MK Alagiri
-
పెద్దనాన్న ఇంటికి ఉదయ నిధి స్టాలిన్.. ఆనందంతో ఆహ్వానించిన..
సాక్షి, చెన్నై: డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరితో సీఎం ఎంకే స్టాలిన్ వారసుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ భేటీ అయ్యారు. మదురైలో తన పెద్దనాన్న అళగిరి ఆశీస్సులను అందుకున్నారు. డీఎంకే దివంగత అధినేత కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి అన్న విషయం తెలిసిందే. దక్షిణ తమిళనాడు డీఎంకే కింగ్ మేకర్‌గా ఒకప్పుడు ఎదిగిన ఆయన ప్రస్తుతం రాజకీయాలకే దూరంగా ఉన్నారు. ఇందుకు కారణం కరుణానిధి చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్‌తో ఏర్పడ్డ వైరమే కారణం అనేది జగమెరిగిన సత్యం. అనేక సందర్భాల్లో స్టాలిన్‌కు వ్యతిరేకంగా అళగిరి వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి రావడంతో అళగిరి మౌనంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో మదురై పర్యటనకు వెళ్లిన మంత్రి ఉదయ నిధి స్టాలిన్ తన పెద్దనాన్నను కలిశారు. అళగిరి, ఆయన సతీమణి కాంతి అళగిరి ఆనందంతో ఉదయనిధిని ఆహ్వానించిచారు. ఈసందర్భంగా పెద్ద నాన్న అళగిరి శాలువతో సత్కరించి ఉదయ నిధికి ఆశీస్సులు అందించారు. అళగిరి మాట్లాడుతూ తాను డీఎంకేలో లేనని, తమ్ముడి కొడుకు తమ ఇంటికి రావడం ఆనందం కలిగించిందన్నారు. తమ్ముడు సీఎంగా ఉండడం, కుమారుడు మంత్రి కావడం మరింత సంతోషం కలిగిస్తోందన్నారు. డీఎంకే లోకి మళ్లీ వస్తారా? అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సమాధానం అక్కడే అడగండి అని దాట వేశారు. చదవండి: (విక్రమార్కుడు.. రత్న ప్రభాకరన్..104 సార్లు ఫెయిల్..105వ సారి శభాష్ అనిపించుకున్నాడు) -
‘నా తమ్ముడు ఎన్నటికీ సీఎం కాలేడు’
మదురై వేదికగా ఆదివారం డీఎంకే బహిష్కృత నేత అళగిరి తనలోని ఆక్రోశాన్ని , ఆవేదనను వెల్లగక్కారు. డీఎంకే అధ్యక్షుడు, సోదరుడు స్టాలిన్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను ఏ తప్ప చేశానో, ఏ ద్రోహం చేశానో సమాధానం ఇవ్వాలని ప్రశ్నించారు. ఎన్నో అవమానాలు భరించాను, ఇక ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడతారాని మద్దతుదారుల్ని ఉద్దేశించి అళగిరి వ్యాఖ్యలు చేశారు. సాక్షి, చెన్నై: అళగిరి ఆదివారం మదురైలో మద్దతుదారులతో భేటీ అయ్యారు. ఇదో బల ప్రదర్శనకు వేదిక అన్నట్టుగా మారింది. కలైంజర్ డీఎంకే ఆవిర్భావానికి సమయం ఆసన్నమైనట్టుగా మద్దతుదారులు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నాయకత్వానికి సిద్ధం కావాలని అళగిరికి పిలుపునిచ్చారు. అయితే, అళగిరి మాత్రం తనలోని ఆక్రోశాన్ని వెల్లగక్కే రీతిలో ఈ వేదికను అస్త్రంగా చేసుకున్నారు. మాట్లాడుతున్న అళగిరి మొదటి నుంచి తొక్కుడే.. ఎన్నో ఒడిదొడుగుల్ని డీఎంకే ఎదుర్కొందని గతాన్ని గుర్తు చేస్తూ వివరించారు. ఆది నుంచి తనను రాజకీయంగా తొక్కడానికి జరిగినా, తాను పెద్దగా పట్టించుకోలేదన్నారు. తిరుమంగళం ఉపఎన్నికలో గెలుపు తర్వాత తాను వద్దని మారాం చేసినా, బలవంతంగా దక్షిణ తమిళనాడు పార్టీ నిర్వాహక కార్యదర్శి పదవిని అప్పగించారని గుర్తు చేశారు. దక్షిణ తమిళనాడు మీద పూర్తి పట్టు సాధించి పార్టీకి తిరుగు లేని విజయాల్ని దరిచేర్చినట్టు గుర్తు చేశారు. పదవుల్ని దరి చేర్చిందే నేనే.. తన తండ్రి కరుణానిధితో మాట్లాడి స్టాలిన్‌కు కోశాధికారి పదవి ఇప్పించింది తానే అని, ఓ సారి స్టాలిన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. అంతే కాదు, తన ఇంటికి తమ్ముడు కుటుంబంతో సహా వచ్చిన సమయంలో కలైంజర్(తండ్రి) తర్వాత పార్టీకి అన్నీ నువ్వే, నువ్వే నడిపించాలని ఆ సమయంలోనే తాను భుజం తట్టి పంపించానని పేర్కొన్నారు. పదవుల కోసం తాను ఎన్నడూ పాకులాడ లేదని, కేంద్ర మంత్రి పదవిని సైతం తాను బలవంతంగానే చేపట్టాల్సి వచ్చిందన్నారు. స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి రావడంలో, ఎందరికో మంత్రి పదవులు దరి చేర్చడంలో తన సహకారం ఉందని వివరించారు. పార్టీ కోసం ఓ కార్యకర్తగా శ్రమించిన తాను ఏదో తప్పు చేసినట్టుగా, ద్రోహం చేసినట్టుగా చిత్రీకరించి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ్ముడి ఎదుగుదలను తాను ఆనందించానే గానీ, ఎన్నడూ ఈర్ష్య పడలేదన్నారు. అయితే, ఆయన (స్టాలిన్) అందుకు భిన్నంగా వ్యవహరించి తనను, తన వాళ్లను డీఎంకేకు దూరం చేశారని ఉద్వేగానికి లోనయ్యారు. బలహీన పరిచారు.. వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని కలైంజర్ స్పష్టం చేస్తే, బలవంతంగా ఆయన్ను తిరువారూర్ నుంచి 2016లో పోటీ చేయించి బలహీనుడ్ని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కావాలన్న ఆశతో స్టాలిన్ ఉన్నాడని, ఇది జరగదని, ఆ పదవిలోకి ఆయన వచ్చే ప్రసక్తే లేదన్నారు. ఏడు సంవత్సరాలు మౌనంగా ఉన్నానని, ఇక, తాను ఏ నిర్ణయం తీసుకున్నా, వెన్నంటి ఉంటారా అని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. -
‘పార్టీలోకి రానిస్తే.. తమ్ముడి నాయకత్వాన్ని ఆమోదిస్తా’
చెన్నై: డీఎంకే బహిషృత నేత, కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి తన దూకుడు తగ్గించారు. నిన్నటి వరకు సోదరుడు స్టాలిన్‌పై విరుచుకుపడ్డ అళగిరి తన వైఖరి మార్చుకున్నారు. తాను స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తానని ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను తిరిగి డీఎంకేలో చేర్చుకుంటే స్టాలిన్‌ను నాయకుడిగా అంగీకరిస్తానని స్పష్టం చేశారు. అలాగే తను డీఎంకేలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్టు వెల్లడించారు. కాగా మంగళవారం జరిగిన డీఎంకే అధ్యక్ష ఎన్నికల్లో స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. డీఎంకే అధ్యక్ష ఎన్నికకు కొన్ని రోజుల ముందు అళగిరి మాట్లాడుతూ.. తనను మళ్లీ డీఎంకేలోకి చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని స్టాలిన్‌ను హెచ్చరించారు. లేకుంటే సెప్టెంబర్ 5న చెన్నైలో తలపెట్టిన ర్యాలీలో తనా సత్తా ఎంటో చూపిస్తానని అన్నారు. పార్టీ కార్యకర్తలు తన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. తాజాగా అళగిరి తన వైఖరి మార్చుకోవడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. -
డీఎంకేలో చేర్చుకోకుంటే ఖబడ్దార్: అళగిరి
మదురై: డీఎంకేలోకి తనను మళ్లీ చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తన సోదరుడు, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను బహిష్కృత నేత అళగిరి హెచ్చరించారు. మంగళవారం డీఎంకే అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరగనున్న డీఎంకే సర్వసభ్య సమావేశంలో స్టాలిన్ ఎన్నిక లాంఛనమే కానుంది. పార్టీలోకి తనను చేర్చుకోకుంటే సెప్టెంబర్ 5న చెన్నైలో తలపెట్టిన ర్యాలీలో తన సత్తా ఏంటో చూపిస్తానని అళగిరి అన్నారు. కరుణానిధికి నివాళులర్పించేందుకు నిర్వహిస్తోన్న ఈ ర్యాలీకి పార్టీ కార్యకర్తలు తన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. కరుణానిధి మరణం తర్వాత పార్టీని కాపాడటానికే తాను ఇవన్ని చేస్తున్నానని విలేకరులతో చెప్పారు. -
డీఎంకేలో తిరుగుబాటు!
సాక్షి, చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో మరో తిరుగుబాటుకు తెరలేచింది. డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో పార్టీలో ఆయన కుమారుల మధ్య వారసత్వ పోరు ప్రారంభమైంది. తాజాగా ఆయన కుమారుడు, మాజీ కేంద్రమంత్రి ఎంకే అళగిరి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వారసుల గురించి కరుణానిధి ఏమన్నారో తనకు తెలియదని, ప్రస్తుతం నిజమైన డీఎంకే కార్యకర్తలందరూ తన వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. పార్టీని నడిపించడానికి తానే సరైన నాయకుడినని చెప్పుకొచ్చారు. స్టాలిన్ కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమేనని, కానీ ఆయన పని (వర్కింగ్) చేయడం లేదని విమర్శించారు. కరుణానిధి మరణంతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు రంగం సిద్దమైందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 14న డీఎంకే కార్యవర్గ సమావేశంలో స్టాలిక్‌కు పట్టాభిషేకం చేయనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో అళగిరి వ్యాఖ్యాలు పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో కూడా అళగిరి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ నాయకుడు కరుణానిధి మాత్రమేనని, స్టాలిన్‌ను నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన వర్ణించారు. పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడుతున్నారంటూ అళగిరిని 2014 లోక్‌సభ ఎన్నికల ముందు కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి అళగిరి బహిష్కరణ కుడా ఒక కారణమని పార్టీలోని ఓ వర్గం నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి తిరిగి పుర్వవైభవం తెచ్చేందుకు అళగిరిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని గతంలో స్టాలిన్ భావించారు. దీనికి స్టాలిన్ వర్గంలోని కొందరు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్టాలిన్ వెనుకడుగువేశారు. ప్రస్తుతం అళగిరి వ్యవహర శైలిని డీఎంకే నిశితంగా పరిశీలిస్తోంది. కరుణానిధి అంత్యక్రియలు సందర్భంగా అళగిరితో బీజేపీ తమిళనాడు ఇన్ఛార్జ్ మురళీధర్‌రావు 40 నిమిషాల పాటు ముచ్చటించిన విషయం తెలిసిందే. అదే అంశం డీఎంకే శ్రేణులను తీవ్రంగా కలవరపెడుతోంది. దీంతో స్టాలిన్ పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. స్టాలిన్‌కు పట్టాభిషేకం -
‘నాన్న పిలిస్తే పార్టీలోకి వస్తా’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘నాన్న పిలిస్తే పార్టీలోకి వస్తా’ అని అళగిరి చెప్పారు. గురువారం మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ మాట చెప్పారు. గతంలో కూడా అనేకసార్లు ఇదే చెప్పానని గుర్తు చేశారు. డీఎంకేలో స్వయానా అన్నదమ్ములైన అళగిరి, స్టాలిన్ మధ్య ఎంతో కాలంగా ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. మదురై కేంద్రంగా దక్షిణ తమిళనాడులో పార్టీపై పట్టుపెంచుకుని అళగిరి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకున్నారు. పెద్ద కుమారుని హోదాలో పార్టీ వారసుడిగా తననే ప్రకటించాలని అళగిరి పట్టుపట్టారు. అయితే వారసత్వానికి వయసు ఒక్కటే అర్హత కాదని, రాజకీయ పరిణితి, చతురతలకే ప్రాధాన్యత అనే కోణంలో కరుణానిధి తన చిన్న కుమారుడు స్టాలిన్‌కే పట్టం కట్టేందుకు ఉత్సాహం చూపారు. దీంతో అళగిరి అనేకసార్లు తండ్రిపై తిరుగుబాటు ప్రదర్శించారు. తల్లి చేత సిఫార్సు చేయించారు. అయితే తన నిర్ణయం నుంచి వెనక్కు తగ్గని కరుణానిధి రెండేళ్ల క్రితం ఒకానొక సందర్భంలో అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించేశారు. దీంతో అగ్గిమీద గుగ్గిలమైన అళగిరి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకి వ్యతిరేకంగా వ్యవహరించడమేగాక, అధికారంలోకి రాదంటూ బహిరంగంగా వ్యాఖ్యానాలు చేశారు. అళగిరిపై వేటుపడిన తరువాత స్టాలిన్‌ని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించారు. వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న దశలో అళగిరి తల్లిదండ్రుల పరామర్శల పేరుతో మరలా రాయబారం ప్రారంభించారు. గోపాలపురంలో అళగిరి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి వృద్ధాప్య అనారోగ్య కారణాలతో చెన్నై గోపాలపురంలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సుమారు ఏడాదిన్నర కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా మెలుగుతున్నారు. వీవీఐపీలను మాత్రమే కలుస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించిన తరువాత రజనీకాంత్, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ తదితరులు ఇటీవల కాలంలో కరుణను కలుసుకున్నారు. నాలుగురోజుల క్రితం అర్ధరాత్రి వేళ డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయానికి సైతం కరుణ వచ్చారు. గతంలో పోల్చుకుంటే ఎంతో మెరుగైన రీతిలో కరుణ స్పందిస్తున్నారు. నెమ్మదిగా మాట్లాడుతున్నారు. ఈ దశలో కరుణానిధిని చూసేందుకు ఆయన పెద్ద కుమారుడు అళగిరి బుధవారం గోపాలపురానికి వచ్చారు. ఆయనతోపాటు సతీమణి కాంతి, కుమారుడు దురైదయానిధి కూడా వచ్చారు. తల్లి దయాళూఅమ్మల్ వద్ద సుమారు 15 నిమిషాలు మాట్లాడారు. ఆ తరువాత మిద్దెపైకి వెళ్లి తండ్రి కరుణానిధిని కుటుంబంతో సహ కలిసివచ్చారు. మొత్తం 30 నిమిషాలపాటు గోపాలపురంలో గడిపిన అళగిరి కుటుంబంతో సహా మదురైకి తిరిగి వెళ్లిపోయారు. మదురైలో నిన్న (గురువారం) మీడియాతో మాట్లాడుతూ, తండ్రి ఆరోగ్యంగా ఉన్నారని, గతంలో కంటే మెరుగైన తీరులో వ్యవహరిస్తున్నారని చెప్పారు. మీరు మరలా డీఎంకేలోకి వస్తారా అని ప్రశ్నించగా ‘నాన్న ఆహ్వానిస్తే వస్తా, అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని బదులిచ్చారు. ఈ విషయాన్ని గతంలోనే అనేకసార్లు చెప్పానని గుర్తు చేశారు. -
‘ఆయన ఉన్నంత వరకు ఆ పార్టీ గెలవదు’
సాక్షి, చెన్నై: జయలలిత మరణంతో తమిళనాట రాజకీయాలు రోజుకో మలువు తిరుగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి డీఎంకే నేత స్టాలిన్‌పై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీలో స్టాలిన్ ఉన్నంత వరకు డీఎంకే గెలవదని జోస్యం చెప్పారు. ఆర్కే నగర్ ఓటమిపై వెంటనే సమీక్ష జరపాలని అళగిరి డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో డీఎంకే విఫలమవుతోందని ఆయన విమర్శించారు. అంతేకాక క్షేత్రస్థాయిలో పార్టీ ప్రక్షాళన జరగాలని అళగిరి అభిప్రాయపడ్డారు. ఆర్కే నగర్లో టీటీవీ దినకరన్ విజయం సాధించడంతో అధికార, విపక్ష పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
'నన్ను వాడుకోవడం ఆ పార్టీకి తెలియదు'
ఒకవైపు తమ్ముడు రాకెట్ వేగంతో ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ఎక్కడ చూసినా అతనే కనిపిస్తున్నాడు. అదే సమయంలో అన్న రాజకీయాల్లో మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఎక్కడా ఏ ప్రచారంలోనూ ఆయన ప్రస్తావన లేదు. ఆయన ఊసే లేకుండా ఇప్పుడు తమిళనాడులో డీఎంకే ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఆ అన్నదమ్ములే ఎంకే స్టాలిన్, ఎంకే అళగిరి. ఓవైపు తమ్ముడు స్టాలిన్ డీఎంకేకు అన్నీ తానై ప్రచారంలో దూసుకుపోతుండగా.. అళగిరి మాత్రం ఇంటికి పరిమితమై.. రాజకీయాల్లో దూరంగా ఉండిపోయారు. 90 ఏళ్ల కరుణానిధి ఏకంగా 13వసారి తమిళనాడు ఎన్నికల బరిలోకి దిగి.. పార్టీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రినని స్పష్టం చేశారు. అదేసమయంలో తనకు ఏమైనా అయితే తన చిన్న కొడుకు స్టాలిన్నే కాబోయే సీఎం అని తేల్చి పారేశారు. ఈ ప్రకటన పర్యవసానం ఏమిటో అళగిరికి చాలాబాగా తెలుసు. కరుణ వారుసుడిగా ఎవరు డీఎంకే పగ్గాలు చేపట్టబోతున్నారు కూడా ఆయనే పసిగట్టే ఉంటారు. అందుకే ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో తాను ఏ పార్టీకి ఓటు వేయబోనని ఆయన స్పష్టం చేశారు. మరీ, ఈసారి ఎన్నికల్లో డీఎంకే గెలుస్తుందా? అంటే ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు. స్టాలిన్ తనతో మాట్లాడక దాదాపు మూడేళ్లు అవుతుందని, ఈ మూడేళ్లకాలంలో తన సవతి సోదరి కనిమొళి కూడా తనతో మాట్లాడలేదని ఆయన చెప్పారు. 1980లోనే అళగిరిని మధురైకి పంపారు కరుణానిధి. అప్పటి నుంచి ఈ జిల్లాను తనకు పెట్టనికోటగా మార్చుకున్న అళగిరి.. ఈసారి మధురైలో డీఎంకే పరిస్థితి ఏమిటంటే కాస్తా నిర్వేదంగా సమాధానమిచ్చారు. తనను వాడుకోవడం డీఎంకేకు తెలియదని, ఆ పార్టీ మధురై జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని అన్నారు. -
ఇక మౌనమే!
ఇన్నాళ్లు దూకుడుగా వ్యవహరించిన డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి ఇక మౌనం పాటించేందుకు నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ తన మద్దతు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇదే తన మద్దతు దారులకూ వర్తిస్తుందని ప్రకటించారు. సాక్షి, చెన్నై:డీఎంకే నుంచి అళగిరి బహిష్కరించబడ్డ విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో అళగిరి వ్యవహరించిన తీరుతో డీఎంకే చావు దెబ్బ తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఎన్నికల్లో ఆయన మద్దతు కోసం బీజేపీ కూటమి తీవ్రంగానే కుస్తీలు పట్టాయి. కొందరు అభ్యర్థులు వ్యక్తిగతంగా అళగిరితో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో చావు దెబ్బతో డీఎంకే డిపాజిట్లు గల్లంతు అయ్యేందుకు అళగిరి కూడా ఓ కారకుడిగా చెప్పవచ్చు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో ముందుకు సాగుతూ వచ్చిన అళగిరి రూపంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ చిక్కులు మళ్లీ ఎదురు అవుతాయో అన్న బెంగ డీఎంకేకు తప్పలేదు. అదే సమయంలో గత నెల మీడియాతో మాట్లాడుతూ తన దారి ఏమిటో ఎన్నిక నామినేషన్ల పర్వం లోపు తేలుతుందని, అంత వరకు వేచి చూడాల్సిందే అన్న అళగిరి వ్యాఖ్య ఉత్కంఠకు దారి తీసింది. అళగిరి వ్యవహార శైలి ఎలా ఉండబోతోందో అన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇక ఏడాదిన్నరగా కరుణానిధి అనుమతి కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన అళగిరికి ఈ సారి గోపాలపురంలో భేటీకి అవకాశం దొరికింది. గత వారం కరుణానిధితో భేటీ కావడం, ఈ భేటీ గురించి స్టాలిన్ సైతం మౌనం వహించడంతో ఇక అళగిరి బెడద తీరినట్టే అన్న ఆనందం డీఎంకే వర్గాల్లో నెలకొంది. ఒకటి కాదు, ఏకంగా రెండు సార్లు, వారం వ్యవధిలో కరుణానిధితో అళగిరి భేటీ కావడంతో, దక్షిణ తమిళనాడులో గెలుపు బాధ్యతల్ని భుజాన వేసుకుంటారేమో అన్న చర్చ బయల్దేరింది. అయితే అళగిరి కోట మధురై నుంచే స్టాలిన్ ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో ఆ చర్చ కాస్త సద్దుమణిగింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు దూరంగా ఉండడం మంచిదన్న నిర్ణయానికి అళగిరి వచ్చి ఉన్నారు. దూకుడుగా వ్యవహరించి నోరు జారడం కన్నా, మౌనం పాటించడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చి ఉన్నారు. ఎప్పుడూ మీడియా సంధించే ప్రశ్నలకు ఘాటుగా స్పందించే అళగిరి మంగళవారం శాంత స్వభావంతో ఒకే సమాధానం ఇచ్చి ముందుకు సాగడం విశేషం. చెన్నై నుంచి మధురైకు వెళ్తూ, మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియా చుట్టుముట్టడంతో స్పందించారు. మీడియా పలు ప్రశ్నల్ని సందించినా స్పందన లేదు. ఈ ఎన్నికల్లో తానెవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని, ఇది తన మద్దతుదారులకూ వర్తిస్తుందంటూ ముందుకు సాగడం విశేషం. ఎన్నికల్లో ఎవరి కోసం పనిచేయాల్సిన అవసరం లేదని పరోక్షంగా తమ మద్దతుదారుల కోసం ఈ వ్యాఖ్య చేసి ముందుకు కదిలారు. -
కరుణానిధితో పెద్ద కుమారుడి భేటీ
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువైన డీఎంకే మాజీ నేత ఎంకే అళగిరి గురువారం తన తండ్రి కరుణానిధిని కలిశారు. కొంతకాలంగా తండ్రికి దూరంగా ఉంటున్న ఆయన కరుణానిధిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తమ తల్లిదండ్రులను కలిసేందుకే అళగిరి వచ్చారని ఆయన సోదరుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. రాజకీయాలు, ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి విషయాలు చర్చించలేదని చెప్పారు. స్టాలిన్ తో ఆధిపత్య పోరు కారణంగా డీఎంకేకు అళగిరి దూరమయ్యారు. అన్నాడీఎంకేకు వత్తాసు పలికి సొంత పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, డీఎంకే పొత్తుపెట్టుకోవడంపై బుధవారం మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, డీఎంకే రెండునూ ఒక రాజకీయ లక్ష్యం లేని పార్టీలని దుయ్యబట్టారు. ఎన్ని కూటమిలు ఏర్పడినా అన్నాడీఎంకేను ఏమీ చేయలేవని అళగిరి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరుణానిధితో అళగిరి భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. -
కింగ్ మేకర్ రీ ఎంట్రీనా?
డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి మళ్లీ తెర మీదకొచ్చారు. నగారా మోగిన మరుక్షణం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే డీఎంకే అధిష్టానానికి హెచ్చరికలు ఇచ్చే వ్యాఖ్యల్ని మాజీ కింగ్ మేకర్ గురువారం సంధించారు. అలాగే, తమ కింగ్ మేకర్ రీ ఎంట్రీనా, తదుపరి కొత్త అడుగా అన్న ట్యాగ్‌లతో మద్దతుదారులు పోస్టర్లతో హల్చల్ సృష్టించే పనిలో పడ్డారు. సాక్షి, చెన్నై : డీఎంకే నుంచి ఆ పార్టీ అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు, మాజీ కేంద్ర మంత్రి ఎంకే అళగిరి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. అళగిరి బహిష్కరణతో, ఆయన సోదరుడు, దళపతి ఎంకే స్టాలిన్ డీఎంకేలో కీలకంగా అవతరించారు. అలాగే, అళగిరి మద్దతు దారులు అనేక మందిని తన వర్గీయులుగా మలచుకోవడంలో స్టాలిన్ సఫలీకృతులయ్యారు. గతంలో బహిష్కరణకు గురైన అళగిరి మద్దతు దారులు పలువురు తన వాళ్లుగా మారడంతో, వారికి మళ్లీ పార్టీలో చోటు కల్పించడం మొదలెట్టారు. రానున్న ఎన్నికల్ని టార్గెట్ చేసి మనకు..మనమే అన్న నినాదంతో స్టాలిన్ దూసుకెళుతుంటే, తన నూ ‘కరుణించేనా’అన్నట్టుగా అధినేత ప్రసన్నం కోసం అళగిరి విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఫలితం శూన్యం. గత నెల తన బర్త్‌డే సందర్భంగా డీఎంకే నుంచి ఏదేని ఆహ్వానం వస్తుందన్న ఆశతో అళగిరి ఎదురు చూశారు. తమ నేతకు ఆహ్వానం వస్తుందన్న ఆశతో అళగిరి వర్గీయులు పలువురు పోస్టర్లతో హల్చల్ సృష్టించినా, చివరకు మిగిలింది నిరాశే. ఈ పరిస్థితుల్లో తదుపరి అడుగు దిశగా అళగిరి వ్యూహ రచనల్లో పడ్డారు. అదే సమయంలో అళగిరి రీ ఎంట్రీనా...కొత్త అడుగా అన్న నినాదాన్ని అందుకుని పోస్టర్లతో హల్చల్కు మళ్లీ మద్దతు దారులు నిమగ్నమయ్యారు. ఈ సమయంలో మదురై నుంచి చెన్నైకు వచ్చిన అళగిరి డీఎంకే అధిష్టానానికి హెచ్చరికలు చేసే విధంగా కొత్త పల్లవి అందుకోవడం చర్చకు దారి తీసింది. నగారాతో నిర్ణయం : ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉన్న అళగిరి ఎట్టకేలకు ప్రత్యక్షం అయ్యారు. మదురై నుంచి చెన్నైకు వచ్చిన ఆయన్ను మీడియా విమానాశ్రయంలో చుట్టుముట్టింది. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. డిఎంకే నుంచి ఆహ్వానం లేని దృష్ట్యా, తమరి తదుపరి నిర్ణయం ఏమిటో అని మీడియా ప్రశ్నించగా, ఎన్నికల నగారా మోగనీయండి, తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని సమాధానం ఇవ్వడం గమనార్హం. అలాగే, తమరి మద్దతు దారుల్ని మళ్లీ అక్కున చేర్చుకుంటున్నారే..? అని ప్రశ్నించగా, తన మద్దతు దారులెవ్వర్నీ పార్టీ నుంచి ఇంత వరకు తొలగించ లేదని వ్యాఖ్యానించారు. అలా, తొలగించాల్సి వస్తే లక్షల్లో తన వాళ్లను డీఎంకే నుంచి తొలగించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండంటూ పరోక్షంగా పార్టీ అధిష్ఠానానికి హెచ్చరికలు చేసి ముందుకు సాగడం గమనించాల్సిన విషయమే. కాగా, పార్టీ అధినేత ప్రసన్నం కోసమే ఇక్కడికి అళగిరి వచ్చినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, కరుణానిధి కరుణించేనా అన్నది వేచి చూడాల్సిందే. -
మళ్లీ వార్తల్లోకి అళగిరి
డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. తన సోదరుడు, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్‌పై తనలో ఇంకా ఆవేశం రగులుతున్నట్టు చాటుకున్నారు. అధినేత కరుణానిధి లేకుంటే, డిఎంకే ఇక లేనట్టేనని వ్యాఖ్యానించారు. చెన్నై : డిఎంకే అధినేత ఎం కరుణానిధి తనయులు ఎంకే అళగిరి, ఎంకే స్టాలిన్ల మధ్య ఏళ్ల తరబడి వార్ సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. వారసత్వ సమరంలో గెలుపు ఎవరిదోనన్నంతగా పరిస్థితుల గతంలో నెలకొన్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు అన్నదమ్ముళ్ల మధ్య వివాదం ముదరడంతో చివరకు స్టాలిన్ వెనుక అధినేత ఎం. కరుణానిధి నిలబడక తప్పలేదు. అలాగే, పార్టీ నుంచి ఎంకే అళగిరిని బహిష్కరించారు. ఈ బహిష్కరణతో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు సాగిస్తూ వచ్చిన అళగిరి కొంత కాలంగా మౌనం వహించే పనిలో పడ్డారు. కుటుంబ పెద్దలు అన్నదమ్ముళ్ల మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు సాగుతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో అళగిరి మౌనంగా ఉండటం, అన్నయ్యకు వ్యతిరేకంగా స్టాలిన్ స్పందించక పోవడంతో ఇక వీరి వివాద పరిష్కారం కొలిక్కి వస్తుందన్న ప్రచారం బయలు దేరింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ఉన్న కరుణానిధికి అళగిరి రూపంలో ఏలాంటి చిక్కులు వస్తాయోనన్న ఉత్కంఠ సైతం డిఎంకే వర్గాల్లో నెలకొని ఉందని చెప్పవచ్చు. అయితే, అళగిరి మీడియాకు దూరంగా ఉండటంతో వ్యాఖ్యల వివాదాలకు ఆస్కారం లేకుండా వ చ్చింది. ఈ పరిస్థితుల్లో బుధవారం చెన్నైకు వచ్చిన అళగిరి మీడియా కంట పడడంతో తనకు స్టాలిన్ మీదున్న కోపం, ఆవేశం చల్లరాదలేదని చాటుకున్నారని చెప్పవచ్చు. స్టాలిన్‌పై సంధించిన ప్రశ్నకు తీవ్రంగానే స్పందించడం బట్టి చూస్తే, ఈ అళగిరి లో ఉన్న ఆక్రోశం అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేకు ముచ్చెమటలు పట్టిస్తాయన్న బెంగ ఆపార్టీ వర్గాల్లో బయలు దేరి ఉన్నది. కలలు కంటున్నాడు ఉదయం మదురై నుంచి చెన్నైకు వచ్చిన అళగిరిని మీడియా చుట్టముట్టింది. ప్రశ్నల వర్షం కురిపించింది. అన్నింటికీ సమాధానం ఇస్తూ తనలో ఉన్న ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వే గురించి ప్రస్తావిస్తూ, డిఎంకే అధికారంలోకి వచ్చేనా..? అని ప్రశ్నించగా, ఏ సర్వే...? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. స్టాలిన్ సీఎం పదవికి అర్హుడన్న ప్రచారం ఉందే, ఆయనకు డిఎంకే అధిష్టానం ఆ బాధ్యతలు అప్పగిస్తుందా..? అని ప్రశ్నించగా, స్టాలిన్ కలలు కంటున్నాడని మండిపడ్డారు. సీఎం కావాలని ఆయన కంటున్న కలలు కల్లేనని వ్యాఖ్యానించారు. డిఎంకే అధికారంలోకి రావాలంటే, అధినేత కరుణానిధి నేతృత్వం తప్పని సరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. డిఎంకే అంటే కరుణానిధి మాత్రమేనని వ్యాఖ్యానించారు. కరుణానిధి ఉన్నంత వరకే డిఎంకే ఉంటుందని, ఆయన లేకుంటే డీఎంకే లేదు అంటూ ముందుకు సాగడం గమనార్హం. -
సామరస్యం
సాక్షి, చెన్నై : డీఎంకేలో అధినేత కరుణానిధి రాజకీ య వారసత్వ సమరం సాగుతున్న విష యం తెలిసిందే. అన్నదమ్ముళ్ల మధ్య ముది రిన ఈ వివాదంలో చివరకు పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ పైచేయి సాధించారు. అన్నయ్య అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ వారసత్వ సమరం ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే డిపాజిట్లను గల్లంతు చేశాయని చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో ఎదురైన పరాభావంతో పార్టీ ప్రక్షాళనకు కరుణానిధి శ్రీకారం చుట్టక తప్పలేదు. అళగిరి మద్దతుదారుల్ని హెచ్చరించే విధంగా తాత్కాలిక బహిష్కరణ నినాదాన్ని కరుణానిధి అందుకున్నారు. అయినా, అళగిరి కాసింత కూడా వెనక్కి తగ్గలేదు. చివరకు అళగిరి రూపంలో పార్టీకి ఎదురవుతున్న సంక్లిష్ట పరిస్థితులను కరుణానిధి పరిగణనలోకి తీసుకున్నారు. ఇటీవల తన సతీమణి దయాళు అమ్మాల్ ద్వారా పెద్ద కుమారుడిని బుజ్జగించే యత్నం చేశారు. ఈ సమయంలో స్టాలిన్ సీఎం అభ్యర్థి ప్రచారం ఊపందుకోవడం డీఎంకేలో అంతర్యుద్ధాలకు వేది కగా మారింది. ఎట్టకేలకు స్టాలిన్ ద్వారానే ఆ ప్రచారానికి ముగింపు పలికిన కరుణానిధి, అళగిరి ఎపిసోడ్‌ను సుఖాంతం చేయడానికి సిద్ధమయ్యూరు. వెలుగులోకి కేపీ భేటీ: అళగిరి మద్దతుదారుడైన పార్టీ ఎంపీ, వ్యవసాయ సంఘం నేత కేపీ రామలింగం గురువారం డీఎంకే అధినేత కరుణానిధిని కలుసుకోవడం వెలుగులోకి వచ్చింది. అళగిరి దూతగా కేపీ సీఐటీ కాలనీ మెట్లు ఎక్కారని చెప్పవచ్చు. ఈ భేటీ అంతా అళగిరి వ్యవహారం గురించి సాగినట్టు డీఎంకే వర్గాలు స్పష్టం చేశాయి. తనకు మళ్లీ దక్షిణాది జిల్లా పార్టీ కార్యదర్శి పదవి అప్పగించాలని, సోదరి కనిమొళిని దక్షిణ, ఉత్తర జిల్లాల్లో ప్రచార బరిలోకి వాడుకోవాలన్న అళగిరి సూచనను కరుణానిధి ముందు కేపీ ఉంచినట్టు సమాచారం. కేపీతో గంటన్నరగా సాగిన చర్చ అనంతరం కరుణానిధి తగ్గినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. పెద్దకుమారుడిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించే రీతిలో సానుకూలతను కరుణానిధి వ్యక్తం చేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో అళగిరి రీ ఎంట్రీ అన్న ప్రచారం బయలు దేరింది. ఇదే విషయంగా కేపీని మీడియా కదిలించగా, తమ అధినేత ఇంటికి వెళ్లిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. అళగిరి వ్యవహారం గురించి చర్చించుకున్నామని, తండ్రి, తనయులు ఏకాభిప్రాయానికి వచ్చినట్టేనని పేర్కొంటూ, త్వరలో అళగిరికి అనుకూలంగా మంచి నిర్ణయం డీఎంకేలో వెలువడుతుందని ఆశిస్తున్నట్టు, ఆహ్వానం వస్తుందని భావిస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. చెన్నైకు పరుగు : కరుణతో భేటీ అనంతరం కేపీ మదురైకు వెళ్లారు. అక్కడ ఏ చర్చలు జరిగాయో ఏమోగానీ, హుటాహుటిన శనివారం ఉదయం చెన్నైకు అళగిరి విమానం ఎక్కేశారు. ఏక్షణానైన కరుణ నుంచి ఆహ్వానం వస్తుందన్న ఆశతో ఆయన ఇక్కడికి వచ్చారని సర్వత్రా భావిస్తున్నారు. ఇక, అళగిరి తనయుడు దురై దయానిధి శుక్రవారం తాతయ్య కరుణానిధిని కలుసుకోవడం ఆలోచించాల్సిందే. విమానాశ్రయం నుంచి వెలుపలకు వస్తున్న అళగిరి మీడియాను ఉద్దేశించి కొత్త సమాచారం ఏమీ ఈ రోజుకు తన వద్ద లేదని పేర్కొన్నారు. ఏదేని ఆహ్వానాలు ఉంటే, మీడియూకు తెలియకుండా ఉంటాయా? అంటూ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దీన్ని బట్టి చూస్తే, మరి కొద్ది రోజుల్లో అళగిరి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అన్నమాట! ఇక అళగిరి, కరుణ ఎపిసోడ్ సుఖాంతమైన పక్షంలో, స్టాలిన్ ఎపిసోడ్ ఏదైనా ఆరంభం అవుతుందా? అళగిరి రీ ఎంట్రీని స్టాలిన్ ఆహ్వానిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. జిల్లాల పర్యటనల్లో బిజీబిజీగా స్టాలిన్ ఉన్న సమయంలో కరుణానిధి చకచకా పావులు కదుపుతూ, తన రాజతంత్రాల్ని ప్రయోగిస్తుండటం విశేషం. -
రీ ఎంట్రీ?
►ఫలించిన తల్లి రాయబారం ►మెట్టుదిగిన అళగిరి ►ఓకే అంటున్న చిన్నోడు ►త్వరలో మళ్లీ డీఎంకేలోకి... సాక్షి, చెన్నై: డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి మళ్లీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నాయి అన్నా అరివాలయం వర్గాలు. తల్లి దయాళు అమ్మాల్ రాయబారం ఫలించడంతో పెద్దోడు అళగిరి, చిన్నోడు స్టాలిన్ త్వరలో ఏకం కానున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అళగిరి మెట్టు దిగడం, స్టాలిన్ ఓకే చెప్పడంతో మరికొద్ది రోజుల్లో పార్టీలోకి దక్షిణాది కింగ్ మేకర్ పునరాగమనం చేయనున్నట్లు చర్చ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ముందు డీఎంకే లో చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీని సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టాయి. అన్నదమ్ముళ్లు అళగిరి, స్టాలిన్ మధ్య వారసత్వ వివాదం చివరకు పార్టీకి గడ్డు పరిస్థితుల్ని తీసుకొచ్చిపెట్టాయి. అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించడం, ఆయన పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యవహరించడం వెరసి డీఎంకే డిపాజిట్లు రాష్ట్రంలో గల్లంతయ్యాయి. పరిస్థితి దారుణంగా తయారు కావడంతో ప్రక్షాళన పర్వానికి శ్రీకారం చుట్టిన అధినేత ఎం కరుణానిధి, తన అస్త్రాల్ని ప్రయోగించే పనిలో పడ్డారు. అదే సమయంలో అళగిరి రూపంలో మున్ముందు పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లుతుందోనన్న బెంగ మొదలైంది. దీంతో పార్టీకి, కుటుంబానికి వస్తున్న అపవాదులు సమసిపోయే రీతిలో వ్యూహాత్మకంగా కరుణానిధి వ్యవహరించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఫలించిన రాయబారం: అళగిరిని బుజ్జగించడం లక్ష్యంగా తల్లి దయాళు అమ్మాల్ రంగంలోకి దిగారు. కొద్ది రోజు లుగా అళగిరితో ఆమె సంప్రదింపులు జరుపుతున్నట్టు, తరచూ ఫోన్‌ద్వారా తనయుడి అలక తీర్చే పనిలో పడ్డట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్నాళ్లు మౌనంగా ఉండాలంటూ అళగిరికి తల్లి సూచించినట్టు, ఇక మీదట మౌనంగా ఉంటే, పార్టీలోకి మళ్లీ తీసుకుంటారన్న సంకేతాన్ని ఆయనకు పంపించారు. అసెంబ్లీ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంతో పెద్దోడిగా శ్రమించాల్సిన అవసరం ఉందని ఆమె హితవు పలికినట్టు సమాచారం. అదే సమయంలో చిన్నోడు స్టాలిన్‌కు నచ్చ చెప్పే పనిలో అటు కరుణానిధి, ఇటు దయాళు అమ్మాల్ సఫలీ కృతలైనట్టు తెలిసింది. త్వరలోనే: అన్న దమ్ముళ్ల మధ్య ఉన్న వైర్యాన్ని సామరస్య పూర్వకంగా కొలిక్కి తీసుకురావడంతో, ఇక అళగిరి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అన్న ప్రచారం డీఎంకేలో ఊపందుకుంటోంది. అళగిరి మౌనంగా ఉంటే, తాను మౌనంగా ఉంటానని, పార్టీ కోసం తాను ఇన్నాళ్లు జరిగిన పరిణామాల్ని మరిచి పోతున్నట్టుగా స్టాలిన్ పేర్కొనట్టుగా పార్టీలో చర్చ సాగుతోంది. అళగిరి రీ ఎంట్రీకి స్టాలిన్ ఓకే చెప్పినట్టు సంకేతాలున్నాయి. తల్లి రాయబారానికి దిగొచ్చిన అళగిరి తన మద్దతుదారులతో సంప్రదింపుల్లో నిమగ్నమయ్యారు. తమ నేత డీఎంకేలో ఏదో ఒక రోజు మళ్లీ వస్తారన్న ఆశతో ఇన్నాళ్లు ఎదురు చూస్తూ వచ్చామని, అది జరగనుండడం ఆనందంగా ఉందని అళగిరి మద్దతు నాయకుడు ఒకరు పేర్కొన్నారు. అన్నదమ్ములు ఇద్దరు కలసి కట్టుగా కృషి చేయడం వల్లనే గతంలో అనేక ఎన్నిక ల్లో డీఎంకే విజయ ఢంకా మోగించిందని, మళ్లీ ఇద్దరూ ఏకమైతే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తిరుగు ఉండదంటూ స్టాలిన్ మద్దతు నాయకుడు పేర్కొంటుండటం బట్టి చూస్తే, త్వరలో అళగిరి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే అనిపిస్తుంది. -
డీఎంకే పార్టీ అభ్యర్థిని మట్టికరిపించండి: ఆళగిరి
ఉసిలమ్ పట్టి: డీఎంకే అభ్యర్థిని ఓడించాలంటూ బహిష్కృత నేత, కరుణానిధి కుమారుడు అళగిరి సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. థేనీ లోకసభ స్థానం నుంచి పోటి చేస్తున్న పోన్ ముతురామలింగంను మట్టికరిపించాలని కార్యకర్తలకు అళగిరి సూచించారు. అంతేకాకుండా థేని నియోజకవర్గంలో పోన్ ముత్తురామలింగంను నాలుగవ స్థానానికి పరమితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బంధువును కోల్పోయిన ఓ కార్యకర్తను పరామర్శించడానికి ఉసిలమ్ పట్టి గ్రామంలో పర్యటించారు. ఉసిలమ్ పట్టి గ్రామంలో ఆళగిరికి ఘనస్వాగతం పలికిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. లౌకికవాద పార్టీగా రుజువు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని కరుణానిధి చేసిన వ్యాఖ్యలపై ఆళగిరి మాట్లాడానికి నిరాకరించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న డీఎంకే పార్టీ ప్రస్తుతం ఆపార్టీతో పొత్తుకు దూరంగా ఉంది. పార్టీ నియమ నిబంధనల్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆళగిరిని పార్టీని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ప్రధానిగా మోడీని స్వాగతించాల్సిందే: ఆళగిరి
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి బహిష్కృత డీఎంకే పార్టీ ఎంపీ ఎంకే అళగిరి ప్రశంసలతో ముంచెత్తారు. భారత ప్రధానిగా మోడీకి ఎక్కువ అవకాశాలున్నాయని అళగిరి అన్నారు. దేశమంతటా మోడీ హవా నడుస్తోందన్నారు. అంతేకాకుండా మోడీ పరిపాలనాధ్యక్షుడు అని అన్నారు. ప్రధాని అభ్యర్థిగా మోడీని స్వాగతించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. జనవరి మాసంలో అళగిరిని డీఎంకే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవల ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో భేటి అవ్వడం రాజకీయంగా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే స్వంత పార్టీ పెడుతున్నారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. కొందరు మోసగాళ్ల చేతిలో డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి బందీ అయ్యారని ఆయన అన్నారు. -
'రజనీకాంత్ నాకు మంచి స్నేహితుడు'
చెన్నై: ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ తనకు మంచి స్నేహితుడని డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరి అన్నారు. శుక్రవారం రజనీకాంత్ నివాసంలో ఆయనను అళగిరి కలిశారు. భేటీ అనంతరం అళగిరి మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు దయానిధి అళగిరి సినిమా కార్యక్రమానికి రావాలని రజనీకాంత్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. వ్యక్తిగత విషయాలను చర్చించామని, తమ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు లేవని అళగిరి స్పష్టం చేశారు. కాగా డీఎంకే తనకు ఎంపీ టిక్కెట్ నిరాకరించిన నేపథ్యంలో అళగిరి సొంతంగా కొత్త పార్టీ పెడుతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిశారు. అయితే రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తానని చెప్పిన ఆయన, ఎటువంటి పాత్ర పోషిస్తాననేది ఇప్పుడే వెల్లడించబోనని అన్నారు. తన మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటానని చెప్పారు. -
అన్నయ్య భేటీపై స్పందించని తమ్ముడు
చెన్నై: తన అన్నయ్య ఎంకే అళగిరి.. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలవడాన్ని అప్రాధాన్య వార్తగా కొట్టిపారేశారు ఆయన తమ్ముడు స్టాలిన్. అనవసరమైన వార్తలు చదవనని, అవసరంలేని వాటి గురించి పట్టించుకోనని చెప్పారు. అనవసర వార్తల గురించి చర్చించనని స్పష్టం చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో అళగిరి భేటీ గురించి అడిగినప్పుడు ఆయనీవిధంగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అళగిరికి డీఎంకే పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రధానితో ఆయన భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు సొంతంగా పార్టీ పెట్టేందుకు మద్దతుదారులతో అళగిరి చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ్ముడితో వారసత్వ పోరుగా కారణంగానే ఆయనకు టిక్కెట్ దక్కలేదు. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు అళగిరిపై డీఎంకే సస్పెన్షన్ వేటు కూడా వేసింది. -
కొత్త పార్టీపై అళగిరి నో కామెంట్
న్యూఢిల్లీ: డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరి.. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిశారు. మర్యాదపూర్వకంగానే ప్రధానమంత్రిని కలిసినట్టు అళగిరి చెప్పారు. 2009 నుంచి 2013 వరకు కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపానని వెల్లడించారు. డీఎంకే తనకు ఎంపీ టిక్కెట్ నిరాకరించిన నేపథ్యంలో సొంతంగా కొత్త పార్టీ పెడుతున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించేందుకు అళగిరి నిరాకరించారు. అయితే రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తానని చెప్పారు. ఎటువంటి పాత్ర పోషిస్తాననేది ఇప్పుడే వెల్లడించబోనని అన్నారు. తన మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటానని చెప్పారు. తండ్రి, సోదరుడిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అళగిరి.. ప్రధానమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
అళగిరిని పక్కన పెట్టిన డీఎంకే
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను డీఎంకే పార్టీ ఖరారు చేసింది. 35 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకె అళగిరికి ఇందులో చోటు దక్కలేదు. పార్టీ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో అళగిరిని జనవరిలో తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సోదరుడు స్టాలిన్‌తో వారసత్వ పోరు సాగిస్తున్న అళగిరి ఇంతకుముందు తండ్రిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అళగిరికి టికెట్ వస్తుందా, రాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. తొలి జాబితాలో ఈ జాబితాలో కరుణానిధి తనయుడు 8 మంది సిట్టింగ్ అభ్యర్థులకు మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించారు. 2జీ స్పెక్ట్రం కేసులో నిందితులు, టెలికం మాజీ మంత్రులు ఎ. రాజా, దయానిధి మారన్‌లకు టికెట్లు దక్కాయి. నీలగిరి నుంచి రాజా, చెన్నై సెంట్రల్ నుంచి మారన్ పోటీ చేయనున్నారు. -
ఇంటి గుట్టు రట్టు చేస్తా!
డీఎంకె పార్టీలో అన్నదమ్ముల మధ్య మొదలయిన వారసత్వ పోరు తారాస్థాయికి చేరింది. పెద్దాయిన తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే దానిపై తమిళనాట రాజుకున్న రాజకీయ రగడ వీధికెక్కింది. దీంతో రంగంలోకి దిగిన రాజకీ య కురువృద్ధుడు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పెద్ద కొడుకు అళగిరిపై వేటు వేయడం ద్వారా డీఎంకె అధినేత ఎం కరుణానిధి తన చిన్న కుమారుడు స్టాలిన్‌కు మార్గం సుగమం చేశారు. తన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా చిన్న కుమారుడే బాధ్యలు చేపడతాడన్న సంకేతాలిచ్చారు. అన్నదమ్ముల ఆధిపత్య పోరుకు ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలని భావించి కరుణానిధి అదునుచూసి పెద్ద కుమారుడికి చెక్ పెట్టారు. క్రమశిక్షణ ఉల్లంఘించారనే నెపంతో ఆళగిరిని పార్టీ నుంచి సాగనంపారు. ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుంచి ఉద్వాసన పలికారు. సినీ నటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో పొత్తు ప్రతిపాదనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. అయితే ఈ ఎడబాటు తాత్కాలికమేనని మెలిక పెట్టారు. ఆళగిరిపై వేటు వేయడం ద్వారా పార్టీ ముందు అందరూ సమానమే అని పెద్దాయన సంకేతాలిచ్చారు. అదే సమయంలో ఆళగిరికి పూర్తిగా తలుపులు మూసివేయకుండా జాగ్రత్త పడ్డారు. స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తే ఆళగిరికి మళ్లీ పార్టీలోకి ద్వారాలు తెరుచుకునే అవకాశాన్ని సజీవంగా ఉంచారు. ఆళగిరి సస్పెన్షన్‌తో అటు స్టాలిన్ కూడా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే సొంత కొడుకులపై చర్య తీసుకునేందుకు వెనుకాడబోనన్న సంకేతాలిచ్చారు. తద్వరా అన్నదమ్ముల ఆధిపత్య పోరుకు తాత్కాలికం బ్రేకు వేశారు. అయితే తనను అవమానించిన తండ్రి, సోదరుడుపై ఆళగిరి కారాలు-మిరియాలు నూరుతున్నారు. స్టాలిన్ చేతిలో కరుణానిధి కీలుబొమ్మగా మారారని ఘాటుగా విమర్శించారు. స్టాలిన్ పదవీ కాంక్షాపరుడు, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే మట్టి కరవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ నెల 31న ప్రెస్‌మీట్ పెట్టి డీఎంకే లొసుగుల చిట్టా విప్పుతానన్నారని హెచ్చరించారు. తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన డీఎంకే అధినేత సొంత సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాలి. -
కరుణ పార్టీలో కల్లోలం
చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎంకే అధినేత కరుణానిధికి కుడి ఎడమ భుజాలుగా వ్యవహరిస్తున్న స్టాలిన్, అళగిరి మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది. కరుణ హుషారుగా రాజకీయూలు నడిపినపుడు ఏదోరకంగా వారిని సమన్వయం చేసేవారు. వృద్ధాప్యం కారణంగా కరుణ రానురానూ బలహీన పడటంతో వారసత్వ అంశం తెరపైకి వచ్చింది. కరుణతో సన్నిహితంగా మెలిగే స్టాలిన్‌కే పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం వచ్చింది. ఈ ప్రచారాన్ని బలపరుస్తున్నట్లుగా కరుణ సైతం గత ఏడాది ఒక సమావేశంలో స్టాలిన్ నా వారసుడు ఎందుకు కాకూడదురూ. అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అళగిరి శిబిరంలో దుమారం లేపారయి. పార్టీ ఆధిపత్యం కోసం అళగిరి వడివడిగా అడుగులు వేయడం ప్రారంభించారు. అళగిరికి చెక్‌పెట్టే అవకాశం ఎదురుచూస్తున్న స్టాలిన్ మధురై రాజకీయాలను సద్వినియోగం చేసుకున్నారు. పార్టీకి అళగిరే దిక్కు అన్నరీతిలో ఆయన అనుచరులు వేసిన పోస్టర్లను ఎత్తిచూపడం ద్వారా సస్పెన్షన్ వరకు రాజకీయాన్ని నడిపి అళగిరి అడ్డు తొలగించుకున్నారు స్టాలిన్. అళగిరి బ్యాంకాక్‌లో ఉన్న తరుణంలోనే ఆయన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చే శారు. ఇందుకు కారణాలు ఏమిటని కరుణను అళగిరి ప్రశ్నించినపుడు ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అక్కడ ఉన్న అళగిరి కుమార్తె కియల్విళి ఇద్దరినీ సమాధాన పరిచినట్లు తెలుస్తోంది. తండ్రీ, కూతుళ్లు వెళ్లిపోగానే స్టాలిన్, పార్టీ నేత వీరమణి అక్కడికి చేరుకుని కరుణతో మాట్లాడారు. వెనువెంటనే అళగిరిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు వెలువడడంతో స్టాలిన్ తెరవెనుక రాజకీయం నెరిపారని ప్రచారం జరిగింది. కరుణ సతీమణి దయాళుఅమ్మాళ్ సైతం అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదిర్చేదని, అవసరమైతే భర్త కరుణానిధికి నచ్చజెప్పేది. అయితే ఇటీవల ఆమె తీవ్ర అస్వస్థతలో పడిపోవడం, జ్ఞాపకశక్తి, వినికిడి శక్తిని కోల్పోడం అళగిరిని ఇబ్బందుల్లోకి నెట్టినట్లు తెలుస్తోంది. నిప్పులు చెరిగిన అళగిరి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన అళగిరి శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తండ్రి కరుణానిధి, సోదరుడు స్టాలిన్‌పైనా నిప్పులు చెరిగారు. స్టాలిన్ కేవలం కోశాధికారి మాత్రమేన న్న విచక్షణ మరిచి అధినేతలా వ్యవహరిస్తుంటే, అధినేత కరుణానిధి కోశాధికారి చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని విమర్శించారు. పార్టీ తరపున పోస్టర్లు వేయకూడదంటూ ఎక్కడా చట్టం లేదే, అలాగైతే స్టాలిన్ కాబోయే అధినేత అంటూ పోస్టర్లు వెలిసినపుడు ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ పరంగా తాను ఏ తప్పు చేయలేదు, తప్పు చేయనపుడు క్షమించమని కోరడం అనవసరం అన్నారు. అళగిరితో తనకు విబేధాలు లేవని స్టాలిన్ ప్రకటించడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ, అతను పదవీ కాంక్షాపరుడు, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడని వ్యాఖ్యానించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఎన్ని అవకతవకలు జరిగాయో తనకు తెలుసన్నారు. వాటిని ఈనెల 31వ తేదీన ఆధారాలతో సహా బహిరంగ పరుస్తానని చెప్పాడు. ఈనెల 30వ తేదీన మదురైలో జరిగే తన జన్మదినోత్సవ వేదికపై భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. తనను తప్పించడం ద్వారా డీఎండీకేతో పొత్తు ఖరారైనా ఈ కూటమి వల్ల ఎవరికీ లాభం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోలాగా రెబల్ అభ్యర్థులను నిలబెడతారా అని మీడియా ప్రశ్నించగా, అంత అవసరం లేదు, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే మట్టి కరవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను లోక్‌సభకు పోటీచేయడం లేదని ప్రకటించారు. -
కరుణానిధిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
-
కరుణానిధిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
సొంత పార్టీ డీఎంకేపై విమర్శలు గుప్పించి బహిష్కరణకు గురై 24 గంటలు గడవక ముందే కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తొలిసారిగా శనివారం ఓ ఆంగ్ల టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అళగిరి మాట్లాడారు. డీఎంకేలో ప్రజాస్వామ్యం ఎక్కడేడ్చిందనిదంటూ ఆ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని మాత్రమే డిమాండ్ చేశానని, అంతేకాని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు. తన తండ్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధిని కొంత మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అళగిరి ఈ సందర్భంగా ఆరోపించారు. సినీ నటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో పొత్తు ప్రతిపాదనకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలకు దిగిన అళగిరిపై ఆయన తండ్రి, డీఎంకే అధినేత కరుణానిధి సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుంచి ఆయనను తప్పిస్తున్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరికి, చిన్న కుమారుడు స్టాలిన్ల నడుమ పార్టీలో అధిపత్య కోసం చేసే పోరు పతాక స్థాయికి చేరింది. తమిళ హీరో విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకేతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలని డీఎంకే ఉవ్విళ్లూరుతుంది. కాగా అదే స్థాయిలో బీజేపీ కూడా విజయ్ కాంత్ పార్టీతో పొత్తుకు సై అంటుంది. అయితే డీఎండీకేతో పొత్తు తమకు కలిసొస్తుందని భావించిన డీఎంకే అధినేత కరుణానిధి, ఇప్పటికే ఆ పార్టీతో మంతనాలు పూర్తి చేశారు. కరుణ వ్యూహం అమలు కానున్న తరుణంలో ఆయన పెద్ద కుమారుడు, మదురై ఎంపీ అళగిరి ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌కాంత్‌పై విమర్శలకు దిగారు. విజయకాంత్‌ను రాజకీయ నేతగా పరిగణించబోనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో విజయ్‌కాంత్‌పై ఈ వ్యాఖ్యలు చేసినందుకు అళగిరిని కరుణ ఈనెల 7న తీవ్రంగా మందలించారు. పొత్తులపై పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకిస్తే చర్యలు తప్పవని తన నివాసంలో కలసిన అళగిరిని కరుణానిధి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆ భేటీ అయిన కొద్ది సేపటికే అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కరుణానిధి ప్రకటించారు. ఆ ప్రకటనపై స్టాలిన్ వర్గం హర్షం వ్యక్తం చేసింది. అళగిరి వర్గం మాత్రం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోందంటూ ఆగ్రహం వెళ్లకక్కింది.