భర్త అక్షయ్, కుమారుడు ఆరవ్‌తో ట్వింకిల్ ఖన్నా
లాక్‌డౌన్ సమయంలో ఇళ్లల్లో ఉండి గమనిస్తున్న మగవాళ్లకు ఇంటి పని ఎంత ఉంటుందో ఈ సరికే అర్థమై ఉంటుంది. గృహిణిగా ఇంట్లో ఉండే స్త్రీ విరామంతో ఉండలేదని ఆమెకు నిరంతరం పని ఉంటుందని అర్థం చేసుకుని ఉంటారు. అయినా సరే ఆ పనిని షేర్ చేసుకోవడానికి చాలామంది ముందుకు రారు. మరీ ముఖ్యంగా అది ‘స్త్రీల పని’ అని అనుకుంటూ ఉంటారు. ఇది పురుష భావజాలపు అవశేషం. ‘ఇలా అనుకోవడం తప్పు’ అంటోంది ట్వింకిల్ ఖన్నా.
తాజాగా ఆమె లాక్‌డౌన్ కాలంలో గృహజీవనం గురించి ఏ.ఎన్.ఐకి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ‘ఇంటి పనికి స్త్రీ, పురుష అనే భేదం లేదు. ఇంటి పనికి జెండర్‌ను ఆపాదించి ఫలానా పని స్త్రీది ఫలానా పని పురుషుడిది అని నిర్థారించడం తప్పు. ఎవరు ఏ పని చేయగలరో ఎవరికి ఏ పని చేతనవునో దానిని పంచుకోవాలి. అదే గృహశాంతిని ఇస్తుంది. పంతాలకు పట్టింపులకు పోతే చికాకులు పెరుగుతాయి. నాకు వంట రానేరాదు. నా పరిమితి అది. నన్ను బలవంతంగా వంటగదిలో పడేస్తే నేను చాలా ఉత్పాతాలు సృష్టిస్తాను. కాని నా భర్తకు వంట వచ్చు. ఆశ్చర్యకరంగా నా కుమారుడు ఆరవ్‌కు కూడా వంట అంటే ఆసక్తి ఉంది. వారిద్దరూ కలిసి రోజూ వంట ఎంజాయ్ చేస్తూ చేస్తారు.
ఆరవ్ అన్ని పదార్థాలను వండ గలడని నేను కలలో కూడా ఊహించలేదు. వాళ్లిద్దరూ బాగా వంట చేస్తారు. నేను ఇంట్లో ఏమేమి కావాలో అవి తెప్పించడం, అంట్లు కడగడం చేస్తున్నాను’ అందామె. ఒకప్పటి నటి, ఇప్పటి రచయిత్రి, సోషల్ కామెంటేటర్ అయిన ట్వింకిల్ ఖన్నా ఏరియల్ వారి ‘షేర్ ది లోడ్’ కాంపెయిన్‌కు ప్రచార కర్తగా ఉంది. ‘నేను నా కూతురి ఆన్‌లైన్ క్లాసుల గురించి శ్రద్ధ పెడతాను. ఇంకా ఇల్లు నడవడానికి అవసరమైనవన్నీ గమనించుకుంటాను. ఇవీ పనులే. భార్యాభర్తలు గమనించుకుంటే ఇంటి పని గుదిబండగా మారబోదు’ అంటోంది ట్వింకిల్.
Comments
Please login to add a commentAdd a comment