తమిళనాడులో తాజాగా మారిన రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తే ముందస్తు ఎన్నికలు లేనట్లేనని తెలుస్తోంది.
జయ కోసమే ఆర్కేనగర్ సిద్ధం
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో తాజాగా మారిన రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తే ముందస్తు ఎన్నికలు లేనట్లేనని తెలుస్తోంది. ఉప ఎన్నిక లేకుండా ముందస్తుకు జయ సిద్ధమవుతారని అన్నాడీఎంకేలో జోరుగా సాగిన ప్రచారానికి విరుద్ధంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈనెల 22వ తేదీన పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహించనున్నారు. అదే సమయంలో జయను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుని సీఎం పీఠం ఎక్కిస్తారని తెలుస్తోంది. అయితే, ఈనెల 23వ తేదీలోగా ఏదేని అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయితేనే ఉప ఎన్నిక సాధ్యమని ఎన్నికల కమిషన్ నిబంధన వల్ల ఆర్కేనగర్ ఎమ్మెల్యే వె ట్రివేల్ చేత హడావుడిగా రాజీనామా చేయించారు.
స్వల్ప అనారోగ్యం తో బాధపడుతున్న జయలలిత దూరప్రాంతాలకు వెళ్లి ప్రచారంచేసే స్థితిలో లేనందునే ఆర్కేనగర్‌ను ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా సైతం ఆరు నెలల్లో ఆర్కేనగర్‌లో ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఉప ఎన్నికకు జయ సిద్ధమయినట్లు తేలటంతో ముందస్తు ఎన్నికలు లేనట్లేనని భావిస్తున్నారు.
అప్పీలుకు మరికొన్ని రోజులు: మరోవైపు జయలలితను నిర్దోషిగా విడుదల చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేసే అంశంపై నిర్ణయం తీసుకోవటానికి మరికొద్ది రోజులు పట్టవచ్చని ఆ రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి టీబీ జయచంద్ర సోమవారం తెలిపారు. ‘జయ’తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య ఇప్పటికే ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇక నిర్ణయం తీసుకోవలసింది ప్రభుత్వమేనని ఆయన అన్నారు.