పుట్టిన వెంటనే తల్లి స్తన్యం అందిన బిడ్డ అదృష్టవంతుడు. కాని ఆ అదృష్టం అందరు పిల్లలకూ దక్కదు. కాన్పు సమయంలో కాంప్లికేషన్స్ వల్ల తల్లి నుంచి వేరైన బిడ్డలకు పాలు ఎవరు పడతారు? చెన్నైలోని ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్’ ఒక పరిష్కారం. లాక్‌డౌన్ సమయంలో ఈ బ్యాంక్‌కు నిరంతరం పాలు అందేలా సేకరించిన విద్యార్థులు ఇప్పుడు ప్రశంసలు పొందుతున్నారు.
బ్లడ్ బ్యాంక్ అవసరం అందరికీ తెలుసు. కాని తల్లి పాల బ్యాంక్ అవసరాన్ని తమిళనాడులో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా జయలలిత గుర్తించారు. కాన్పు సమయంలో తల్లికి లేదా బిడ్డకు కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వారు విడివిడి గా చికిత్స పొందుతూ ఉంటే అలాంటి పిల్లలకు తల్లిపాలు కావాల్సి వస్తుంది. తల్లిపాలు రాని పిల్లలకు తల్లి పాలు కావాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు తల్లి కాన్పు సమయంలో చనిపోతే తల్లిపాలు కావాల్సి వస్తుంది. హెచ్‌ఐవి కేసుల్లో తల్లి నుంచి కాక ఇతరుల నుంచి తల్లిపాలు బిడ్డకు కావాల్సి వస్తుంది. వీరందరి కోసమని చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రి ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్’ లో, విజయ హాస్పిటల్‌లో ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్’ మొదలయ్యాయి.
ఎలా సేకరిస్తారు?
ఈ బ్యాంకులకు పాలను ఇవ్వడానికి తల్లులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. వారి ఆరోగ్యాన్ని వారి నుంచి వచ్చిన పాలను పరీక్షించి, అనుమతి ఇచ్చాక వీరు రెగ్యులర్‌గా తాము ఇవ్వగలిగినంత కాలం పాలను డొనేట్ చేయవచ్చు. నేరుగా హాస్పిటల్‌కు వచ్చి ఇవ్వొచ్చు. లేదా సేకరించుకునే వ్యవస్థ కూడా ఉంటుంది. అలా తెచ్చిన పాలను శాస్త్రీయ పద్ధతులలో తగిన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసి అవసరమైన పిల్లలకు అందిస్తారు.
లాక్‌డౌన్‌లో ఏమైంది?
లాక్‌డౌన్ దేశాన్ని స్తంభింప చేసినట్టే ఈ తల్లిపాల వ్యవస్థను కూడా స్తంభింప చేసింది. చెన్నైలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ౖచెల్డ్‌హెల్త్‌లో రోజూ యాభై అరవై మంది పసి కూనలు నియోనేటల్ విభాగంలో చికిత్స కోసం అడ్మిట్ అవుతారు. వీరి తల్లులు వేరే క్కడో ఉంటారు. వీరిలో కనీసం పది మందికి తల్లిపాల బ్యాంక్ నుంచి పాలు కావాల్సి వస్తుంది. రోజులో ఒకసారికి ఒక బిడ్డకు 100 ఎమ్.ఎల్ పాలు కావాలి. ఈ పాలు డోనర్స్ నుంచి అందకపోతే పిల్లలు పస్తులు ఉండాల్సి వస్తుంది. లేదా పౌడర్‌పాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. లాక్‌డౌన్ సమయంలో రాకపోకలు అన్నీ ఆగిపోయిన వేళ కొంతమంది కాలేజీ విద్యార్థులు ఈ పాల సేకరణకు ముందుకు వచ్చారు. ఏ బ్యాంక్ అయినా ఖాళీగా ఉండొచ్చు కాని తల్లిపాల బ్యాంకు ఖాళీగా ఉండరాదని చేతులు చేతులు కలిపి కదిలారు.
100 లీటర్ల పాలు
లాక్‌డౌన్ వల్ల తల్లిపాల బ్యాంకులో పాలు నిండుకునే పరిస్థితి ఉంది అనగానే కొందరు విద్యార్థులు రంగంలోకి దిగారు. డోనర్ల లిస్టు తీసుకుని తామే వాళ్ల ఇళ్లకు వెళ్లి పాలు సేకరించి హాస్పిటల్‌కు అందజేసే పని మొదలెట్టారు. అయితే ఇది అంత సులువు కాదు. చెన్నైలో రోడ్లన్నీ మూసేశారు. పోలీసుల అడ్డంకులు. ఇళ్లల్లో తల్లిదండ్రుల గద్దింపులు. కాని విద్యార్థులు వెనుకంజ వేయలేదు. తగిన పర్మిషన్లతో రోడ్ల మీద దూసుకువెళుతూ పాలు నిరంతరం అందేలా చేశారు. ‘నేను ప్రతిసారి మా అమ్మకు ఏదో ఒక అబద్ధం చెప్పాను’ అని ఒక విద్యార్థి చెప్తే ‘మా అమ్మకు చెప్పి చెప్పి చివరకు ఒప్పించాను. అందరూ ఇళ్లల్లో కూచుంటే సహాయం పొందాల్సిన వారు ఎలా పొందుతారు అని ఆమెకు చెప్పాను’ అని మరొక విద్యార్థి అన్నాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ విద్యార్థులు గత నాలుగు నెలల్లో 100 లీటర్ల తల్లిపాలు హాస్పిటల్‌కు అందేలా చేశారు.
ప్రశంసలు
లాక్‌డౌన్ సమయంలో నీళ్లకే కటకటలాడే పరిస్థితి ఉన్నప్పుడు చెన్నైల్లో పసికూనలు కడుపునిండుగా తల్లిపాలు తాగి కోలుకునేలా చేసిన ఈ విద్యార్థులకు ప్రశంసలు దక్కుతున్నాయి. కొంతమంది కుర్రవాళ్లు ముందుతరం దూతలు అని కవి అన్నది ఇలాంటి వారి గురించే కాబోలు. – సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment