కొత్త పార్టీపై అళగిరి నో కామెంట్
న్యూఢిల్లీ: డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరి.. ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిశారు. మర్యాదపూర్వకంగానే ప్రధానమంత్రిని కలిసినట్టు అళగిరి చెప్పారు. 2009 నుంచి 2013 వరకు కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపానని వెల్లడించారు.
డీఎంకే తనకు ఎంపీ టిక్కెట్ నిరాకరించిన నేపథ్యంలో సొంతంగా కొత్త పార్టీ పెడుతున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించేందుకు అళగిరి నిరాకరించారు. అయితే రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తానని చెప్పారు. ఎటువంటి పాత్ర పోషిస్తాననేది ఇప్పుడే వెల్లడించబోనని అన్నారు. తన మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటానని చెప్పారు. తండ్రి, సోదరుడిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అళగిరి.. ప్రధానమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.