'రజనీకాంత్ నాకు మంచి స్నేహితుడు'
చెన్నై: ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ తనకు మంచి స్నేహితుడని డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరి అన్నారు. శుక్రవారం రజనీకాంత్ నివాసంలో ఆయనను అళగిరి కలిశారు. భేటీ అనంతరం అళగిరి మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు దయానిధి అళగిరి సినిమా కార్యక్రమానికి రావాలని రజనీకాంత్ను ఆహ్వానించినట్లు తెలిపారు. వ్యక్తిగత విషయాలను చర్చించామని, తమ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు లేవని అళగిరి స్పష్టం చేశారు.
కాగా డీఎంకే తనకు ఎంపీ టిక్కెట్ నిరాకరించిన నేపథ్యంలో అళగిరి సొంతంగా కొత్త పార్టీ పెడుతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిశారు. అయితే రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తానని చెప్పిన ఆయన, ఎటువంటి పాత్ర పోషిస్తాననేది ఇప్పుడే వెల్లడించబోనని అన్నారు. తన మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటానని చెప్పారు.