కోర్టులకొచ్చేందుకు నేటికీ అత్యధికుల సంశయం | Independence celebrations in ACJ Justice Ramesh ranganathan | Sakshi
Sakshi News home page

కోర్టులకొచ్చేందుకు నేటికీ అత్యధికుల సంశయం

Published Tue, Aug 16 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

కోర్టులకొచ్చేందుకు నేటికీ అత్యధికుల సంశయం

కోర్టులకొచ్చేందుకు నేటికీ అత్యధికుల సంశయం

* 10 శాతం మంది మాత్రమే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు
* దీన్ని మార్చి.. సత్వర న్యాయం అందేలా చూడాలి
* ఈ బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉంది
* స్వాతంత్య్ర వేడుకల్లో ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్
* పలువురు సీనియర్ న్యాయవాదులకు ఘన సన్మానం

సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలు తమ హక్కుల విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ఇప్పటికీ సంశయిస్తున్నారని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ పేర్కొన్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే వివాదాలు, సమస్యల పరిష్కారానికి న్యాయస్థానాల మెట్లు ఎక్కుతున్నారని తెలిపారు.

ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి అవసరమైన ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే కాకుండా అది సత్వరమే అందేలా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉందన్నారు. సోమవారం హైకోర్టు ప్రాంగణంలో 70వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరిగాయి. ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన వారిలో అత్యధికులు న్యాయవాదులే అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీతోపాటు మొదటి గవర్నర్ జనరల్ రాజగోపాలచారి, మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, మొదటి ఉప ప్రధాన మంత్రి, హోంమంత్రి సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్, మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తదితరులు ప్రముఖ న్యాయవాదులేనని ఏసీజే గుర్తుచేశారు.

వారి త్యాగాల ఫలితమే ఇప్పుడు దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోందన్నారు. ఆ త్యాగాలను సదా స్మరించుకోవాలన్నారు. న్యాయం ఎవరికైతే అవసరమో వారికి న్యాయం అందించడంతోపాటు దానిని వేగంగా కూడా అందించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందన్నారు. ఈ విషయంలో సీనియర్ న్యాయవాదులు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు వారు తమ అనుభవనాలు, జ్ఞానాన్ని పంచాలని కోరారు. కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తులు పాల్గొన్నారు.

ఏపీ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావు, ఏపీ, తెలంగాణ హైకో ర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షుడు సి.నాగేశ్వరరావు, జి.మోహనరావు తదితరు లు ప్రసంగించారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన హైకోర్టు సిబ్బంది పిల్లలకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ దంపతులు బహుమతులు ప్రదానం చేశారు.
 
సీనియర్ న్యాయవాదులకు సన్మానం...
ఉభయ రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులను ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఘనంగా సన్మానించారు. గత 55 ఏళ్ల నుంచి సీనియర్ న్యాయవాదులుగా న్యాయవ్యవస్థకు ఎనలేని సేవలందిస్తున్నందుకు హైకోర్టు వారిని సన్మానిం చింది. సన్మానం అందుకున్న వారిలో ఎ.పుల్లారెడ్డి, టి.బాల్‌రెడ్డి, కె.ప్రతాప్‌రెడ్డి, పి.బాలకృష్ణమూర్తి, బి.వి.సుబ్బయ్య, బత్తుల వెంకటేశ్వరరావు, ఇ.మనోహర్, కోకా రాఘవరావు, కె.వి.సత్యనారాయణ, సుబ్రహ్మణ్య నరసు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement