
వేలూరు: తిరుపత్తూరు సమీపంలోని తన భార్యను కాపురానికి పంపలేదని అత్తపై ఆగ్రహించిన అల్లుడు అత్త మృతి చెందినట్లుగా శ్రద్ధాంజలి పోస్టర్‌ను ముద్రించి వాటిని అన్ని ప్రాంతాల్లో కరిపించడంతో పాటూ బంధువులకు వాట్సాప్ ద్వారా పంపిన ఘటన సంచలనం రేపింది.
తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని నిమ్మయంబట్టు గ్రామానికి చెందిన వెంకటేశన్ ఇతని భార్య వినోదిని దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. వెంకటేశన్ బ్యాంకులో లోన్ తీసుకొని పాడి పశువును కొనుగోలు చేసి బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించలేదు. దీంతో దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భార్య వినోదిని ఇలక్కినాయకన్‌పట్టి గ్రామంలో ఉన్న అమ్మగారింటికి రెండు నెలల క్రితం వెళ్లింది.
అక్కడ నుంచే వినోదిని వేరే దుకాణంలో పనిచేస్తోంది. ఇదిలా ఉండగా అత్త మాదు తన భార్యను కాపురానికి పంపకుండా అడ్డుకుంటుందని ఆగ్రహించిన వెంకటేశన్ అత్త ప్రాణాలతో ఉన్నప్పటికీ ఆమె మృతి చెందినట్లు శ్రద్ధాంజలి బ్యానర్, పోస్టర్‌లు వేసుకొని చుట్టు పక్కల కరిపించడంతో పాటూ భార్య వినోదిని బంధువులకు వాట్సాప్ పంపాడు. ఈ విషయాన్ని బంధువులు వినోదినికి పోన్ చేసి విషయాన్ని తెలిపారు. దీంతో వినోదిని తన భర్త వెంకటేష్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంకటేష్ ను అరెస్ట్ చేశారు.