
సాక్షి, చెన్నై: జయలలిత మరణంతో తమిళనాట రాజకీయాలు రోజుకో మలువు తిరుగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి డీఎంకే నేత స్టాలిన్‌పై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీలో స్టాలిన్ ఉన్నంత వరకు డీఎంకే గెలవదని జోస్యం చెప్పారు.
ఆర్కే నగర్ ఓటమిపై వెంటనే సమీక్ష జరపాలని అళగిరి డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో డీఎంకే విఫలమవుతోందని ఆయన విమర్శించారు. అంతేకాక క్షేత్రస్థాయిలో పార్టీ ప్రక్షాళన జరగాలని అళగిరి అభిప్రాయపడ్డారు. ఆర్కే నగర్‌లో టీటీవీ దినకరన్ విజయం సాధించడంతో అధికార, విపక్ష పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.