కింగ్ మేకర్ రీ ఎంట్రీనా?
డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి మళ్లీ తెర మీదకొచ్చారు. నగారా మోగిన మరుక్షణం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే డీఎంకే అధిష్టానానికి హెచ్చరికలు ఇచ్చే వ్యాఖ్యల్ని మాజీ కింగ్ మేకర్ గురువారం సంధించారు. అలాగే, తమ కింగ్ మేకర్ రీ ఎంట్రీనా, తదుపరి కొత్త అడుగా అన్న ట్యాగ్‌లతో మద్దతుదారులు పోస్టర్లతో హల్‌చల్ సృష్టించే పనిలో పడ్డారు.
సాక్షి, చెన్నై : డీఎంకే నుంచి ఆ పార్టీ అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు, మాజీ కేంద్ర మంత్రి ఎంకే అళగిరి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. అళగిరి బహిష్కరణతో, ఆయన సోదరుడు, దళపతి ఎంకే స్టాలిన్ డీఎంకేలో కీలకంగా అవతరించారు. అలాగే, అళగిరి మద్దతు దారులు అనేక మందిని తన వర్గీయులుగా మలచుకోవడంలో స్టాలిన్ సఫలీకృతులయ్యారు. గతంలో బహిష్కరణకు గురైన అళగిరి మద్దతు దారులు పలువురు తన వాళ్లుగా మారడంతో, వారికి మళ్లీ పార్టీలో చోటు కల్పించడం మొదలెట్టారు. రానున్న ఎన్నికల్ని టార్గెట్ చేసి మనకు..మనమే అన్న నినాదంతో స్టాలిన్ దూసుకెళుతుంటే, తన నూ ‘కరుణించేనా’అన్నట్టుగా అధినేత ప్రసన్నం కోసం అళగిరి విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఫలితం శూన్యం.
గత నెల తన బర్త్‌డే సందర్భంగా డీఎంకే నుంచి ఏదేని ఆహ్వానం వస్తుందన్న ఆశతో అళగిరి ఎదురు చూశారు. తమ నేతకు ఆహ్వానం వస్తుందన్న ఆశతో అళగిరి వర్గీయులు పలువురు పోస్టర్లతో హల్‌చల్ సృష్టించినా, చివరకు మిగిలింది నిరాశే. ఈ పరిస్థితుల్లో తదుపరి అడుగు దిశగా అళగిరి వ్యూహ రచనల్లో పడ్డారు. అదే సమయంలో అళగిరి రీ ఎంట్రీనా...కొత్త అడుగా అన్న నినాదాన్ని అందుకుని పోస్టర్లతో హల్‌చల్‌కు మళ్లీ మద్దతు దారులు నిమగ్నమయ్యారు. ఈ సమయంలో మదురై నుంచి చెన్నైకు వచ్చిన అళగిరి డీఎంకే అధిష్టానానికి హెచ్చరికలు చేసే విధంగా కొత్త పల్లవి అందుకోవడం చర్చకు దారి తీసింది.
నగారాతో నిర్ణయం : ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉన్న అళగిరి ఎట్టకేలకు ప్రత్యక్షం అయ్యారు. మదురై నుంచి చెన్నైకు వచ్చిన ఆయన్ను మీడియా విమానాశ్రయంలో చుట్టుముట్టింది. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. డిఎంకే నుంచి ఆహ్వానం లేని దృష్ట్యా, తమరి తదుపరి నిర్ణయం ఏమిటో అని మీడియా ప్రశ్నించగా, ఎన్నికల నగారా మోగనీయండి, తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని సమాధానం ఇవ్వడం గమనార్హం. అలాగే, తమరి మద్దతు దారుల్ని మళ్లీ అక్కున చేర్చుకుంటున్నారే..? అని ప్రశ్నించగా, తన మద్దతు దారులెవ్వర్నీ పార్టీ నుంచి ఇంత వరకు తొలగించ లేదని వ్యాఖ్యానించారు. అలా, తొలగించాల్సి వస్తే లక్షల్లో తన వాళ్లను డీఎంకే నుంచి తొలగించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండంటూ పరోక్షంగా పార్టీ అధిష్ఠానానికి హెచ్చరికలు చేసి ముందుకు సాగడం గమనించాల్సిన విషయమే. కాగా, పార్టీ అధినేత ప్రసన్నం కోసమే ఇక్కడికి అళగిరి వచ్చినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, కరుణానిధి కరుణించేనా అన్నది వేచి చూడాల్సిందే.