కరుణ పార్టీలో కల్లోలం | DMK party chief M Karunanidhi suspends his son MK Alagiri from the party | Sakshi
Sakshi News home page

కరుణ పార్టీలో కల్లోలం

Published Sat, Jan 25 2014 11:15 PM | Last Updated on Fri, Sep 28 2018 7:30 PM

DMK party chief M Karunanidhi suspends his son MK Alagiri from the party

 చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎంకే అధినేత కరుణానిధికి కుడి ఎడమ భుజాలుగా వ్యవహరిస్తున్న స్టాలిన్, అళగిరి మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది. కరుణ హుషారుగా రాజకీయూలు నడిపినపుడు ఏదోరకంగా వారిని సమన్వయం చేసేవారు. వృద్ధాప్యం కారణంగా కరుణ రానురానూ బలహీన పడటంతో వారసత్వ అంశం తెరపైకి వచ్చింది. కరుణతో సన్నిహితంగా మెలిగే స్టాలిన్‌కే పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం వచ్చింది. ఈ ప్రచారాన్ని బలపరుస్తున్నట్లుగా కరుణ సైతం గత ఏడాది ఒక సమావేశంలో స్టాలిన్ నా వారసుడు ఎందుకు కాకూడదురూ. అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అళగిరి శిబిరంలో దుమారం లేపారయి. పార్టీ ఆధిపత్యం కోసం అళగిరి వడివడిగా అడుగులు వేయడం ప్రారంభించారు. అళగిరికి చెక్‌పెట్టే అవకాశం ఎదురుచూస్తున్న స్టాలిన్ మధురై రాజకీయాలను సద్వినియోగం చేసుకున్నారు. పార్టీకి అళగిరే దిక్కు అన్నరీతిలో ఆయన అనుచరులు వేసిన పోస్టర్లను ఎత్తిచూపడం ద్వారా సస్పెన్షన్ వరకు రాజకీయాన్ని నడిపి అళగిరి అడ్డు తొలగించుకున్నారు స్టాలిన్. అళగిరి బ్యాంకాక్‌లో ఉన్న తరుణంలోనే ఆయన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చే శారు.
 
 ఇందుకు కారణాలు ఏమిటని కరుణను అళగిరి ప్రశ్నించినపుడు ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అక్కడ ఉన్న అళగిరి కుమార్తె కియల్‌విళి ఇద్దరినీ సమాధాన పరిచినట్లు తెలుస్తోంది. తండ్రీ, కూతుళ్లు వెళ్లిపోగానే స్టాలిన్, పార్టీ నేత వీరమణి అక్కడికి చేరుకుని కరుణతో మాట్లాడారు. వెనువెంటనే అళగిరిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు వెలువడడంతో స్టాలిన్ తెరవెనుక రాజకీయం నెరిపారని ప్రచారం జరిగింది. కరుణ సతీమణి దయాళుఅమ్మాళ్ సైతం అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదిర్చేదని, అవసరమైతే భర్త కరుణానిధికి నచ్చజెప్పేది. అయితే ఇటీవల ఆమె తీవ్ర అస్వస్థతలో పడిపోవడం, జ్ఞాపకశక్తి, వినికిడి శక్తిని కోల్పోడం అళగిరిని ఇబ్బందుల్లోకి నెట్టినట్లు తెలుస్తోంది.
 
 నిప్పులు చెరిగిన అళగిరి
 పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన అళగిరి శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తండ్రి కరుణానిధి, సోదరుడు స్టాలిన్‌పైనా నిప్పులు చెరిగారు. స్టాలిన్ కేవలం కోశాధికారి మాత్రమేన న్న విచక్షణ  మరిచి అధినేతలా వ్యవహరిస్తుంటే, అధినేత కరుణానిధి కోశాధికారి చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని విమర్శించారు. పార్టీ తరపున పోస్టర్లు వేయకూడదంటూ ఎక్కడా చట్టం లేదే, అలాగైతే స్టాలిన్ కాబోయే అధినేత అంటూ పోస్టర్లు వెలిసినపుడు ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ పరంగా తాను ఏ తప్పు చేయలేదు, తప్పు చేయనపుడు క్షమించమని కోరడం అనవసరం అన్నారు. అళగిరితో తనకు విబేధాలు లేవని స్టాలిన్ ప్రకటించడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ, అతను పదవీ కాంక్షాపరుడు, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడని వ్యాఖ్యానించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఎన్ని అవకతవకలు జరిగాయో తనకు తెలుసన్నారు. వాటిని ఈనెల 31వ తేదీన ఆధారాలతో సహా బహిరంగ పరుస్తానని చెప్పాడు. ఈనెల 30వ తేదీన మదురైలో జరిగే తన జన్మదినోత్సవ వేదికపై భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. తనను తప్పించడం ద్వారా డీఎండీకేతో పొత్తు ఖరారైనా ఈ కూటమి వల్ల ఎవరికీ లాభం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోలాగా రెబల్ అభ్యర్థులను నిలబెడతారా అని మీడియా ప్రశ్నించగా, అంత అవసరం లేదు, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే మట్టి కరవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను లోక్‌సభకు పోటీచేయడం లేదని ప్రకటించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement