చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజలతో స్నేహంగా మసలుకుంటూ శాంతిభద్రతలను కాపాడాలని పోలీసులను ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. చెన్నైలో శుక్రవారం నిర్వహించిన ఐపీఎస్ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనుమానంపై అరెస్టు చేసిన వారిలో కొందరు లాకప్‌డెత్‌కు గురవడం దురదృష్టకరమన్నారు. వివిధ కేసుల్లో లక్షలాది మందిని అరెస్ట్ చేస్తే వారిలో ఒక్కరు లాకప్‌డెత్‌కు గురైనా సీరియస్‌గా పరిగణించాలన్నారు. అనుమానితులను అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్‌లో వారు అనారోగ్యానికి గురికావడం, కొందరు ఆత్మహత్యలకు పాల్పడడం వంటి సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఒక మనిషి ప్రాణాల విలువ అతనిపై ఆధారపడి బతికే ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుందని చెప్పారు. ఇకపై రాష్ట్రంలో లాకప్‌డెత్‌లు జరగరాదని హెచ్చరించారు.
విచారణలో నిర్లక్ష్యం వద్దు
నిందితులను పట్టుకుంటే సరిపోదని, వారిపై వచ్చిన ఆరోపణలను రుజువు చే సి శిక్ష పడేలా చూడడం ఎంతో అవసరమని జయలలిత చెప్పారు. ఎందరో నిందితు లు బెయిల్‌పై విడుదలై స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. అరెస్ట్, బెయిల్‌తోనే పోలీసులు సరిపెట్టుకోకుండా సకాలంలో చార్జిషీటు దాఖలు చేస్తే నిందితులు శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. పోలీసులపై పని భారం ఉందని, అలాగని సమాజ శ్రేయస్సు, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఉదాసీనంగా వ్యవహించ రాదన్నారు. ప్రజలతో పోలీసులు స్నేహితుల్లా మెలగడం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. తన ప్రభుత్వం పోలీసు శాఖకు అవసరమైన మేరకు స్వేచ్ఛను ప్రసాదించిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తీవ్రవాదులను తెగించి పట్టుకోవడం ద్వారా తమిళనాడు పోలీసులు వృత్తిపై అంకింతభావాన్ని చాటుకున్నారని తెలిపారు.
అందుకే 260 మంది పోలీసులకు నగదు బహుమతులు అందజేసి, పదోన్నతులు కల్పించామని తెలిపారు. నేరాల అదుపు, ట్రాఫిక్ నియంత్రణ, వీవీఐపీలకు బందోబస్తు, ప్రముఖ ప్రదేశాల్లో భద్రత తదితర అన్ని అంశాల్లోనూ పోలీసులు తమ కర్తవ్యాన్ని విడనాడరాదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ తీవ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా తమిళనాడు పోలీస్ శాఖ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. నేరాల అదుపు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అన్ని బాధ్యతల్లో జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు.
స్నేహభావంతోనే శాంతిభద్రతలు
Published Sat, Dec 14 2013 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement
Advertisement