స్నేహానికి సిసలైన చిరునామా.. సలాం చేయాల్సిందే మనమంతా!
కల్మషం లేనిది.. కష్టసుఖాల్లో తోడుగా నిలిచేది.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెన్నంటే ఉండేది.. ఆనందంలోనూ ఆత్మీయత పంచేది.. జీవిత చరమాంకందాకా తోడుగా నిలిచేది.. స్నేహం ఒక్కటే..! ఒక్కసారి చిగురిస్తే ఆజన్మాంతం గుర్తుండిపోతుంది. పరిస్థితులు ఏవైనా నేనున్నాననే ధైర్యం ఇస్తుంది. తప్పుచేస్తే దండిస్తుంది.. కష్టమొస్తే కుంగిపోతుంది.. ఇలాంటిదే సత్యవేడు నియోజకవర్గం, కేవీబీపురం మండలంలో వెలుగుచూసింది. విధి ఆడిన వింతనాటకంలో రెండుకాళ్లు చచ్చుబడి లేవలేని స్థితిలో ఉన్న తోటి విద్యార్థినికి స్నేహితులే అండగా ఉంటూ అక్షరాల వైపు నడిపిస్తున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలోని బడికి నిత్యం వీల్ చైర్‌పై తీసుకెళ్తూ.. పాఠశాలలో సపర్యలు చేస్తూ.. వైకల్యాన్ని జయించేలా చేస్తున్నారు. చదువుల తల్లికి తోడుగా నిలుస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. వారి ఆదర్శానికి అధికారులు సైతం సలాం చేస్తున్నారు. అసలు ఆ కథేంటో.. ఆ స్నేహితుల విలువేంటో మీరే చదవండి..
కేవీబీపురం(తిరుపతి జిల్లా): విధి విసిరిన బాణానికి రెండుకాళ్లు చచ్చుబడినా కుంగిపోలేదు. మనోధైర్యంతో గుండె నిబ్బరం చేసుకుంది. ఒంట్లో సత్తువ లేకపోయినా తోటి స్నేహితుల సాయంతో బడిబాట పట్టింది. చదువుల్లో రాణిస్తూ లక్ష్యం వైపు దూసుకుపోతోంది.. కేవీబీపురం మండలానికి చెందిన జూయిస్. నాలుగేళ్ల పాటు బడికి దూరమైనా స్నేహితురాళ్ల సాయంతో మళ్లీ పెన్ను, పుస్తకం పట్టింది. ప్రభుత్వ సాయంతోపాటు స్నేహితుల సహకారంతో ఉన్నత చదువులు చదువుతానని చెబుతోంది.
వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని పెరిందేశం గ్రామానికి చెందిన వెట్టి. ఇజ్రాయిల్, కన్నెమ్మ దంపతులకు దావిద్, జూయిస్ సంతానం. ఇజ్రాయిల్ నగిరి పోస్ట్ ఆఫీస్‌లో చిరు ఉద్యోగి. కన్నెమ్మ రోజువారి కూలీ. కుమార్తె జాయిస్ (14) 2012లో బంధువుల ఇంట్లో ఆడుకుంటూ టైల్స్‌పై జారిపడింది. అప్పట్లో కాలు విరిగినట్లు ధ్రువీకరించి వైద్యులు కట్టుకట్టి పంపించేశారు. క్రమేణా చిన్నారి కాళ్లు చచ్చు బడుతూ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఉన్న రెండెకరాల పొలంతో పాటు సొంత్త ఇంటినీ తెగనమ్మి బిడ్డకు మూడు ఆపరేషన్లు చేయించారు. కానీ ఫలితం లేదు. చిన్నారి రెండు కాళ్ల చచ్చుబడ్డాయి. నడవలేని స్థితికి చేరింది.
3వ తరగతి నుంచి ఇంటి వద్దే ఉండిపోయింది. పాఠశాలకు వెళ్లివచ్చే స్నేహితులకు టాటా చెబుతూ సంబరపడేది. రెండేళ్ల క్రితం వారితోపాటు బడికి వెళ్లాలని నిశ్చయించుకుంది. వీల్‌చైర్ కొనిస్తే అన్నతో కలిసి బడికి పోతానని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. వీల్ చైర్ కొనిచ్చారు. దీనికితోడు అమ్మఒడి, పింఛన్ పథకాలు మంజూరు కావడంతో రెండు కిలోమీటర్ల దూరంలోని రాగిగుంట ఉన్నత పాఠశాలకు తోటి స్నేహితులతో పంపడానికి సమ్మతించారు.
ఉపాధ్యాయుల ఉదారత
జాయిస్ మూడో తరగతిలోనే బడికి దూరమైంది. కాళ్లు రెండూ చచ్చుబడడంతో ఇక బడికి వెళ్లలేనని భావించింది. కానీ చదువుపై ఆ విద్యార్థినికి ఉన్న మక్కువను చూసి ఉపాధ్యాయులే హాజరు వేసి.. హోంవర్క్‌లు ఇచ్చి పై తరగతులకు ప్రమోట్ చేశారు. అలా మూడేళ్లు అంటే ఆరో తరగతి వరకు నెట్టుకొచ్చారు. ఆ తర్వాత బాలికే స్వయంగా బడికిరావడంతో సంబరపడ్డారు.
చిట్టి నేస్తాలు.. పెద్ద సాయం
జాయిస్ పరిస్థితిని అర్థం చేసుకున్న తన స్నేహితురాళ్లు శ్రుతి, మానస, మౌనిక, లావణ్య, భూమిక ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు, పక్క గ్రామంలో ఉన్న ట్యూషన్‌కు నిత్యం తీసుకెళ్లడం.. తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలిపెట్టడం బాధ్యతగా తీసుకున్నారు. గ్రామస్తులు, తోటి విద్యార్థినీ, విద్యార్థులు కూడా పాఠశాలలో సపర్యలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఎలాంటి బిడియం లేకుండా కాలకృత్యాలకు తీసుకెళ్లడం.. మళ్లీ తీసుకొచ్చి క్లాసురూమ్‌లో కూర్చోబెట్టడం లాంటివి చేస్తుండడంతో అధికారులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు.
డాక్టర్ అవుతా
మా అమ్మానాన్నా, అన్నయ్య ఎంతో కష్టపడి నన్ను కాపాడారు. కంటికిరెప్పలా పెంచారు. ఇప్పటికే మా పరిస్థితి దారుణంగా ఉంది. చేతిలో చిల్లిగవ్వలేక.. సరైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. నాకు కృత్రిమ కాళ్లతో పాటు, ప్రభుత్వం, దాతలు మరింత సాయం అందిస్తే బాగా చదువుకుంటా. డాక్టర్ని అయ్యి ప్రతి ఒక్కరికీ నా వంతు సహకారం అందిస్తా.
– జాయిస్ , విద్యార్థిని
తనకోసం తరగతి గదినే కిందకు మార్చాం
జాయిస్ పరిస్థితిని అర్థం చేసుకుని తొమ్మిదో తరగతి గదిని మిద్దెమీద లేకుండా కిందకు మార్చాం. చదువులో చురుగ్గా ఉంటోంది. కేవీబీపురం దివ్యాంగుల పాఠశాల నుంచి ప్రభుత్వం తరఫున సహకారం అందించాలని కోరాం. జాయిస్ పరిస్థితి తెలుసుకుని తోటి విద్యార్థులే బాధ్యత తీసుకుని అన్నీ చేస్తుండడం గొప్ప విషయం.
– నారాయణమ్మ, రాగిగుంఠ ఉన్నత పాఠశాల, హెచ్ఎం
స్నేహితులే అక్కున చేర్చుకున్నారు
జాయిస్ మూడో తరగతి చదువుతున్నపుడు ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి మూడేళ్లు బడికి దూరమైంది. తిరిగి రెండేళ్లుగా తన స్నేహితుల సాయంతో బడికి వెళ్తోంది. స్నేహితురాళ్లే బడికి తీసుకెళ్లి, మళ్లీ ఇంటికి తీసుకొస్తున్నారు. తన అవసరాలు కూడా వాళ్లే తీరుస్తున్నారు. వారి పెద్ద మనసుకు దండం పెట్టాలనిపిస్తుంది.
– కన్నెమ్మ, (జాయిస్) తల్లి
ఏమాత్రం కష్టం అనిపించదు
జాయిస్ పరిస్థితి మాకు తెలుసు. అందుకే తనని మా కాళ్లతో నడిపిస్తున్నాం. బడికి, ట్యూషన్‌కి మేమే తీసుకెళ్తాం. అందరం కలిసే భోంచేస్తాం. మా స్నేహితురాలిని మేమే చూసుకుంటాం. తనకి సేవ చేస్తుంటే ఏమాత్రం కష్టం అనిపించదు. జాయిస్ బాగా చదువుతుంది. చదువుల్లో రాణిస్తుంది. మాకు మంచి సలహాలు ఇస్తుంది.
– చందు, (జాయిస్) స్నేహితురాలు
మనోధైర్యానికి సలాం
ఆ వయసు చిన్నారులు పరిస్థితులను అంత సులువుగా అర్థం చేసుకోలేరు. అయితే జాయిస్ మాత్రం తనంతటతానే మనోధైర్యాన్ని నింపుకుని మళ్లీ అక్షరాలకు చేరువైంది. చదువుపై ఎంతో మమకారం ఉన్న జాయిస్‌ను మరింత ప్రోత్సహిస్తాం. విద్యార్థినికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు చేపడుతాం.
– లక్ష్మీపతి, ఎంఈఓ కేవీబీపురం