అమ్మ విలువ... ఉన్నప్పుడు తెలియలేదు!
‘నీ నవ్వే చాలు చామంతీ, పూబంతీ...’ అని పాడాలనిపించే నవ్వు రోజాది. చామంతి సినిమాతో మొదలైన ఈ పూబంతి రీల్ సమరాన్ని, రియల్ సమరాలను ఎదుర్కొంటూ నగరి నియోజకవర్గానికి ఎంఎల్‌ఎ అయ్యారు. ఆమె తొలి సినిమా ప్రేమతపస్సు, తొలి ప్రసంగం తిరుపతిలో శంఖారావం సదస్సు. ఇక టీవీ షోల విషయానికి వస్తే జల్సా ప్రోగ్రామ్‌కి న్యాయనిర్ణేతగా, మోడరన్ మహాలక్ష్మి కార్యక్రమంతో యాంకర్‌గా పరిచయం అయ్యారు. ఆమెకు మంచి పేరు తెచ్చిన టీవీ షో జబర్దస్త్. సినిమాల్లో రోజా, రాజకీయాల్లో రోజా సెల్వమణిగా మారిన శ్రీలత అంతర్వీక్షణం ఇది.
మీరు ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు?
నవంబర్ 16వ తేదీ, కడపలో పుట్టా. సొంత ఊరు తిరుపతి దగ్గర చింతపర్తి.
మీలో మీకు నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం...
నచ్చే లక్షణం... ఎంత పెద్ద టెన్షన్ అయినా త్వరగా ఓవర్‌కమ్ కాగలగడం. నచ్చని లక్షణం... అందర్నీ నమ్మడం.
ఎదుటి వారి నుంచి ఏమాశిస్తారు ?
నిజాయితీని ఆశిస్తా. ముందు ఒకమాట వెనుక మాట లేని కచ్చితత్వాన్ని కోరుకుంటా.
ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు ?
నేనంటే ఇష్టపడే వారిని.
మిమ్మల్ని ఎలా గుర్తు పెట్టుకోవడం ఇష్టం ? నటిగానా, రాజకీయ రంగంలో ధీర వనితగానా...
రెండూనూ.
మనీ మేనేజ్‌మెంట్‌లో మీరు నిష్ణాతులా ?
అవును, ఇంటి నిర్వహణ నేనే చూసుకుంటాను.
ఏ కోర్సు చదవాలనుకున్నారు?
ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్నాను. ఇంట్లో వాళ్లు డాక్టర్‌ని చేయాలని బైపిసిలో చేర్పించారు. తర్వాత హోమ్‌సైన్స్‌లో జాయిన్ అయ్యాను. సినిమాల్లోకి వచ్చాను.
ఎక్కడ స్థిరపడాలనుకున్నారు? ఎక్కడ స్థిరపడ్డారు ?
చెన్నైలో స్థిరపడాలనుకున్నాను. రాజకీయాలతో హైదరాబాద్‌కి వచ్చాను. కానీ ఎక్కడి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానో వారికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను.
మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఎవరు?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.
మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి?
వ్యక్తి కాదు, వ్యక్తులు. మా పెద్దన్నయ్య కుమారస్వామి రెడ్డి, భర్త సెల్వమణి.
మిమ్మల్ని కెరీర్ దిశగా ప్రభావితం చేసిన సందర్భం...
ఎంపి శివప్రసాద్ గారు 1998లో నాన్నగారిని అడిగి ప్రచారం కోసం నన్ను తీసుకెళ్లారు. అప్పుడాయన సత్యవేడు ఎంఎల్‌ఎగా గెలిచి మంత్రయ్యారు.
తొలి సంపాదన ఎప్పుడు?
1991లో. చామంతి సినిమాకి అడ్వాన్స్ ఐదు వేలిచ్చారు. చాలా గ్రేట్‌గా అనిపించింది.
అత్యంత సంతోషపడిన సందర్భం కూడా అదేనా?
అత్యంత సంతోషం అంటే... నా పేరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు, నా పేరు పక్కన ఎంఎల్‌ఎ అని వేసినప్పుడు.
మిమ్మల్ని అత్యంత బాధ పెట్టిన సందర్భాలు!
అమ్మాయి... అన్న తర్వాత అలాంటివి తప్పవు. ిసినీనటి అయినప్పుడు బంధువుల మాటలు నొప్పించాయి. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వాళ్లే నా ఓటమికి ప్రయత్నించడం. ఇవి మానసికంగా. భౌతికంగా అయితే ‘సమరం’ సినిమా షూటింగ్ సమయంలో కాలికి ఫ్రాక్చర్ అయినప్పుడు బాధపడ్డాను.
మీకు విచిత్రం అనిపించే విషయాలు?
సినిమాల్లో డబ్బు తీసుకుని నటిస్తాం. అప్పుడు ప్రజలకు చేసేదేమీ ఉండదు. కానీ బ్రహ్మరథం పడతారు. రాజకీయాల్లో వందమందిలో పదిమందికైనా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. చేతనైన మంచేదో చేద్దాం అని వస్తే... ఏం చేసినా విమర్శిస్తారు.
మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పుకోవాల్సి ఉందా
మమ్మీ ఉన్నప్పుడు ఆమె విలువ తెలియలేదు. అమ్మ ఏం చెప్పినా సీరియస్‌గా తీసుకోకుండా ఆమెను ఏడిపించేవాళ్లం. మా అమ్మ ఎప్పుడూ ‘నీకు పెళ్లయి కూతురు పుడితే నా విలువ తెలుస్తుంది’ అనేవారు. అమ్మ గుర్తొచ్చినప్పుడంతా ఆమె పట్ల మరింత అక్కర చూపి ఉంటే బావుండేదనిపిస్తుంటుంది.
సహాయం పొంది... ద్రోహం చేశారనే ఆరోపణ?
చాలామంది ఉన్నారు. అదీ బంధువుల్లోనే. సొంతవాళ్లే అలా చేస్తే బాధనిపిస్తుంది. డబ్బే పరమావధి కాదు. అలాంటిది వాళ్లు డబ్బే ప్రధానం అన్నట్లు ఉంటే కష్టంగా ఉంటుంది.
తల్లిగా రోజా గురించి ఒక్కమాటలో...
పిల్లలు మెచ్చుకునే విధంగా ఉన్నాను. షూటింగులు, మీటింగుల కారణంగా వాళ్లు నన్ను మిస్ కాకూడదని నా శక్తికి మించి ప్రయత్నిస్తున్నాను.
కుటుంబ జీవితంలో ఆనందపడిన క్షణాలు!
పాప (అన్షు మాలిక) పుట్టినప్పుడు...
సంతృప్తినిచ్చిన పాత్ర?
భైరవద్వీపంలో యువరాణి పాత్ర.
ఎప్పుడైనా అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చిందా?
అబద్ధం చెప్పాల్సి వస్తే నవ్వేసి సరిపెడతాను.
మీ నవ్వుతో అవతలి వాళ్లు అన్నీ మర్చిపోతారేమో?
(మళ్లీ పెద్దగా నవ్వు)
దేవుడు వరమిస్తానంటే...
కుటుంబంతో సంతోషంగా ఉండాలి. పేదలకు సహాయం చేసే అవకాశం ఇవ్వమంటాను.
మీ గురించి మీరు ఒక్కమాటలో...
ఏదైనా విషయంలో ఎంత గట్టిగా పోరాడతానో. బంధాలు, బంధుత్వాల దగ్గర అంతటి సున్నిత మనస్కురాలిని.
- వాకా మంజులారెడ్డి