కరోనా రాగానే ప్రజలంతా ఏకతాటి మీదకు వస్తున్నారు. కులమతాలకు అతీతంగా మానవులందరం ఒకటే అంటున్నారు. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ ఐకమత్యం అవసరం. పాతకక్షలను, పాత భావోద్వేగాలను పక్కకు నెట్టి, ‘మనమంతా మానవులం’ అనే స్ఫూర్తితో కలసికట్టుగా పనిచేస్తూ, ఈ మహమ్మారి మీద పోరాటం సాగించాలి. ఈ స్ఫూర్తితో పనిచేస్తున్నారు కేప్‌టౌన్‌కు చెందిన ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లు. చేయి చేయి కలిసింది..
పాత కక్షలను పక్కకు తోసి, చేయిచేయి కలిపి, ఆకలితో అలమటిస్తున్నవారి కోసం ఆహారం పొట్లాలు పంచుతున్నారు ఈ గ్యాంగ్‌లీడర్లు. ‘ఇది నమ్మశక్యం కాని నిజం. రెండు గ్యాంగుల నడుమ శాంతియుత వాతావరణం అంటే కేవలం కాల్పుల నిషేధమే కాదు. ఆపదలో ఉన్నవారికి మేమున్నామన్న భరోసా కల్పించటం అని చూపుతున్నారు వీరు’ అంటున్నారు ఆండీ అనే కేకుల వ్యాపారి. కేప్‌టౌన్‌లో గ్యాంగ్‌ల మధ్య హింస సర్వసాధారణం. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. ఇటువంటి విపత్కర సమయంలో అనూహ్యమైన తాత్కాలిక సంధి చేసుకున్నారు రెండు గ్యాంగ్‌లకు చెందిన నాయకులు.
ఆకలిగా ఉంది..
లాక్‌డౌన్ ప్రకటించగానే గ్యాంగ్ లీడర్‌కు ఒక ఫోన్ వచ్చింది. ‘మేం నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదన్నా. ఇప్పుడు మేమంతా ఆకలితో అలమటిస్తున్నాం. మిమ్మల్నే నమ్ముకుని ఉన్న మా ఆకలి తీర్చండి’ అని బాధగా అర్థించింది ఆ గొంతు. ఆ గొంతు మా గ్యాంగ్ సభ్యుడిది. పనులు లేకపోవటంతో వీరంతా ఆకలితో అలమటిస్తున్నారని అర్థమైంది. వారిని ఆదుకోవటం నా కర్తవ్యంగా భావించాను’ అన్నాడు ఆ కరడు కట్టిన గ్యాంగ్‌స్టర్.
మానవత్వం..
ఆండీ అనే బేకరీ నిర్వాహకుడు ఈ గ్యాంగ్ సభ్యులతో కలిసి పనిచేస్తున్నాడు. వారికి కావలసిన పేస్ట్రీలను సరఫరా చేస్తుండేవాడు. ఆండీ కారణంగానే ప్రత్యర్థులైన గ్యాంగ్‌స్టర్‌ల చేతులు కలిసాయి.
ఆనందం..
కేప్‌టౌన్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలకు అక్కడి ప్రజలు సంతోషపడుతున్నారు. ఇటువంటి మంచి ఆలోచన వారికి ఎప్పుడూ వచ్చి ఉండదు. నిజమే. వాళ్లు వారి అనుచరు లను రక్షించుకోవటానికి చేతులు కలిపి మంచి పనులు చేయటం ఆహ్వానించాల్సిందే. ‘‘ఈ రోజు నేను నిజంగానే చచ్చి స్వర్గానికి వెళితే, సంతోషంగా చనిపోయానని భావిస్తాను. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను’’ అంటున్నారు నగర పౌరుడు ఒకరు.
స్వాగతించాలి..
అప్పటిదాకా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించడానికి విచక్షణారహితంగా కాల్చుకున్న ఈ గ్యాంగులు, ఆకస్మికంగా తమ వైఖరిని మార్చుకున్నాయని తెలిసి, ఆశ్చర్యానికి గురవుతున్నారు మేయరల్ కమిటీ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అధికారి జె. పి. స్మిత్. ఒక కమ్యూనిటీపై అంతకంతకు కక్షను పెంచుకుంటున్న వీరు చేస్తున్న పనులు చూసి అందరం వారిని స్వాగతించాల్సిందే. ‘దశాబ్దాలుగా వారు చేసిన అకృత్యాలు నా మనసు నుంచి చెరిగిపోవటం లేదు. ఆ కాలంలో కొంతమందిని బందీలుగా ఉంచి ఎంతో హింసించారు. ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో చేస్తున్న సహాయాలను మాత్రం గుర్తించాల్సిందే’ అంటున్నారు గతంలో ఒక గ్యాంగ్ లీడర్‌గా ఉన్న రాషద్ విలియమ్స్. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో గ్యాంగులకు పనిలేదు, గుర్తింపు లేదు. అందరం కలిసి పనిచేయాల్సిన తరుణం ఇది అంటున్నారు బ్రిటజ్ మలన్ అనే మహిళ. ‘ప్రస్తుతం మేమంతా ఒకరిపై ఒకరు ఆధారపడి, పరస్పరం సాయం చేసుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి శాంతి నెలకొంది. కరోనా వైరస్ అంతమైన తరవాత గ్యాంగ్‌వార్ మళ్లీ ప్రారంభం కావచ్చేమో’ అంటున్నారు యాష్లే అనే గ్యాంగ్ సభ్యుడు. ప్రస్తుతమైతే ఈ గ్యాంగు సభ్యులు కూడా మానవత్వం చాటుతున్నారు. వారిని తాత్కాలికంగానైనా అభినందించాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment