వ్యతిరేకం కాదు.. అనుకూలమూ కాదు
సాక్షి, చెన్నై : తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకమూ కాదు, అనుకూలమూ కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెన్నైలో పాతపాటే పాడారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధిలను గురువారం చంద్రబాబు చెన్నైలో కలుసుకున్నారు. జయతో 45 నిమిషాలు, కరుణానిధితో 30 నిమిషాలు సమాలోచనలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఇంతకూ మీరు తెలంగాణకు అనుకూలమా.. ప్రతికూలమా, పార్లమెంటులో బిల్లుపెడితే మీ పార్టీ మద్దతు పలుకుతుందా? అంటూ మీడియా ప్రశ్నించగా ‘వాట్ అయామ్ సేయింగ్, అయామ్ వెరీ క్లియర్’ అంటూ పొంతన లేని ఇంగ్లిష్ ముక్కలను చెప్పారు.
ఇంతకూ మీరు దేనికి మద్దతు ఇస్తున్నారని ఒక మహిళా విలేకరి సూటిగా ప్రశ్నించగా సమాధానం ఇవ్వాల్సిందిపోయి ‘నీవు చాలా తెలివిగలదానివి. అదే చెబుతున్నా’ అంటూ మరోసారి దాటవేశారు. ఇరుప్రాంతాల వారికీ న్యాయం జరగాలి అని బాబు అనగానే, న్యాయం అంటే మీ దృష్టిలో ఏమిటని మరో విలేకరి ప్రశ్నించగా, ఐ యామ్ వెరీ క్లియర్ అంటూ తప్పించుకున్నారు. తాను తెలంగాణకు అనుకూలం కాదు, అలాగని వ్యతిరేకం కూడా కాదని, రాజ్యాంగం దుర్వినియోగం అవుతోందని అంటున్నాను.. అంటూ పాతపాట పాడారు. ఇంతకూ మీ వైఖరి ఏమిటో చెప్పలేదని మరో విలేకరి ప్రశ్నించగా, ‘‘నేను ఒకవైపు ఎలా నిలబడగలను. తెలుగువారందరి కోసం ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించారు, మా పార్టీ రెండు ప్రాంతాల్లోనూ బలంగా ఉంది.’’ అని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే ఆరునెలల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తానని బదులిచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడిన అంశాలు..
- రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తోందని చెప్పడానికే జయలలితను, కరుణానిధిని కలుసుకున్నాను.
- ఇప్పుడు తెలంగాణ అంశం జాతీయ సమస్యగా మారిందని. దీనిపై కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, ఓట్లు సీట్లుకోసమే విభజన చేస్తోందని విమర్శించారు.
- ఇప్పటికైనా భారత రాష్ట్రపతి చొరవతీసుకుని ఇరు ప్రాంతాలవారు చర్చలు జరిపి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వచ్చేలా చూడాలని కోరారు.
- మరో 15-20 రోజుల్లో సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో కీలకమైన విభజన అంశాన్ని ఎలా చేపడతారని ప్రశ్నించారు.
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోందన్న విషయంపై వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడడం లేదని, ఆయన రాష్ట్ర విభజననే కోరుకుంటున్నారని విమర్శించారు.