పేలుళ్ల విచారణ వేగవంతం
* ఊహా చిత్రాలు సిద్ధం
* జాతీయ భద్రతా దళాల రాక
* బెంగళూరు, పాట్నాలకు సీబీసీఐడీ
* నకిలీ చిరునామాతో రిజర్వేషన్లు
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన బెంగళూరు- గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలులో పేలుళ్ల ఘటన దోషులను పట్టుకునేందుకు విచారణను వేగవంతం చేశారు. సీబీసీఐడీ పోలీసులు బెంగళూరు, పాట్నాలకు బయలుదేరి వెళ్లారు. కేంద్రం నుంచి జాతీయ భద్రతా దళం కూడా శుక్రవారం చెన్నైకి చేరుకుంది. రైలులోని రెండు బోగీల్లో జరిగిన పేలుళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన స్వాతి (24) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృత్యువాతపడగా, 14 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. సంఘటన జరిగిన గురువారం నుంచే విచారణ ప్రారంభమైంది. ఈ పేలుళ్ల కుట్రను ఛేదించేందుకు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాల మేరకు ఏర్పాటైన సీబీసీఐడీ విచారణ బృందం రెండుగా ఏర్పడి బెంగళూరు, పాట్నాలకు శుక్రవారం వెళ్లింది. సంఘటన జరిగి 24 గంటలు దాటినా ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఇది తమ చర్య అని చాటుకోలేదు.
అయితే ఐఎస్‌ఐ, ఇండియన్ ముజాహిద్దీన్, అల్ ఉమా సహా పలు తీవ్రవాద సంస్థల పనేనని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. పేలుళ్లు జరిగిన సమయంలో విధుల్లో ఉన్న రైల్వే కార్మికులను, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ప్రయాణికులను విచారిస్తున్నారు. పాట్నాలో మోడీ ఎన్నికల సభ నిర్వహించినపుడు పేలిన బాంబులు, బోగీల్లో పేలిన బాంబులు ఒకే రకమని గుర్తించారు. ఈ కారణంగానే ఒక విచారణ బృందం పాట్నాకు వెళ్లింది. ప్రైవేటు ట్రావెల్స్ ఏజన్సీల ద్వారా నకిలీ అడ్రసుతో తత్కాల్ టికెట్ రిజర్వు చేసుకున్న వారికోసం గాలిస్తున్నారు. రాష్ట్రం నుంచి తత్కాల్ రిజర్వేషన్ చేసుకున్నవారి వివరాలు సేకరించేందుకు రిజర్వేషన్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో అనేక ప్రైవేటు ట్రావెల్స్ వారు తాళాలు వేసి పారిపోయారు. బాంబులు పేలిన బోగీలో రిజర్వేషన్ చేసుకున్న ఒక వ్యక్తి ఎస్-6లో ప్రయాణం చేశాడు. అతని ఫోన్ నెంబరు కూడా తప్పుగా ఉండడంతో అతన్ని కూడా అనుమానిస్తున్నారు.
పేలుళ్లు జరిగిన రైలులో చెన్నై వరకు ప్రయాణించిన వారి ఇళ్లకు వె ళ్లి తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం చెన్నైకి చేరుకున్న జాతీయ భద్రత దళం అధికారులు పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని, బోగీలను తనిఖీ చేశారు. సెంట్రల్ స్టేషన్, 9వ నెంబరు ప్లాట్‌ఫాంలోని సుమారు 80 సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. విచారణకు ఇబ్బందులు తలెత్తకుండా 9వ నెంబరు ఫ్లాట్‌ఫాంకు సీల్‌వేసి సాయుధ పోలీసులతో బందోబస్తు పెట్టారు. పేలుళ్లు జరిగిన బోగీల్లోని ప్రయాణికుల సహకారంతో కంప్యూటర్ ద్వారా నిందితుల ఊహాచిత్రాలను సిద్ధం చేసినట్లు తెలిసింది.