పారు. పంచెకట్టు వివాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో బుధవారం నాటి అసెంబ్లీ సమావేశంలో సీఎం జయలలిత స్పందించారు.

ఆంగ్లేయుల పాలన అంతమై దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 67 ఏళ్లు దాటినా నిషేధాజ్ఞలు అమలులో ఉండటం శోచనీయమన్నారు. విదేశాల్లో జరిగే సమావేశాలకు తమిళులు పంచెకట్టుతో హాజరైనా అక్కడి వారు అభ్యంతరం తెలపలేదు, అలాంటిది తమిళనాడులోనే పంచెకట్టుకు పరాభవమా అని ఆందోళన వ్యక్తం చేశారు. పంచెకట్టుపై అభ్యతరం తెలపడమంటే తమిళ ఆచార సంప్రదాయాలను అడ్డుకోవడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. మద్రాస్ క్రికెట్ క్లబ్ మాత్రమే కాదు మరి కొన్ని క్లబ్బులు సైతం ఇటువంటి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.

పంచెకట్టును అడ్డుకున్న క్రికెట్ క్లబ్‌కు సంజాయిషీ నోటీసు జారీచేయాలని రిజిస్ట్రారును ఆదేశించినట్లు ఆమె తెలిపారు. అలాగే ఇతర క్లబ్‌ల నిర్వహణపై నిబంధనలు పునఃపరిశీలించాలని ఆదేశించారు. పంచెకట్టు వివాదం పట్ల స్పష్టమైన వైఖరి అవలంభించిన ముఖ్యమంత్రి జయలలితను శాసన సభలో సొంత పార్టీ సభ్యులతోపాటు ప్రతి పక్షాల సభ్యులు కూడా అభినందించారు.
 
డ్రెస్‌కోడ్ క్లబ్‌ల ఇష్టం : కోర్టు
 ఇదిలా ఉండగా, పంచెకట్టును అడ్డుకున్న క్లబ్‌పై చట్టపరమైన చర్యలకు ఆదేశించాలని కోరుతూ కార్తిక్ అనే న్యాయవాది వేసిన పిటిషన్ బుధవారం మద్రాస్ హైకోర్టు ముందుకు వచ్చింది. పిటిషనర్ వాదనను విన్న న్యాయమూర్తులు అగ్నిహోత్రి, ఎంఎం సుందరం మాట్లాడుతూ, డ్రెస్‌కోడ్‌ను అమలు చేసుకునే హక్కు ప్రైవేటు క్లబ్బులకు ఉందని అన్నారు. ఏదైనా అభ్యంతరాలుంటే శాసనసభలో చర్చించుకోవాలేగానీ కోర్టు పరిధిలోకి ఈ అంశం రాదని వ్యాఖ్యానించారు. ఈ కారణంగా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement