సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘నాన్న పిలిస్తే పార్టీలోకి వస్తా’ అని అళగిరి చెప్పారు. గురువారం మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ మాట చెప్పారు. గతంలో కూడా అనేకసార్లు ఇదే చెప్పానని గుర్తు చేశారు. డీఎంకేలో స్వయానా అన్నదమ్ములైన అళగిరి, స్టాలిన్ మధ్య ఎంతో కాలంగా ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. మదురై కేంద్రంగా దక్షిణ తమిళనాడులో పార్టీపై పట్టుపెంచుకుని అళగిరి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకున్నారు. పెద్ద కుమారుని హోదాలో పార్టీ వారసుడిగా తననే ప్రకటించాలని అళగిరి పట్టుపట్టారు. అయితే వారసత్వానికి వయసు ఒక్కటే అర్హత కాదని, రాజకీయ పరిణితి, చతురతలకే ప్రాధాన్యత అనే కోణంలో కరుణానిధి తన చిన్న కుమారుడు స్టాలిన్‌కే పట్టం కట్టేందుకు ఉత్సాహం చూపారు.
దీంతో అళగిరి అనేకసార్లు తండ్రిపై తిరుగుబాటు ప్రదర్శించారు. తల్లి చేత సిఫార్సు చేయించారు. అయితే తన నిర్ణయం నుంచి వెనక్కు తగ్గని కరుణానిధి రెండేళ్ల క్రితం ఒకానొక సందర్భంలో అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించేశారు. దీంతో అగ్గిమీద గుగ్గిలమైన అళగిరి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకి వ్యతిరేకంగా వ్యవహరించడమేగాక, అధికారంలోకి రాదంటూ బహిరంగంగా వ్యాఖ్యానాలు చేశారు. అళగిరిపై వేటుపడిన తరువాత స్టాలిన్‌ని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించారు. వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న దశలో అళగిరి తల్లిదండ్రుల పరామర్శల పేరుతో మరలా రాయబారం ప్రారంభించారు.
గోపాలపురంలో అళగిరి
డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి వృద్ధాప్య అనారోగ్య కారణాలతో చెన్నై గోపాలపురంలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సుమారు ఏడాదిన్నర కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా మెలుగుతున్నారు. వీవీఐపీలను మాత్రమే కలుస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించిన తరువాత రజనీకాంత్, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ తదితరులు ఇటీవల కాలంలో కరుణను కలుసుకున్నారు. నాలుగురోజుల క్రితం అర్ధరాత్రి వేళ డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయానికి సైతం కరుణ వచ్చారు. గతంలో పోల్చుకుంటే ఎంతో మెరుగైన రీతిలో కరుణ స్పందిస్తున్నారు. నెమ్మదిగా మాట్లాడుతున్నారు. ఈ దశలో కరుణానిధిని చూసేందుకు ఆయన పెద్ద కుమారుడు అళగిరి బుధవారం గోపాలపురానికి వచ్చారు.
ఆయనతోపాటు సతీమణి కాంతి, కుమారుడు దురైదయానిధి కూడా వచ్చారు. తల్లి దయాళూఅమ్మల్ వద్ద సుమారు 15 నిమిషాలు మాట్లాడారు. ఆ తరువాత మిద్దెపైకి వెళ్లి తండ్రి కరుణానిధిని కుటుంబంతో సహ కలిసివచ్చారు. మొత్తం 30 నిమిషాలపాటు గోపాలపురంలో గడిపిన అళగిరి కుటుంబంతో సహా మదురైకి తిరిగి వెళ్లిపోయారు. మదురైలో నిన్న (గురువారం) మీడియాతో మాట్లాడుతూ, తండ్రి ఆరోగ్యంగా ఉన్నారని, గతంలో కంటే మెరుగైన తీరులో వ్యవహరిస్తున్నారని చెప్పారు. మీరు మరలా డీఎంకేలోకి వస్తారా అని ప్రశ్నించగా ‘నాన్న ఆహ్వానిస్తే వస్తా, అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని బదులిచ్చారు. ఈ విషయాన్ని గతంలోనే అనేకసార్లు చెప్పానని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment