చెన్నై, తాంబరంలో కొత్తగా ఏర్పాటైన బస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి జయలలిత బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు
టీనగర్, న్యూస్‌లైన్: చెన్నై, తాంబరంలో కొత్తగా ఏర్పాటైన బస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి జయలలిత బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ బస్టేషన్ రూ.4 కోట్ల 95 లక్షలతో నిర్మింతమైంది. అదే విధంగా కోయంబత్తూరు తమిళనాడు నగర శిక్షణ కేంద్రంలో రూ.75 లక్షలతో అదనపు వసతి గృహాలు, నాగపట్టణం జిల్లా నాగపట్టణం మునిసిపాలిటీలో రూ.కోటి 15 లక్షలతో ఏర్పాటైన కొత్త కార్యాలయ భవనం, తేని మావట్టం చిన్నమనూరు మునిసిపాలిటీలో రూ.కోటితో ఏర్పాటైన వారపు సంత భవనాన్ని చెన్నై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు.
భూగర్భ డ్రైనేజీ పథకం ప్రారంభం
పెరంబలూరు మునిసిపాలిటీలో 31 కోట్ల 91 లక్షలు, రామనాథపురం మునిసిపాలిటీలో రూ.31 కోట్ల 51 లక్షలు, తేని జిల్లా చిన్నమలూరు మునిసిపాలిటీలో రూ.14 కోట్ల 52 లక్షలు, దిండుగల్ మునిసిపాలిటీలో రూ.46 కోట్ల 15 లక్షలు, ధర్మపురి మునిసిపాలిటీలలో 24 కోట్ల ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ పథకాలను ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు.