ఇక మౌనమే!
ఇన్నాళ్లు దూకుడుగా వ్యవహరించిన డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి ఇక మౌనం పాటించేందుకు నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ తన మద్దతు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇదే తన మద్దతు దారులకూ వర్తిస్తుందని ప్రకటించారు.
సాక్షి, చెన్నై:డీఎంకే నుంచి అళగిరి బహిష్కరించబడ్డ విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో అళగిరి వ్యవహరించిన తీరుతో డీఎంకే చావు దెబ్బ తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఎన్నికల్లో ఆయన మద్దతు కోసం బీజేపీ కూటమి తీవ్రంగానే కుస్తీలు పట్టాయి. కొందరు అభ్యర్థులు వ్యక్తిగతంగా అళగిరితో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో చావు దెబ్బతో డీఎంకే డిపాజిట్లు గల్లంతు అయ్యేందుకు అళగిరి కూడా ఓ కారకుడిగా చెప్పవచ్చు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో ముందుకు సాగుతూ వచ్చిన అళగిరి రూపంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ చిక్కులు మళ్లీ ఎదురు అవుతాయో అన్న బెంగ డీఎంకేకు తప్పలేదు.
అదే సమయంలో గత నెల మీడియాతో మాట్లాడుతూ తన దారి ఏమిటో ఎన్నిక నామినేషన్ల పర్వం లోపు తేలుతుందని, అంత వరకు వేచి చూడాల్సిందే అన్న అళగిరి వ్యాఖ్య ఉత్కంఠకు దారి తీసింది. అళగిరి వ్యవహార శైలి ఎలా ఉండబోతోందో అన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇక ఏడాదిన్నరగా కరుణానిధి అనుమతి కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన అళగిరికి ఈ సారి గోపాలపురంలో భేటీకి అవకాశం దొరికింది.
గత వారం కరుణానిధితో భేటీ కావడం, ఈ భేటీ గురించి స్టాలిన్ సైతం మౌనం వహించడంతో ఇక అళగిరి బెడద తీరినట్టే అన్న ఆనందం డీఎంకే వర్గాల్లో నెలకొంది. ఒకటి కాదు, ఏకంగా రెండు సార్లు, వారం వ్యవధిలో కరుణానిధితో అళగిరి భేటీ కావడంతో, దక్షిణ తమిళనాడులో గెలుపు బాధ్యతల్ని భుజాన వేసుకుంటారేమో అన్న చర్చ బయల్దేరింది. అయితే అళగిరి కోట మధురై నుంచే స్టాలిన్ ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో ఆ చర్చ కాస్త సద్దుమణిగింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు దూరంగా ఉండడం మంచిదన్న నిర్ణయానికి అళగిరి వచ్చి ఉన్నారు. దూకుడుగా వ్యవహరించి నోరు జారడం కన్నా, మౌనం పాటించడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చి ఉన్నారు.
ఎప్పుడూ మీడియా సంధించే ప్రశ్నలకు ఘాటుగా స్పందించే అళగిరి మంగళవారం శాంత స్వభావంతో ఒకే సమాధానం ఇచ్చి ముందుకు సాగడం విశేషం. చెన్నై నుంచి మధురైకు వెళ్తూ, మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియా చుట్టుముట్టడంతో స్పందించారు. మీడియా పలు ప్రశ్నల్ని సందించినా స్పందన లేదు. ఈ ఎన్నికల్లో తానెవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని, ఇది తన మద్దతుదారులకూ వర్తిస్తుందంటూ ముందుకు సాగడం విశేషం. ఎన్నికల్లో ఎవరి కోసం పనిచేయాల్సిన అవసరం లేదని పరోక్షంగా తమ మద్దతుదారుల కోసం ఈ వ్యాఖ్య చేసి ముందుకు కదిలారు.