సంపాదకీయం: అన్నీ అయినట్టుగానే తమిళనాడులో రాజీవ్ హత్యకేసు దోషుల విడుదల అంశం కూడా అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ కేసులోని ఏడుగురు దోషులూ గత 23 ఏళ్లనుంచి జైళ్లలో ఉన్నారు. వీరిలో ముగ్గురికి పడిన ఉరిశిక్షపై కేంద్ర ప్రభుత్వం గత పదకొండేళ్లుగా ఏమీ తేల్చిచెప్పనందున మానవతా దృక్పథంతో ఆ ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎన్నడో 2000 సంవత్సరంలో తమిళనాడు గవర్నర్ తమ క్షమాభిక్ష పిటిషన్లను తోసిపుచ్చిన తర్వాత ఈ ముగ్గురూ రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. ఆ పిటిషన్లు కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రపతికి చేరడానికి మరో అయిదేళ్లు పట్టింది. ఆ పిటిషన్లను పరిశీలించి తిరస్కరించడానికి రాష్ట్రపతికి మరో ఆరేళ్లుపట్టింది. ఇంత అహేతుకమైన జాప్యం జరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఏరకంగా చూసినా సబబే. కానీ, ఆ తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే తమిళనాడు రాజకీయాలు పెను వేగంతో కదిలాయి.
రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఆ ఏడుగురు దోషుల్నీ విడుదలచేయాలని తీర్మానించింది. మూడురోజుల్లోగా అందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది కూడా. ఈ చర్య ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన రాజకీయ ప్రత్యర్థి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై ఆధిక్యత సంపాదించే ప్రయత్నం చేశారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అనుకున్నట్టే కరుణానిధి ఈ చర్యను అభినందించడంతోపాటు...2011లో వీరి ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కేంద్రాన్ని కోరినప్పుడు జయలలిత తప్పుబట్టిన సంగతిని గుర్తుచేశారు. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్నందున తమిళ జాతీయవాద పరిరక్షకులుగా కనబడేందుకు అన్నా డీఎంకే, డీఎంకేలు తహతహలాడటంలో వింతేమీ లేదు.
కానీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ వివాదంలో తలదూర్చి చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తికరమైనవి. ఎల్‌టీటీఈ పొట్టన బెట్టుకున్న రాజీవ్‌గాంధీ కుమారుడు గనుక జయలలిత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన వ్యతిరేకత వ్యక్తంచేయడం తప్పేమీ కాదు. అయితే, ఈ దేశంలో మాజీ ప్రధానికే న్యాయం జరగకపోతే...ఆయనను చంపినవారినే స్వేచ్ఛగా వదిలేస్తే ఇక సామాన్యుడికి న్యాయం ఎక్కడుంటుందని రాహుల్ ప్రశ్నించారు. అలా అనేముందు ఇందులో తమ బాధ్యత ఎంతో రాహుల్ ఆత్మ విమర్శ చేసుకుని ఉంటే బాగుండేది. రాజీవ్‌గాంధీ దోషులు ముగ్గురూ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు దాఖలుచేసిన నాలుగేళ్లకు యూపీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది.
కానీ, ఆ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి దానికి ఏడేళ్లుపట్టింది. రాహుల్ అన్నట్టు ‘మాజీ ప్రధానికే న్యాయం జరగకపోతే...’ ఎలా అని యూపీఏ సర్కారు భావిస్తే ఏదో ఒక నిర్ణయాన్ని వేగిరం తీసుకొని ఉండేది. వారి పిటిషన్లను తిరస్కరించి ఉరిశిక్షలను అమలుచేయడమో లేక ఉరిశిక్షలపై రాహుల్‌గాంధీకున్న అభిప్రాయాన్ని గౌరవించి ఆ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మర్చడమో చేసేది. దేశాన్ని పట్టిపీడిస్తున్న అనేకానేక కీలక సమస్యలపై నిర్ణయాలను నాన్చి... కేవలం తనకు ఎన్నికల ప్రయోజనాలు చేకూర్చగలవాటినే పరిగణనలోకి తీసుకోవడం అలవాటైన యూపీఏ సర్కారు ఎందుకనో రాజీవ్‌గాంధీ హత్య కేసు విషయంలో కూడా సాచివేత ధోరణినే అవలంబించింది. అందువల్ల ‘మాజీ ప్రధానికే న్యాయం జరగకపోవడం’ అనేది తప్పయితే, ఆ తప్పు చేసింది యూపీఏ ప్రభుత్వమేనన్న సంగతి మరవరాదు. ఇప్పుడు ఆ దోషులను వదలాలని నిర్ణయించడం మాత్రమే తప్పని రాహుల్ చెబితే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
రాజీవ్ కేసు దోషుల్లో మురుగన్, శంతన్, పెరారివళన్, నళినిలకు 1999లో ఉరిశిక్ష విధించినప్పుడు బెంచ్‌లోని జస్టిస్ కేటీ థామస్ మెజారిటీ తీర్పుతో విభేదించారు. మురుగన్, నళినిలు దంపతులు గనుక వారిని ఉరితీస్తే వారిద్దరి కుమార్తె అనాథ అవుతుందని చెబుతూ నళిని ఈ కుట్రలో తెలియకుండానే భాగస్వామి అయిందని అభిప్రాయ పడ్డారు. ఆమెకు యావజ్జీవ శిక్ష సరిపోతుందని తీర్పునిచ్చారు. అనం తరకాలంలో సోనియాగాంధీ జోక్యంతో నళినికి విధించిన మరణశిక్ష 2007లో యావజ్జీవ శిక్షగా మారింది. ఉరిశిక్ష పడిన ముగ్గురూ దాని సం గతి తేలకుండానే 23ఏళ్లనుంచి జైల్లో ఉన్నారు గనుక...యావజ్జీవ శిక్ష పడివుంటే రెమిషన్లన్నీ కలిసొచ్చి వీరంతా ఎప్పుడో విడుదలయ్యేవారు గనుక వారి విడుదల సబబేనని జస్టిస్ థామస్ నిరుడు వ్యాఖ్యానించారు. ఆ రకంగా చూస్తే జయలలిత సర్కారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయంలో తొందరపాటు ఉండొచ్చు... రాజకీయ ప్రయోజ నాలుంటే ఉండొచ్చుగానీ అది పూర్తిగా అహేతుకమని చెప్పలేం.
అయితే, యావజ్జీవ శిక్ష పడిన ఖైదీల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ముందు అనుసరించాల్సిన నియమాలను తమిళనాడు ప్రభుత్వం ఉల్లంఘించిందన్నది వాస్తవం. నేర విచారణ స్మృతి ప్రకారం ఆరుగురు సభ్యులుండే సలహా బోర్డు సిఫార్సు అనంతరం మాత్రమే రాష్ట్ర కే బినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా తమిళనాడు ప్రభుత్వం దాన్ని పాటించలేదు. కనుకనే ఏడుగురి విడుదలకూ సుప్రీంకోర్టు గురువారం బ్రేక్ వేసింది. ఇదంతా సరేగానీ...1984లో ఇందిరాగాంధీని కొందరు దుండగులు పొట్టనబెట్టుకున్న తర్వాత జరిగిన సిక్కుల ఊచకోతలో మరణించినవారికి కూడా ఇంతవరకూ న్యాయం జరగలేదు. బాధిత కుటుంబాలు దోషులుగా ఆరోపిస్తున్నవారంతా అధికారం అండతో స్వేచ్ఛగా జీవనం కొనసాగిస్తున్నారు. సామాన్యులు దాన్ని కూడా ప్రశ్నిస్తారని, ఇన్ని దశాబ్దాలు గడిచినా న్యాయం జరగలేదని భావిస్తారని రాహుల్ గ్రహించాలి.
‘యావజ్జీవ’ వివాదం!
Published Fri, Feb 21 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM
Advertisement
Advertisement