క్షమాభిక్ష
రాజీవ్ హంతకుల విడుదలకు
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
మూడురోజుల్లో విడుదల చేస్తామన్న సీఎం
కాంగ్రెస్ మినహా సర్వత్రా హర్షం
చెన్నై, సాక్షి ప్రతినిధి:
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురికి క్షమాభిక్ష పెట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం నాటి అసెంబ్లీ సమావేశంలో ఆమె ప్రకటించారు. 23 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న ఏడుగురికి మరో మూడు రోజుల్లో విముక్తి కలగనుంది. ముగ్గురి ఉరిశిక్షను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ప్రకటించిన మరుసటి రోజే వారందరినీ విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రాహర్షం వ్యక్తమవుతోంది. ఖైదీలు మురుగన్, శాంతన్, పేరరివాళన్, రవి, రాబర్ట్, జయకుమార్, నళినీ వేలూరు జైలు నుంచి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం 1991 మే 21న శ్రీపెరంబుదూరు సభకు హాజరైన రాజీవ్ గాంధీ ఎల్‌టీటీఈ చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి 26 మందికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు టాడా కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై నిందితులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తదనంతరం మురుగన్, శాంతన్, పేరరివాళన్, నళినికి ఉరి శిక్ష సమంజసమేనంటూ సుప్రీంకోర్టు సమర్థించింది. మిగిలిన వారిలో ముగ్గురికి యావ జ్జీవం, 19 మందిని విడుదల చేయాలని తీర్పు చెప్పింది.
ఉరిశిక్ష పడిన నలుగురు 1999 అక్టోబరు 8వ తేదీన సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేయగా కొట్టివేసింది. దీంతో తమకు క్షమా భిక్ష పెట్టాలని కోరుతూ అదే ఏడాది అక్టోబరు 17న రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. అదేనెల 27న రాష్ట్రపతి సైతం నిరాకరించారు. రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నై హైకోర్టులో పిటిషన్ వేయగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీగా ఏర్పడి శిక్షను మరోసారి విశ్లేషించుకోవాలని 1999 నవంబరు 25న కోర్టు అదేశించింది.
ఈ ఆదేశాల మేరకు అప్పటి సీఎం కరుణానిధి నాయకత్వంలో 2000 ఏప్రిల్ 19న కమిటీ సమావేశమైంది. రాజీవ్ హత్యకేసు నిందితుల్లోని నళినికి ఆడశిశువు ఉన్నందున బిడ్డ అనాథ కాకూడదన్న ఉద్దేశంతో ఉరిశిక్ష నుంచి ఆమెను మినహాయిస్తూ తీర్మానం చేశారు. మిగిలిన ముగ్గురికి యథావిధిగా ఉరిశిక్షను అమలు చేయాలని తీర్మానించారు. దీంతో ముగ్గురు 2000 ఏప్రిల్ 21న మళ్లీ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి పరిశీలనకు పంపగా నిరాకరించారు. దీంతో అదే నెల 28వ తేదీన మరోసారి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకోవడంతోపాటూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విన్నవించుకున్నారు. అయితే ప్రభుత్వం ద్వారా వెళ్లిన విజ్ఞప్తులపై కేంద్రం 11 ఏళ్లుగా స్పందించలేదు. దీంతో చొరవతీసుకున్న సుప్రీం కోర్టు వారికి పడిన ఉరిశిక్షను రద్దుచేస్తున్నట్లుగా ఈనెల 18న ప్రకటించింది. జైలు నుంచి విడుదల చేసే అంశాన్ని రాష్ట్రప్రభుత్వానికే అప్పగిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.
ఉరిశిక్ష రద్దుతో ఆనందోత్సాహాలు జరుపుకున్న నిందితుల బంధువులు వారిని విడుదల చేయాలనే డిమాండ్‌ను వెంటనే లేవనెత్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ అంశం తెరపైకి రావడం అన్నాడీఎంకేకు అనుకూలమైంది. దీంతో సీఎం జయ వెంటనే విడుదలపై నిర్ణయాన్ని తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 432 ప్రకారం ప్రభుత్వ విచక్షణాధికారాలను వినియోగించి వారిని విడుదల చేయనున్నట్లు ఆమె సభలో ప్రకటించారు. చట్టంలోని నిబంధనలకు లోబడి తమ నిర్ణయాన్ని ఐపీసీ 435 ప్రకారం కేంద్రానికి పంపుతూ మూడోరోజుల్లో అభిప్రాయం తెలపాలని కోరినట్లు ఆమె చెప్పారు. గడువులోగా కేంద్రం స్పందించిన పక్షంలో ఆ ఏడుగురిని విడుదల చేసే అధికారం యథావిధిగా తమకు వస్తుందని ఆమె చెప్పారు.
కాంగ్రెస్ మినహా సర్వత్రా హర్షం
రాజీవ్ నిందితులకు జైలు నుంచి విముక్తి కల్పిస్తూ సీఎం జయ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు ప్రిన్స్, రంగరాజన్, జాన్‌జాకబ్ నిరసనగా వాకౌట్ చేశారు. డీఎంకే అధినేత కరుణానిధి మీడియాతో మాట్లాడుతూ, ఇదే నిర్ణయాన్ని 2011లో తన హయాంలో వ్యక్తం చేసినపుడు జయ అభ్యంతరం పలికారని విమర్శించారు. అయితే ఈ రోజు తాను మాత్రం జయకు హర్షం తెలపుతున్నానని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు, తమిళ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.