అళగిరికి మద్దతుగా మహిళలు
మదురై వేదికగా ఆదివారం డీఎంకే బహిష్కృత నేత అళగిరి తనలోని ఆక్రోశాన్ని , ఆవేదనను వెల్లగక్కారు. డీఎంకే అధ్యక్షుడు, సోదరుడు స్టాలిన్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను ఏ తప్ప చేశానో, ఏ ద్రోహం చేశానో సమాధానం ఇవ్వాలని ప్రశ్నించారు. ఎన్నో అవమానాలు భరించాను, ఇక ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడతారాని మద్దతుదారుల్ని ఉద్దేశించి అళగిరి వ్యాఖ్యలు చేశారు.
సాక్షి, చెన్నై: అళగిరి ఆదివారం మదురైలో మద్దతుదారులతో భేటీ అయ్యారు. ఇదో బల ప్రదర్శనకు వేదిక అన్నట్టుగా మారింది. కలైంజర్ డీఎంకే ఆవిర్భావానికి సమయం ఆసన్నమైనట్టుగా మద్దతుదారులు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నాయకత్వానికి సిద్ధం కావాలని అళగిరికి పిలుపునిచ్చారు. అయితే, అళగిరి మాత్రం తనలోని ఆక్రోశాన్ని వెల్లగక్కే రీతిలో ఈ వేదికను అస్త్రంగా చేసుకున్నారు.
మాట్లాడుతున్న అళగిరి
మొదటి నుంచి తొక్కుడే..
ఎన్నో ఒడిదొడుగుల్ని డీఎంకే ఎదుర్కొందని గతాన్ని గుర్తు చేస్తూ వివరించారు. ఆది నుంచి తనను రాజకీయంగా తొక్కడానికి జరిగినా, తాను పెద్దగా పట్టించుకోలేదన్నారు. తిరుమంగళం ఉపఎన్నికలో గెలుపు తర్వాత తాను వద్దని మారాం చేసినా, బలవంతంగా దక్షిణ తమిళనాడు పార్టీ నిర్వాహక కార్యదర్శి పదవిని అప్పగించారని గుర్తు చేశారు. దక్షిణ తమిళనాడు మీద పూర్తి పట్టు సాధించి పార్టీకి తిరుగు లేని విజయాల్ని దరిచేర్చినట్టు గుర్తు చేశారు.
పదవుల్ని దరి చేర్చిందే నేనే..
తన తండ్రి కరుణానిధితో మాట్లాడి స్టాలిన్‌కు కోశాధికారి పదవి ఇప్పించింది తానే అని, ఓ సారి స్టాలిన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. అంతే కాదు, తన ఇంటికి తమ్ముడు కుటుంబంతో సహా వచ్చిన సమయంలో కలైంజర్(తండ్రి) తర్వాత పార్టీకి అన్నీ నువ్వే, నువ్వే నడిపించాలని ఆ సమయంలోనే తాను భుజం తట్టి పంపించానని పేర్కొన్నారు. పదవుల కోసం తాను ఎన్నడూ పాకులాడ లేదని, కేంద్ర మంత్రి పదవిని సైతం తాను బలవంతంగానే చేపట్టాల్సి వచ్చిందన్నారు. స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి రావడంలో, ఎందరికో మంత్రి పదవులు దరి చేర్చడంలో తన సహకారం ఉందని వివరించారు. పార్టీ కోసం ఓ కార్యకర్తగా శ్రమించిన తాను ఏదో తప్పు చేసినట్టుగా, ద్రోహం చేసినట్టుగా చిత్రీకరించి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ్ముడి ఎదుగుదలను తాను ఆనందించానే గానీ, ఎన్నడూ ఈర్ష్య పడలేదన్నారు. అయితే, ఆయన (స్టాలిన్) అందుకు భిన్నంగా వ్యవహరించి తనను, తన వాళ్లను డీఎంకేకు దూరం చేశారని ఉద్వేగానికి లోనయ్యారు.
బలహీన పరిచారు..
వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని కలైంజర్ స్పష్టం చేస్తే, బలవంతంగా ఆయన్ను తిరువారూర్ నుంచి 2016లో పోటీ చేయించి బలహీనుడ్ని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కావాలన్న ఆశతో స్టాలిన్ ఉన్నాడని, ఇది జరగదని, ఆ పదవిలోకి ఆయన వచ్చే ప్రసక్తే లేదన్నారు. ఏడు సంవత్సరాలు మౌనంగా ఉన్నానని, ఇక, తాను ఏ నిర్ణయం తీసుకున్నా, వెన్నంటి ఉంటారా అని మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment