తల్లిపాలలో లెక్కకు మించి పోషకాలు | Special Story About Importance Of Breastfeeding For Children | Sakshi
Sakshi News home page

ఎంతో మేలు తల్లిపాలు!

Published Fri, Aug 7 2020 12:15 AM | Last Updated on Fri, Aug 7 2020 4:20 AM

Special Story About Importance Of Breastfeeding For Children - Sakshi

తల్లిపాలు అంటే ఈ లోకంలోకి అప్పుడే వచ్చిన చిన్నారికి అమ్మ పెట్టే మొట్టమొదటి పాలబువ్వ! తల్లి ఇచ్చే ఈ మొదటి ఆహారం ఎంత బలమంటే... ఆనాడు మొదలుకొని బిడ్డ ఎదిగి, వృద్ధాప్యంలోకి వచ్చి...తన చివరి రోజులు గడిపేవరకూ ఎన్నో వ్యాధుల్నీ, మరెన్నో రుగ్మతలనీ తట్టుకునేలా ఆ పాలు పడుతుంది అమ్మ. ఆ బువ్వ పెడుతుంది తల్లి. అందులోని ఎన్నో రకాలు పోషకాలు బిడ్డ పెరుగుదలకు దోహదపడేలా ఉంటాయి.

కేవలం శారీరకంగా ఎదుగుదలకే కాదు... బిడ్డ మానసిక వికాసానికీ తోడ్పడతాయి. ప్రతి ఏడాదీ ఆగష్టు 1 నుంచి 7 వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల రూపంలో నిర్వహితమవుతాయి. ఈ ఏడాది థీమ్‌ ‘‘ఈ భూగోళాన్ని ఆరోగ్యవంతం చేయడం కోసం బిడ్డకు చనుబాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించండి’’. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే...‘‘సపోర్ట్‌ బ్రెస్ట్‌ఫీడింగ్‌ ఫర్‌ ఏ హెల్దియర్‌ ప్లానెట్‌’’. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వాటి విశిష్టత, ప్రాధాన్యంపై అవగాహన కలిగించేందుకే ఈ కథనం. 

తల్లిపాలలో లెక్కకు మించి పోషకాలు ఉంటాయి. మన అధ్యయనానికి అందేవి కేవలం 400 రకాల పోషకాలే. వాటని కృత్రిమంగా తయారు చేద్దామన్నా సాధ్యం కానంతటి అద్భుత పోషకాలవి. తల్లిపాల విశిష్టతను చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ ఏమిటంటే... వాటికి ప్రత్యామ్నాయంగా రకరకాలైన ఫార్మూలా ఫీడ్స్‌ అందుబాటులో ఉన్నా,  అవేవీ తల్లిపాలకు సాటిరావు. కృత్రిమంగా తయారు చేద్దామన్నా... దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాధ్యంకాలేదంటే తల్లిపాల గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. 

బిడ్డ పుట్టగానే ఊరే పాలు... ముర్రుపాలు!
బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో ఊరే ముర్రుపాలను కొలెస్ట్రమ్‌ అంటారు. మొదట ఊరిన పాలు (ముర్రుపాలు) పట్టించాల్సిందేనని కొందరు, అవి బిడ్డకు మంచిది కాదని మరికొందరు అంటుంటారు. ఇలాంటి సందేహాలు కొత్తగా తల్లి అయినవారిని అయోమయంలో పడేస్తాయి. కానీ బిడ్డకు ముర్రుపాలు తప్పక తాగించాలి. వీటిలో చాలా శక్తిమంతమైన యాంటీబాడీస్‌ ఉంటాయి. అవి బిడ్డలోని రోగనిరోధకశక్తిని స్వాభావికంగా పెంచుతాయి. ఆ నేచురల్‌ ఇమ్యూనిటీ... తన జీవిత కాలంలో బిడ్డ ఎన్నో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని సమకూర్చుకుంటుంది. అంతేకాదు... పిల్లాడి వయసు పెరిగాక కనిపించే ఎన్నో జబ్బులు, డీ జనరేటివ్‌ డిసీజెస్‌ వంటివి ఈ ముర్రుపాల కారణంగా రాకపోవచ్చు లేదా ఆలస్యం కావచ్చు. అందుకే బిడ్డకు ముర్రుపాలు తప్పక పట్టించాలి. 

ముర్రుపాలు ముగిశాక చనుబాలు...
ముర్రుపాల తర్వాత పసిపిల్లలకు సాధ్యమైనంతవరకు తల్లిపాలే ఇవ్వాలి. కేవలం తల్లికి తగినన్ని పాలు పడనప్పుడు మాత్రమే పోతపాలకు వెళ్లాలి తప్ప... తల్లి దగ్గర పాలు ఉంటే మాత్రం  పిల్లలకు తల్లిపాలు తాగించడం మంచిది.

ఏయే మోతాదుల్లో తల్లిపాలు? 
చనుబాలు తీసుకోవడంలో పిల్లలు తీసుకునే పరిణామం వేర్వేరుగా ఉంటుంది. వారి వయసు (రోజులు, వారాలు, నెలలు)ను బట్టి ఆ తేడాలు ఉంటాయి. ఉదాహరణకు బిడ్డ పుట్టిన మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకు ఆ చిన్నారి కడుపు ఒక చెర్రీ పండంత ఉంటుంది. అప్పుడా చిన్నారికి ప్రతి రెండు గంటలకోమారు 30 మి.లీ. పాలు అవసరమవుతాయి. ఇలా 24 గంటల వ్యవధిలో 12 సార్లు పాలు పట్టడం అవసరం. అలాగే వారం రోజుల వయసు గడిచిన బేబీ కడుపు చిన్న ‘ఏప్రికాట్‌’ పండంత సైజు ఉంటుంది. తనకు ప్రతి రెండు గంటలకు ఓసారి 45 నుంచి 60 మి.లీ. చనుబాలు అవసరం.

అలాగే ఒక నెల వయసు ఉన్న పాప కడుపు పరిమాణం పెద్ద కోడిగుడ్డు అంత ఉంటుంది. ఆ వయసు పిల్లలకు ప్రతి రెండు గంటలకు ఓసారి 60 మి.లీ నుంచి 150 మి.లీ వరకు అవసరం. ఇక ఇలా పాలు తాగుతున్న చంటిపిల్లలు రోజులో ఆరుసార్లు మూత్ర విసర్జన చేస్తుంటే... ఆ పిల్లలకు చనుబాలు సరిపోతున్నాయని అర్థం. ఇక పిల్లలకు పాలు పట్టగానే వెంటనే పడుకోబెట్టకుండా భుజం మీద వారిని వేసుకుని వారి వీపు మీద చిన్నగా తట్టాలి. దాంతో వారు మెల్లగా తేన్చడం వల్ల కడుపులోని గాలి బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల వాళ్లకు చంటిపిల్లల్లో వచ్చే కడుపునొప్పి (కోలికీ పెయిన్‌) వంటివి రావు. దాంతో హాయిగా నిద్రపోతారు. 

ప్రిమెచ్యుర్‌ బేబీస్‌లో తల్లిపాల మేలు
తల్లిగర్భంలో పూర్తి వ్యవధి పాటు లేకుండా త్వరగా పుట్టేసే (ప్రిమెచ్యుర్‌ బేబీస్‌) పిల్లల్లో గుండె గదులు (ఛేంబర్లు) ఒకింత చిన్నవిగా ఉంటాయి. అందువల్ల ఆ పిల్లలు పెద్దయ్యాక గుండెపోటుకు గురయ్యే అవకాశాలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయట. ఇలాంటి పిల్లలకు వీలైనంతవరకు రొమ్ముపాలే పట్టించడం వల్ల వారికి అవసరమైన హార్మోన్లు, గ్రోత్‌ఫ్యాక్టర్లు వంటివి సమకూరుతాయి. ఆ పరిశోధనల ప్రకారం... ఇలా పుట్టేవారిలో గుండెజబ్బులు (కార్డియో వాస్క్యులార్‌ సమస్యలు) ఒకింత ఎక్కువ. వారి గుండెగదులు  ఒకింత చిన్నవిగా ఉండటంతో తోటిపిల్లలతో పోల్చినప్పుడు వారి రక్తపోటు కూడా ఎక్కువే.

ఈ అంశాలన్నీ వారిని గుండెజబ్బులకు గురయ్యేలా చేస్తుంటాయి. అయితే ఇలాంటి పిల్లలను పూర్తిగా రొమ్ముపాలపైనే పెరిగేలా చేయడం వల్ల గుండెజబ్బు లు వచ్చే అవకాశాలు తక్కువని ఈ అధ్యయన పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్‌ ఆఫిఫ్‌ ఎల్‌ ఖుఫాష్‌ అనే ఐర్లాండ్‌లోని ‘రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌’ చెందిన పీడియాట్రిషియన్‌ పేర్కొంటున్నారు. ఈ అంతర్జాతీయ పరిశోధనల్లో యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకులు కూడా ఉన్నారు.

తల్లిపాలపై పెరిగే పిల్లలు చాలా తక్కువగా జబ్బు పడతారు. దాంతో వారి వైద్య అవసరాల కోసం, వారి  రక్షణ (కేర్‌) కోసం, వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సిన డబ్బు చాలా తక్కువ. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి పాలు పట్టడం చాలా అవసరమని మనలోని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

బిడ్డకు చనుబాలు పట్టే తల్లుల్లో గర్భసంచి, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ల ముప్పు తప్పుతుందని అంటున్నారు బ్రిస్బెన్‌ (ఆస్ట్రేలియా)లోని క్యూఐఎమ్‌ఆర్‌ బెర్ఘోఫెర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు. బాగా అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకునే యునైటెడ్‌ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి చోట్ల కూడా ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ ముప్పు చాలా ఎక్కువ. చనుబాలు పట్టించడం అన్న ఒకే ఒక్క ఆరోగ్యకరమైన, స్వాభావికమైన అలవాటుతోనే ఈ క్యాన్సర్‌ వచ్చే ముప్పు 11 శాతం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

తల్లిపాలలోని ప్రధానమైన అంశాలు
► నీరు: పాలలో ఎక్కువ భాగం నీరు ఉంటుంది. 
► ప్రోటీన్లు: పాలలో 75% వరకు ప్రోటీన్లు ఉంటాయి. 
► కొవ్వులు: శరీరానికి అవసరమైన ఎసెన్షియల్‌ ఫాటీ యాసిడ్స్‌తోపాటు... లాంగ్‌ చైన్‌ పాలీ ఆన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌ అని పిలిచే పోషకాలూ ఇందులో ఉంటాయి. పాలు తాగే పసిపాప కూడా అరిగించుకోగల కొవ్వును అందించడం కోసమే ప్రకృతి అమ్మ పాలను తయారు చేసింది. ఇందులో డీహెచ్‌ఏ అనే కొవ్వు ఉంటుంది. డీహెచ్‌ఏ అంటే డొకోసా హెగ్జానోయిక్‌ యాసిడ్‌ అనే దానికి సంక్షిప్తరూపం. ఇదొక పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్‌. పిల్లల మెదడులో ఉండేవన్నీ కొవ్వు కణాలే. అందులోని ఒమెగా–3 ప్యాటీ ఆసిడ్స్‌లో 97 శాతం ఈ డీహెచ్‌ఏలే. కేవలం మెదడు మాత్రమే గాక పిల్లల రెటీనా కూడా ఫ్యాటీ యాసిడ్స్‌ అనే కొవ్వులతో నిర్మితమై ఉంటుంది. ఈ కొవ్వులలోనూ 93 శాతం ఈ డీహెచ్‌ఏ కొవ్వులే. ఇక తల్లిపాలలో మరో రకం కొవ్వులూ ఉంటాయి. అవి ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్‌కు చెందినవి. వీటిని ఏఆర్‌ఏ (ఆరాకిడోనిక్‌ యాసిడ్‌) అంటారు.

మెదడులో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌లోని 48 శాతాన్ని ఈ ఏఆర్‌ఏ సమకూర్చుతాయి. సాధారణంగా పిండం ఎదుగుదలకు అవసరమైన కొవ్వులన్నీ ప్లాసెంటా నుంచి అందుతుంటాయి. పిండం ఎదుగుతున్నప్పుడు మొదటి మూడు నెలలూ ఈ కొవ్వులు మరింత ఎక్కువగా అందాలి. అందుకే హెచ్‌డీఏ పోషకాలు బిడ్డకు అందేలా తల్లి తగినంత కొవ్వుల రిజర్వ్‌ ఉంచుకోవాలి. పైగా బిడ్డ కంటి చూపు బాగుండాలంటే కూడా ఇవే కొవ్వులు కావాలి. ఎందుకంటే రెటీనా కూడా కొవ్వులతోనే నిర్మితమవుతుంటుందని చదివాం కదా. ఇక బిడ్డ ఈ లోకంలోకి వచ్చాక  ఇవే కొవ్వులు రెండేళ్ల పాటు అందుతుండాలి. అప్పుడే బిడ్డ మెదడులో మంచి ఎదుగుదల ఉంటుంది. అందుకే అన్నిరకాల పోషకాలతో పాటు, ఈ కొవ్వులనూ (ఫ్యాటీ యాసిడ్స్‌ను) తల్లిపాలు సురక్షితంగా అందజేస్తుంటాయి. 

డీహెచ్‌ఏ ఇంకెన్ని రకాలుగా ఉపయోగం.. 
► కేవలం మెదడు ఎదుగుదలకూ, కంటి చూపు సునిశితత్వానికే కాకుండా ఈ కొవ్వులు చిన్ని గుండెకూ తగినంత బలాన్ని సమకూర్చుతాయి. 
► చిన్నిబిడ్డల మెదడు విషయానికి వస్తే దానిలోని ‘గ్రే–మ్యాటర్‌’ నిర్మాణానికి ఈ కొవ్వులే ఎక్కువగా ఉపకరిస్తాయి. తల్లిపాల మీద బిడ్డ ఎన్ని ఎక్కువ రోజులు పెరిగితే... భవిష్యత్తులో వాళ్ల కంటి చూపూ అంత ఎక్కువ కాలం పదిలంగా ఉంటుంది. బిడ్డకు పాలు పడుతున్నామంటే  భవిష్యత్తులో వాళ్లను గుండెజబ్బులనుంచి రక్షిస్తున్నామని అర్థం. వాళ్ల చూపును ఎక్కువకాలం పదిలంగా కాపాడుతున్నామని అర్థం. 
► పిండిపదార్థాలు: పాలలో పిండి పదార్థాలు ఉంటాయి. ల్యాక్టోజ్‌ అనేది తల్లిపాలలో ఉండే ప్రధాన కార్బోహైడ్రేట్‌. 
► ఇతర పోషకాలు : పైన పేర్కొన్న ప్రధాన అంశాలతో పాటు చాలా రకాల ఖనిజలవణాలు, విటమిన్లు, మ్యాక్రో, మైక్రో న్యూట్రియెంట్లు, చాలా అరుదుగా లభ్యమయ్యే కొన్ని విలువైన మూలకాలు కూడా ఉంటాయి. 

తల్లిపాలతో  బిడ్డకు కలిగే ప్రయోజనాలు
తల్లి పాలతో అటు బిడ్డకూ ఇటు తల్లికీ ఇలా ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుంది. బిడ్డకు ఎన్నో జబ్బులు రావు లేదా డయాబెటిస్‌ వంటి కొన్ని భవిష్యత్తులో రావాల్సిన జబ్బులు చాలా ఆలస్యమవుతాయి. ఇక తల్లి పాలు తాగే పిల్లలతో పోలిస్తే, తల్లి పాలపై లేని పిల్లల్లో చాలా రకాల జబ్బులు కనిపిస్తాయి. అవి... 
► జీర్ణకోశ సమస్యలు: తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి. 
► ఆస్తమా : పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. 
► తల్లిపాలపై పెరిగే బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ. 
► తల్లిపాలపై పెరిగే పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. స్థూలకాయం పెద్దయ్యాక డయాబెటిస్‌ వంటి సమస్యలను... ఆ సమస్యలు మరెన్నో ఇతర రుగ్మతలను తెచ్చిపెడతాయన్న విషయం తెలిసిందే కదా. అలాంటి వాటిని నివారించాలంటే చిన్నప్పుడు తల్లిపాలు పట్టడం తప్పనిసరి. 
► తల్లిపాలపై పెరిగే పిల్లల్లో వారిలో కనిపించే (ఛైల్డ్‌హుడ్‌) క్యాన్సర్లు వచ్చే  అవకాశాలు చాలా తక్కువ. 
► నెక్రొటైజింగ్‌ ఎంటెరోకొలైటిస్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలూ తక్కువే. 

పాలిచ్చే తల్లులకు సూచనలు
► ప్రస్తుతం కరోనా వైరస్‌తో కోవిడ్‌–19 వస్తున్న రోజుల్లో సైతం బిడ్డకు చనుబాలు పట్టడం చాలా ఉత్తమం. చనుబాలు ఇవ్వకపోతే వైరస్‌ను నివారించే అవకాశాలతో పోలిస్తే బిడ్డకు చనుబాలు లేకపోవడం వల్ల కలిగే నష్టమే ఎక్కువ కాబట్టి తప్పక పాలు పట్టాల్సిందే. 
► తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్‌), పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్‌)  కూడా తరచూ మారుతూ, కొత్త రుచి వస్తుంటుంది. అప్పుడు బిడ్డ మరింతగా ఆ రుచిని ఆస్వాదిస్తూ తల్లిపాలను ఇష్టంగా తాగుతుంటాడు. 
► పాలిచ్చే తల్లి ఎక్కువగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువ తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ ఆమెను తక్కువ నీళ్లు తాగేలా ఆంక్షలు పెడుతుంటారు. తల్లి ఎక్కువ నీళ్లు తాగితే బిడ్డకు జలుబు చేస్తుందనడం అపోహ మాత్రమే. 
► తల్లి పాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్‌ ఎక్కువగా ఉండటానికి బీన్స్, వేరుశెనగ పల్లీలు, అలసందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని విటమిన్‌–సితో ఇచ్చే పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది. అంటే నిమ్మజాతిపండ్లు, స్ట్రాబెర్రీస్‌ వంటివి. అలాగే ఆమె ఆహారంలో మెంతికూర వంటివి తీసుకోవడం కూడా పాలు పుష్కలంగా పడేలా చేస్తుంది. 
► తల్లి పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్‌ వంటివి తీసుకోవాలి. 
► క్యాల్షియమ్‌ బాగా అందేలా ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. 
► విటమిన్‌ బి12తో పాటు విటమిన్‌ డి పుష్కలంగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పాదనలతోపాటు మాంసాహారం తీసుకోవాలి. అవి తీసుకోని వారు డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే విటమిన్‌ బి12, విటమిన్‌–డి సప్లిమెంట్స్‌ తీసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement