చిన్నఅమ్మ | shashi kala special story on tamilanadu politics | Sakshi
Sakshi News home page

చిన్నఅమ్మ

Published Mon, Dec 12 2016 6:54 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

చిన్నఅమ్మ

చిన్నఅమ్మ

శశికళ (60)
జన్మస్థలం    : మన్నార్‌గుడి
జన్మదినం    : 26 జనవరి 1956
తల్లిదండ్రులు : కృష్ణవేణి, వివేకానందం


ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం...తమిళనాట రెండాకులు ఎక్కువే చదివింది.అందులో ఒక ఆకు... అమ్మ. ఇంకో ఆకు... చిన్నమ్మ.ఈ ఆకుల్లోనే పార్టీ కేడర్‌ మొత్తం సంతోషంగాకడుపు నింపుకుంటోంది.ఇప్పుడు ఒక ఆకు రాలిపోయింది.మిగిలిన రెండో ఆకుకు ‘జయ’కళ వస్తుందా?ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్‌ తమిళ్‌ క్వొశ్చన్‌!

శశికళ ప్రస్తుతం పార్టీకి పెద్ద దిక్కుగానే కాదు, టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగానూ మారారు. జయలలితను అత్యవసర స్థితిలో అపోలో ఆసుపత్రిలో చేర్పించాక ఆమెను కలుసుకుని పరామర్శించే అవకాశం ఆమె రక్త సంబంధీకులకు గానీ, గవర్నర్‌కుగానీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకుగానీ, కేంద్ర మంత్రులకు గానీ, మరే ప్రముఖులకు గానీ కలుగలేదు. వచ్చినవారంతా ఆసుపత్రిలోని వైద్యులతో మాట్లాడి వెనుదిరుగుతున్నారు. ‘చూడాల్సిన వాళ్లను చూసాము’ అని మాత్రమే మీడియాతో అంటున్నారు. వాస్తవానికి వైద్యులు మినహా జయలలితను నేరుగా కలుసుకున్నది కేవలం ఒకే  ఒక్కరు. ఆమె శశికళ మాత్రమే! పార్టీతోనూ, ప్రభుత్వంతోనూ ప్రత్యక్షంగా సంబంధంలేని శశికళకు, జయలలితకు ఉన్న అనుబంధం అంత బలీయమైనది.

కలెక్టర్‌ ఇంట్లో ఆయా!
శశికళ జన్మస్థలం తంజావూరు జిల్లా మన్నార్‌కుడి. పాఠశాల విద్య వరకే ఆమె చదువుకున్నారు. చిన్ననాటి నుండీ సినిమా నటి కావాలని శశికళ కోరిక. సినిమాలపై ఉన్న ఇష్టంతో ఆమె  చెన్నై టీటీకే రోడ్డులో సినిమా కేసెట్ల లెండింగ్‌ లైబ్రరీ నడిపేవారు. ఆమె భర్త నటరాజన్‌ అప్పటి జిల్లా కలెక్టర్‌ చంద్రలేఖ దగ్గర పార్ట్‌టైమ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌గా పనిచేసేవారు. ‘కేసెట్‌ లెండింగ్‌ లైబ్రరీ వల్ల పెద్దగా ఆదాయం రాదు, నీ భార్య చేత వీడియో కవరేజ్‌ షాపు పెట్టించు’ అని నటరాజన్‌కు సలహా ఇచ్చింది చంద్రలేఖేనని అంటారు. ఆ సమయంలోనే చంద్రలేఖకు బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఆలనా పాలన చూసేందుకు శశికళ ఆయాగా వెళ్లారు. వాస్తవానికి శశికళకు ఆయాగా పనిచేసే అవసరం లేదు. పెద్దవాళ్లతో పరిచయాల పట్ల ఆసక్తి ఉండడం ఆమెను అటువైపుగా నడిపించింది. శశికళ దంపతులకు పిల్లలు లేరు. బహుశా ఆ లోటును తీర్చుకునేందుకు కూడా ఆమె ఆయాగా ఉండేందుకు ఒప్పుకుని ఉండాలి.   

జయతో తొలి పరిచయం
అది 1984వ సంవత్సరం. జయలలిత అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. తన ప్రసంగాలను వీడియోగా చిత్రీకరించి కేసెట్లుగా అందించేందుకు ఒక వ్యక్తి కావాలని జయ చంద్రలేఖను కోరడంతో తన వద్ద ఆయాగా పనిచేస్తున్న శశికళను జయకు పరిచయం చేశారు చంద్రలేఖ. ఇలా జయకు దగ్గరైన శశికళ సినిమా వీడియో కేసెట్లను కూడా జయకు ఇస్తూ ఉన్న క్రమంలో వారి పరిచయం స్నేహంగా మారింది.  ఎంజీ రామచంద్రన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమయంలోనే తనపై పార్టీ వ్యతిరేకుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నుంచి శశికళ స్నేహం జయను సేదతీర్చిందని అంటారు.

స్త్రీకి స్త్రీగా ఆలంబన
ఎంజీఆర్‌ మరణం జయకు గడ్డు పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఆ కష్టకాలంలో శశికళ జయకు ఆలంబనగా నిలిచారు. ఎంజీఆర్‌ సతీమణి జానకీ రామ చంద్రన్‌ ప్రవేశంతో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయి ఎన్నికల పోరాటానికి దిగినప్పుడు శశికళ ఆమెకు అండగా ఉన్నారు. జయ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినపుడు డీఎంకే సభ్యుల నుండి భౌతికదాడులకు, చీరలాగడం వంటి అవమానాలకు గురైన సమయంలో కూడా శశికళే జయకు ఓదార్పు. ఆ తరువాత జయలలిత నివాసమైన పోయెస్‌ గార్డెన్‌లోనే శశికళ కూడా ఉంటూ ఆమె అంతరంగికురాలిగా మారిపోయారు.

బంధువుల కేంద్ర బిందువు
1991 అసెంబ్లీ ఎన్నికల్లో జయ పార్టీ అధికారంలోకి వచ్చింది. తొలిసారిగా జయ ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే సమయంలో శశికళ బంధువులూ జయకు చేరువయ్యారు. శశికళ అన్న కుమారుడు సుధాకరన్‌ను జయ దత్తత తీసుకున్నారు. శశికళ మరో సోదరుడు జయరామన్‌ హైదరాబాద్‌లోని జయకు చెందిన తోటకు మేనేజర్‌ అయ్యాడు. తర్వాత ఆ తోటలో జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో జయరామన్‌ మృతి చెందడంతో, ఆయన భార్య ఇళవరసి తన చంటి బిడ్డతో పోయెస్‌ గార్డెన్‌కు మకాం మార్చారు. అలా శశికళ వల్ల ‘జయ కుటుంబం’ పెద్దదయింది!

బంధుగణంతో చిక్కులు, చికాకులు
ఒకవైపు జయ నీడలా శశికళ ఉన్నా, ఆమె బంధువులను మాత్రం జయ ఉపేక్షించలేదు. వారిపై క్రమశిక్షణ చర్యలను తీసుకున్నారు. ముందుగా శశికళ భర్త నటరాజన్‌ను పక్కన పెట్టేశారు. ఆయనపై అనేక కేసులు బనాయించి అరెస్ట్‌ చేయించారు. అప్పుడు కూడా మనసా వాచా జయతోనే ఉండిపోయారు శశికళ. పార్టీ కోశాధికారి, ఎంపీ అయిన దినకరన్‌ను పార్టీ నుండి జయ బహిష్కరించారు. దత్తపుత్రుడు సుధాకరన్‌పై కూడా గంజాయి కేసు పడింది. అలా ఒకరొకరుగా శశికళ బంధువులంతా పోయస్‌గార్డెన్‌ నుండి దాదాపుగా బయటికి వెళ్లిపోవలసి వచ్చింది. భర్త సహా బంధువులంతా జయ చేత తిరస్కారానికి గురైనా శశికళ మాత్రం ఆమెతోనే ఉండిపోయారు.



తోడబుట్టని సోదరి.. శశి
జయ ఆడంబర జీవితంలోనే కాదు అష్టకష్టాల్లోనూ శశికళ ఆమెకు భరోసాగా నిలిచారు. జయ రాజకీయ జీవితంలో 1996 తీవ్ర ఆవేదన కలిగించిన ఏడాదిగా నిలిచింది. దత్త పుత్రుడు సుధాకరన్‌కు అత్యంత ఆడంబరంగా చేసిన వివాహం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు జయ ప్రభుత్వాన్ని కుదిపివేసింది. జయ అరెస్టు అయ్యారు. ఆమెతో పాటూ శశికళ కూడా అరెస్టయ్యారు. జయపై డీఎంకే పెట్టిన ప్రతికేసులోనూ శశికళ కూడా నిందితురాలిగా ఉన్నారు. జయ పతనానికి శశికళనే కారణమనే ప్రచారం కూడా జరిగింది. అప్పుడే తొలిసారి జయ బహిరంగంగా శశికళ గురించి మాట్లాడారు. ‘శశికళ నాకు తోడబుట్టని సోదరి, అంతేగాక ఆమె నాతోనే ఉంటారు, ఆమె గురించి ఎలాంటి ప్రశ్నలు అవసరం లేదు’ అని ప్రకటించారు.

అమ్మంతటి అమ్మ చిన్నమ్మ
శశికళను జయలలిత ఇలా సమర్థించడంతో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ శశికళ ప్రాధాన్యం పెరిగింది. జయను అమ్మ అంటుండే పార్టీ శ్రేణులు శశికళను చిన్నమ్మ అని సంబోధించడం ప్రారంభించాయి. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా కేసుల కారణంగా జయ సీఎం కాలేక పోయారు. అప్పుడు పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలన్న సలహా శశికళదే. అంతేకాదు, మంత్రి వర్గాన్ని కూడా ఆమే నిర్ణయించారు. అమ్మకు జరిగే అన్ని మర్యాదలు చిన్నమ్మకు కూడా జరగడం 2001 నుంచే మొదలైంది.

అన్నీ ఓర్చుకుని... అమ్మ వెంటే...
2011లో జయ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు శశికళ కుటుంబ సభ్యుల రాకపోకలు మొదలయ్యాయి. దీంతో జయలలిత శశికళను కూడా పోయెస్‌ గార్డెన్‌ నుండి బైటకు పంపివేశారు. శశికళ కుటుంబానికి చెందిన రావణన్, కలియపెరుమాళ్, మిడాస్‌ మోహన్‌లపై కేసులు పెట్టించారు. శశికళతో గానీ ఆమె కుటుంబ సభ్యులతో గానీ ఎవరూ ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ఈ సందర్భంలో కూడా జయపై శశికళ ఎలాంటి ప్రతిఘటన ధోరణిని ప్రదర్శించలేదు. తన వారినీ ప్రదర్శించనీయలేదు.  బహిరంగ సభల్లో విమర్శలు చేయలేదు. ఇతర పార్టీ నేతలతో కూడా సంబంధాలు పెట్టుకోలేదు. అందుకేనేమో... శశికళను విడిచి జయలలిత ఎక్కువకాలం  ఉండలేకపోయారు. శశికళ మళ్లీ పోయెస్‌ గార్డెన్‌కు పిలిపించుకున్నారు. ‘నన్ను చూసుకోవడం శశికళ వల్లనే సాధ్యం, ఆమె లేకుండా నేను ఒంటరిగా ఉండలేను’ అని బహిరంగంగానే చెప్పుకున్నారు. ఈ బాంధవ్యమే.. కడవరకూ జయతోనే ఉండే భాగ్యాన్ని శశికళకు కల్పించింది.
– కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement