
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం వేలూరు లోక్‌సభ ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఎన్నికలు జరపాలంటూ అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినపుడు ఎన్నికలను రద్దు చేసే అధికారం ఈసీకి ఉందని, రాష్ట్రపతి ఆమోదం పొందినందున ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది.
వేలూరు నియోజకవర్గంలో డీఎంకే నేతల ఇళ్లల్లో రూ.11.10 కోట్ల నగదు స్వాధీనం నేపథ్యంలో వేలూరు లోక్‌సభ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఈసీ ప్రకటించడం తెల్సిందే. డబ్బు పంపిణీ వల్ల తమిళనాడులో ఎన్నికలు వాయిదాపడటం ఇదే తొలిసారి కాదు. జయలలిత మరణానంతరం ఆమె ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ ఆసెంబ్లీ స్థానానికి 2017లో జరగాల్సిన ఉప ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. ఆ ఏడాది డిసెంబర్‌లో ఆ ఉప ఎన్నిక జరిగింది. 2016 మే నెలలోనూ తంజావూరు, అరవకురుచ్చిల్లో జరగాల్సిన ఎన్నికలను ధనప్రవాహం కారణంగానే ఈసీ వాయిదా వేసింది.