Senior lawyers
-
ఆ అభ్యర్థనలు ఆమోదయోగ్యం కాదు.. నేను అనుమతించను: ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: తమ కేసులను అత్యవసర విచారణకు తీసుకోవాలంటూ సీనియర్ న్యాయవాదులు చేస్తున్న అభ్యర్థనలు ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టంచేశారు. ‘సీనియర్ లాయర్లు ఇలా మెన్షన్ చేయడాన్ని నేను అనుమతించబోను. సుప్రీంకోర్టు పనిదినం ప్రారంభంకాగానే తమ కేసులే ముందుగా విచారణకు చేపట్టాలంటూ పలువురు సీనియర్ లాయర్ల నుంచి వినతులు ఎక్కువయ్యాయి. వారి వినతులకు ప్రాధాన్యత ఇవ్వబోను’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. అర్జెంట్ లిస్టింగ్(కేసుల విచారణ జాబితా)లో తమ కేసును జతచేయాలంటూ ఒక సీనియర్ వకీలు.. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ రమణల ధర్మాసనం ముందు క్యూలో నిల్చొని అభ్యర్థిస్తుండగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ మరుసటి రోజు మెన్షన్ చేయండని మీ ఏఓఆర్(అడ్వొకేట్ ఆన్ రికార్డ్)కు చెప్పండి’ అంటూ సీజేఐ సూచించారు. కేసులను మెన్షన్ చేసేందుకు సీనియర్ లాయర్లయిన కపిల్ సిబల్, ఏఎం సింఘ్వీలనూ సీజేఐ అనుమతించలేదు. చదవండి: (గుడ్‌న్యూస్: 2024 డిసెంబర్ 31 దాకా ‘పీఎంఏవై–అర్బన్’) -
విద్వేష ప్రసంగాలపై సీజేఐకి 76 మంది లాయర్ల లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ, హరిద్వార్‌లలో ఇటీవల జరిగిన ధర్మసంసద్ల సందర్భంగా పలువురి విద్వేషపూరిత ప్రసంగాలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ ఎన్వీ రమణకు 75మంది న్యాయవాదులు లేఖ రాశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రసంగించిన వారు సమాజంలో విద్వేషాలను ప్రేరేపించడమే కాదు, ఒక మతానికి చెందిన వారందరినీ చంపేయాలని బహిరంగంగా పిలుపునిచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రసంగాలు దేశ సమగ్రత, ఐక్యతలకు గొడ్డలిపెట్టుగా మారడమే కాదు, లక్షలాది ముస్లిం పౌరుల జీవితాలను ప్రమాదంలో పడవేశాయన్నారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో సీనియర్ లాయర్లు సల్మాన్ ఖుర్షీద్, దుష్యంత్ దవే, మీనాక్షి అరోరా ఉన్నారు. -
కోర్టులకొచ్చేందుకు నేటికీ అత్యధికుల సంశయం
* 10 శాతం మంది మాత్రమే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు * దీన్ని మార్చి.. సత్వర న్యాయం అందేలా చూడాలి * ఈ బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉంది * స్వాతంత్య్ర వేడుకల్లో ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ * పలువురు సీనియర్ న్యాయవాదులకు ఘన సన్మానం సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలు తమ హక్కుల విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ఇప్పటికీ సంశయిస్తున్నారని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ పేర్కొన్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే వివాదాలు, సమస్యల పరిష్కారానికి న్యాయస్థానాల మెట్లు ఎక్కుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి అవసరమైన ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే కాకుండా అది సత్వరమే అందేలా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉందన్నారు. సోమవారం హైకోర్టు ప్రాంగణంలో 70వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరిగాయి. ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన వారిలో అత్యధికులు న్యాయవాదులే అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీతోపాటు మొదటి గవర్నర్ జనరల్ రాజగోపాలచారి, మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, మొదటి ఉప ప్రధాన మంత్రి, హోంమంత్రి సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్, మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తదితరులు ప్రముఖ న్యాయవాదులేనని ఏసీజే గుర్తుచేశారు. వారి త్యాగాల ఫలితమే ఇప్పుడు దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోందన్నారు. ఆ త్యాగాలను సదా స్మరించుకోవాలన్నారు. న్యాయం ఎవరికైతే అవసరమో వారికి న్యాయం అందించడంతోపాటు దానిని వేగంగా కూడా అందించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందన్నారు. ఈ విషయంలో సీనియర్ న్యాయవాదులు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు వారు తమ అనుభవనాలు, జ్ఞానాన్ని పంచాలని కోరారు. కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఏపీ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావు, ఏపీ, తెలంగాణ హైకో ర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షుడు సి.నాగేశ్వరరావు, జి.మోహనరావు తదితరు లు ప్రసంగించారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన హైకోర్టు సిబ్బంది పిల్లలకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ దంపతులు బహుమతులు ప్రదానం చేశారు. సీనియర్ న్యాయవాదులకు సన్మానం... ఉభయ రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులను ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఘనంగా సన్మానించారు. గత 55 ఏళ్ల నుంచి సీనియర్ న్యాయవాదులుగా న్యాయవ్యవస్థకు ఎనలేని సేవలందిస్తున్నందుకు హైకోర్టు వారిని సన్మానిం చింది. సన్మానం అందుకున్న వారిలో ఎ.పుల్లారెడ్డి, టి.బాల్‌రెడ్డి, కె.ప్రతాప్‌రెడ్డి, పి.బాలకృష్ణమూర్తి, బి.వి.సుబ్బయ్య, బత్తుల వెంకటేశ్వరరావు, ఇ.మనోహర్, కోకా రాఘవరావు, కె.వి.సత్యనారాయణ, సుబ్రహ్మణ్య నరసు తదితరులున్నారు. -
జయ కొరడా
చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్రాస్ క్రికెట్ క్లబ్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈనెల 11వ తేదీన న్యాయమూర్తి హరి పరంధామన్, మరికొందరు సీనియర్ న్యాయవాదులు పంచెకట్టుతో హాజరయ్యూరు. అయితే ఇది తమ క్లబ్ డ్రెస్‌కోడ్‌కు విరుద్ధమంటూ వారిని లోపలికి అనుమతించలేదు. ఈ సంఘటనపై సంప్రదాయ తమిళులు మండిపడ్డారు. క్లబ్ నిర్వాహకులపై చర్య తీసుకోవాలంటూ అనేక రాజకీయ పార్టీలు ధ్వజమెత్తాయి. తమ క్లబ్ డ్రెస్‌కోడ్‌ను ప్రశ్నించే హక్కు లేదంటూ సమర్థించుకున్న నిర్వాహకులు ప్రజాప్రతిఘటనకు తలొగ్గి పరిశీలిస్తామని చెప్పారు. పంచెకట్టు వివాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో బుధవారం నాటి అసెంబ్లీ సమావేశంలో సీఎం జయలలిత స్పందించారు. ఆంగ్లేయుల పాలన అంతమై దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 67 ఏళ్లు దాటినా నిషేధాజ్ఞలు అమలులో ఉండటం శోచనీయమన్నారు. విదేశాల్లో జరిగే సమావేశాలకు తమిళులు పంచెకట్టుతో హాజరైనా అక్కడి వారు అభ్యంతరం తెలపలేదు, అలాంటిది తమిళనాడులోనే పంచెకట్టుకు పరాభవమా అని ఆందోళన వ్యక్తం చేశారు. పంచెకట్టుపై అభ్యతరం తెలపడమంటే తమిళ ఆచార సంప్రదాయాలను అడ్డుకోవడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. మద్రాస్ క్రికెట్ క్లబ్ మాత్రమే కాదు మరి కొన్ని క్లబ్బులు సైతం ఇటువంటి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. పంచెకట్టును అడ్డుకున్న క్రికెట్ క్లబ్‌కు సంజాయిషీ నోటీసు జారీచేయాలని రిజిస్ట్రారును ఆదేశించినట్లు ఆమె తెలిపారు. అలాగే ఇతర క్లబ్‌ల నిర్వహణపై నిబంధనలు పునఃపరిశీలించాలని ఆదేశించారు. పంచెకట్టు వివాదం పట్ల స్పష్టమైన వైఖరి అవలంభించిన ముఖ్యమంత్రి జయలలితను శాసన సభలో సొంత పార్టీ సభ్యులతోపాటు ప్రతి పక్షాల సభ్యులు కూడా అభినందించారు. డ్రెస్‌కోడ్ క్లబ్‌ల ఇష్టం : కోర్టు ఇదిలా ఉండగా, పంచెకట్టును అడ్డుకున్న క్లబ్‌పై చట్టపరమైన చర్యలకు ఆదేశించాలని కోరుతూ కార్తిక్ అనే న్యాయవాది వేసిన పిటిషన్ బుధవారం మద్రాస్ హైకోర్టు ముందుకు వచ్చింది. పిటిషనర్ వాదనను విన్న న్యాయమూర్తులు అగ్నిహోత్రి, ఎంఎం సుందరం మాట్లాడుతూ, డ్రెస్‌కోడ్‌ను అమలు చేసుకునే హక్కు ప్రైవేటు క్లబ్బులకు ఉందని అన్నారు. ఏదైనా అభ్యంతరాలుంటే శాసనసభలో చర్చించుకోవాలేగానీ కోర్టు పరిధిలోకి ఈ అంశం రాదని వ్యాఖ్యానించారు. ఈ కారణంగా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.