
తిరుత్తణి: డీఎంకే ఎమ్మెల్యే చంద్రన్‌పై ఆ పార్టీ మహిళా నేత ఫేస్‌బుక్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ తిరువళ్లూరు జిల్లా డీఎంకే కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఇటీవల డీఎంకేలోని పవు విభాగాలకు జిల్లా స్థాయిలో కొత్తగా పదవులు కేటాయించారు. ఇప్పటి వరకు మహిళా కన్వీనర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించిన తిరుత్తణికి చెందిన ప్రియదర్శిని స్థానంలో కడంబత్తూరుకు చెందిన సరస్వతి చంద్రశేఖర్ నియమితులయ్యారు. దీంతో ప్రియదర్శిని గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే సోమవారం తన ఫేస్‌బుక్ పేజీలో కార్యదర్శి పదవి ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలని ఎమ్మెల్యే చంద్రన్ వేధించినట్లు ఆరోపించారు. తాను అంగీకరించక పోవడంతో మరో మహిళకు కార్యదర్శి పదవి కట్టబెట్టారని ఆరోపిస్తూ ఓ వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ వీడి యో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
రాజకీయ కుట్ర: ఎమ్మెల్యే
ఇక పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే పార్టీలో కొత్త వారికి పదవులు కట్టబెట్టినట్లు ఎమ్మెల్యే చంద్రన్ స్పష్టం చేశారు. మహిళా నేత ప్రియదర్శిని తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నాలుగు దశాబ్దాలుగా క్రమశిక్షణతో కూడిన రాజకీయం చేస్తున్నాని కొంత మంది స్వార్థం కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలిపారు. కాగా ప్రియదర్శిని అక్కసుతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొందరు డీఎంకే నాయకులు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment